తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7 నుండి 13 తేదీ వరకు వారం రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహిస్తుండటం ముదావహం. మధ్యయుగం (12–14 శతాబ్దాలు)లో విలసిల్లిన కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. కాకతీయుల నిర్మాణాలైన దేవాలయాలు, కోటలు; తవ్వించిన చెరువులు, వారి కళాపోషణ వంటివాటి గురించి ఈ తరానికి స్ఫూర్తినందించే విధంగా కార్యక్రమాలు రూపొందాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా చందుపట్లలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే కాకతీయ సామ్రాజ్యానికి గొప్ప పేరు తెచ్చిన రుద్రమదేవి మరణాన్ని తెలియజేసే శాసనం ఉంది. వరంగల్ జిల్లాలో ఉన్న అనేక కాకతీయ కట్టడాలు, చెరువుల దగ్గర మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి.
వరంగల్‌ను పూర్వం ‘ఏకశిలా నగరం’, ఓరుగల్లు అనీ పిలిచేవారు. ‘కాకతి’ అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులకు ఆ పేరు వచ్చింది. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటివారు ఈ రాజుల్లో పేరుపొందినవారు. వీరు వ్యవసాయం కోసం వేలాది చెరువు లను తవ్వించారు. అందులో ముఖ్యమైనవి పాకాల, లక్నవరం, బయ్యారం చెరువులు.
వరంగల్ కోట, హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, పాలంపేట రామప్ప దేవాలయం వంటి ప్రసిద్ధ దేవాల యాలు, అనేక తోరణాలు – వీరి కాలంలోనే నిర్మితమయ్యాయి. అందులో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా కూడా లభించింది. అలనాడు తవ్విన అనేక చెరువులు ఇప్పటికీ తెలంగాణలో వ్యవసాయానికి ప్రాణాధారంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాటి చెరువుల పునరుద్ధరణకు ‘మిషన్ కాకతీయ’ను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంగా కాకతీయుల ‘తోరణా’న్ని గ్రహించారు. హంసలు, పూర్ణకుంభం, గర్జించే సింహాలు, మొసలి వంటి శిల్పాలు ఈ తోరణంపై ఉన్నాయి.
– ఈదునూరి వెంకటేశ్వర్లు, వరంగల్
Comments
Please login to add a commentAdd a comment