chandupatla
-
కమ్యూనిస్ట్ ఉద్యమ మార్గదర్శి
కమ్యూనిస్టు విప్లవ లక్ష్యం కోసం, దేశంలో ఒక మనిషిని మరో మనిషి దోచుకోవడానికి వీలులేని సమసమాజ స్థాపన కోసం తన సర్వస్వాన్నీ అర్పించారు కామ్రేడ్ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ). 1917 జూన్ 1వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి గ్రామంలో జన్మించిన డీవీ సొంతూరు ఉమ్మడి నల్లగొండ జిల్లా బండమీది చందుపట్ల. ఆయనది భూస్వా ముల కుటుంబం. 1939లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించిన డీవీ పూర్తిస్థాయి కార్యకర్తగా నల్లగొండ జిల్లాలో ఉద్యమ నిర్మాణం ప్రారంభించారు. తెలంగాణ ప్రజల సాయుధపోరాటం (1946–51) అన్ని దశల్లోనూ కీలక పాత్ర నిర్వహించారు. ఆనాడు భూస్వాముల నికృష్టమైన, క్రూరమైన దోపిడీ, దౌర్జన్యాలనుండి ప్రజలను రక్షించడానికి ఆయన ఎంతగానో పోరాడారు. భూమి సమస్యను విప్లవోద్యమంతో ముడిపెట్టి ఉన్నతస్థాయి పోరాటాలకు ప్రజలను సమా యత్తం చేయటానికి డీవీ అనుసరించిన విధానాలు, ఎత్తుగడలు కీలకమై నవి. వాస్తవానికి తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించాలనే ధోరణిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ 1949లోనే ఒక డాక్యుమెంట్‌ను రచించారు. ప్రజలు నేడు ఫ్యూడల్ భూస్వాముల, బడా పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల దోపిడీలు అనే మూడు బరువులను మోస్తున్నారనీ; ఈ దోపిడీలను సమూలంగా రద్దుచేసి ఒక నూతన ప్రజాతంత్ర వ్యవస్థను స్థాపించుకున్నప్పుడే దేశంలోని అన్ని రంగాల ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఆయన ఉద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనకు, దేశప్రజల విముక్తి కోసం విప్లవ పంథాను రూపొందించారు. భారత పాలక వర్గాలు తమపై కుట్ర కేసు (హైదరాబాదు కుట్ర కేసుగా అది ప్రసిద్ధిగాంచింది) బనాయించినపుడు కోర్టులో తమ విప్లవ కార్యక్రమాన్నీ, లక్ష్యాలనూ బహిరంగంగా డీవీ ప్రకటించారు. (క్లిక్: తరతరాలనూ రగిలించే కవి) భారత విప్లవోద్యమంలో పొడచూపిన అనేక పెడధోరణులను ఎండగట్టారు. విప్లవ కర్తవ్య నిర్వహణలో కమ్యూనిస్టు విప్లవ యోధుడు కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి (టీఎన్)తో భుజం భుజం కలిపి నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైనది. 1975 ఏప్రిల్‌లో టీఎన్తో కలిసి యూసీసీఆర్ఐ (ఎంఎల్)ను స్థాపించి పనిచేశారు. చివరికి 1984 జూలై 12వ తేదీన అమరులయ్యారు. కమ్యూనిస్టు విప్లవ లక్ష్యంకోసం ఆయన మార్గంలో కర్తవ్యోన్ముఖులు కావడమే ఆ విప్లవ మూర్తికి మనమందించే నిజమైన నివాళులు. – సి. భాస్కర్, యూసీసీఆర్ఐ (ఎంఎల్) (జూలై 12న దేవులపల్లి వెంకటేశ్వరరావు వర్ధంతి) -
కాకతీయ ఉత్సవాలు అద్భుతం!
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘‘మా పూర్వీకులు పరిపాలించిన గడ్డ మీదకు రావడం సంతోషంగా ఉంది. 700 ఏళ్ల కిందటి మా వంశస్థుల పరిపాలన, అభివృద్ధి, సంక్షేమాన్ని గుర్తు చేసుకుంటూ ఉత్సవాలను నిర్వహించడం గర్వంగా ఉంది. నన్ను ఆహ్వానించిన ప్రభుత్వానికి, నాయకులకు నా ధన్యవాదాలు. ఓరుగల్లు ప్రజలు మా పట్ల చూపిన ఆదరణ అమోఘం. త్వరలో కుటుంబ సమేతంగా వస్తా..’’ అని కాకతీయుల 22వ వారసుడు, బస్తర్ రాజు రాజా కమల్ చంద్ర భంజ్‌దేవ్ సంతోషం వ్యక్తం చేశారు. కాకతీయ వైభవ సప్తాహంలో పాల్గొనేందుకు గురువారం వరంగల్‌కు వచ్చిన కమల్ చంద్ర భంజ్‌దేవ్‌కు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘జనరంజక పాలన అందించి, ప్రజాసేవకు అంకితమైన పూర్వీకుల స్ఫూర్తితో బస్తర్‌లో సమాజ సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం. కాకతీయుల స్ఫూర్తి, ఉత్సాహం ఎల్లప్పుడూ ఉండాలి. అందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సప్తాహం వేడుకలు నిర్వహించడం గర్వంగా ఉంది. దేశ చరిత్రలో ఇదొక మరపురాని రోజు..’’ అని భంజ్‌దేవ్ పేర్కొన్నారు. కాకతీయులు రోల్ మోడల్‌గా తెలంగాణలో అనేక పథకాలు నడుస్తున్నాయని, మిషన్ కాకతీయ పథకం అద్భుతమని కొనియాడారు. తెలంగాణ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. కాకతీయులు ఆదర్శంగానే పాలన: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కాకతీయుల చరిత్రను భావి తరాలకు తెలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాకతీయుల చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తున్నామని.. వారి వారసుడిని పిలిచి ఉత్సవాలు చేస్తున్నామని చెప్పారు. వరంగల్ అంటే కేసీఆర్‌కు ప్రేమ ఎక్కువన్నారు. కాకతీయుల ఆదర్శంతోనే తెలంగాణ ప్రభుత్వం ఆలయాలను, చెరువులను అభివృద్ధి చేస్తోందన్నారు. గత ప్రభుత్వాలు కాకతీయ ఘన చరిత్రను మరుగునపడేలా చేశాయని, కేసీఆర్ పట్టుదలతో నేడు ఆ చరిత్ర ప్రపంచానికి తెలిసిందని పేర్కొన్నారు. ఇక తాను కాకతీయ గడ్డపై పుట్టినందుకు సంతోషంగా ఉందని మంత్రి సత్యవతిరాథోడ్ చెప్పారు. కాకతీయుల పాలన ప్రభుత్వాలకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రాణించాలని భద్రకాళి అమ్మవారిని వేడుకున్నామన్నారు. ఓరుగల్లు కోటలో సప్తాహం షురూ.. భద్రకాళి ఆలయంలో పూజల అనంతరం కమల్‌చంద్ర భంజ్‌దేవ్.. రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత వరంగల్ కోటను సందర్శించారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గుర్రపు బండిపై భంజ్‌దేవ్‌తోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, సత్యవతిరాథోడ్, చీఫ్‌విప్ వినయభాస్కర్, ఎమ్మెల్యే నరేందర్ ఊరేగారు. వరంగల్ కోట, కళా తోరణాలు, సాంస్కృతిక వైభవాన్ని పరిశీలించిన భంజ్‌దేవ్ భావోద్వేగానికి గురయ్యారు. వరంగల్ కోటలో బెలూన్లను ఎగురవేసి ‘కాకతీయ వైభవ సప్తాహం’ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం వేయి స్తంభాల గుడిలో అభిషేకం నిర్వహించారు. అగ్గిలయ్య గుట్టను సందర్శించి మొక్కలు నాటారు. అక్కడి నుంచి కాకతీయ హరిత హోటల్‌కు చేరుకుని.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, వినయభాస్కర్, కలెక్టర్లకు బస్తర్ పరిపాలన జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బండా ప్రకాష్, బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. (క్లిక్: ఆ ఇద్దరి నేతల మధ్య.. బస్తీ మే సవాల్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
స్ఫూర్తినిచ్చే ‘కాకతీయ వైభవం’
తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7 నుండి 13 తేదీ వరకు వారం రోజుల పాటు ‘కాకతీయ వైభవ సప్తాహం’ నిర్వహిస్తుండటం ముదావహం. మధ్యయుగం (12–14 శతాబ్దాలు)లో విలసిల్లిన కాకతీయ సామ్రాజ్య వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసింది. కాకతీయుల నిర్మాణాలైన దేవాలయాలు, కోటలు; తవ్వించిన చెరువులు, వారి కళాపోషణ వంటివాటి గురించి ఈ తరానికి స్ఫూర్తినందించే విధంగా కార్యక్రమాలు రూపొందాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లా చందుపట్లలో పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడే కాకతీయ సామ్రాజ్యానికి గొప్ప పేరు తెచ్చిన రుద్రమదేవి మరణాన్ని తెలియజేసే శాసనం ఉంది. వరంగల్ జిల్లాలో ఉన్న అనేక కాకతీయ కట్టడాలు, చెరువుల దగ్గర మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరంగల్‌ను పూర్వం ‘ఏకశిలా నగరం’, ఓరుగల్లు అనీ పిలిచేవారు. ‘కాకతి’ అనే దేవతను పూజించడం వల్ల కాకతీయులకు ఆ పేరు వచ్చింది. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు వంటివారు ఈ రాజుల్లో పేరుపొందినవారు. వీరు వ్యవసాయం కోసం వేలాది చెరువు లను తవ్వించారు. అందులో ముఖ్యమైనవి పాకాల, లక్నవరం, బయ్యారం చెరువులు. వరంగల్ కోట, హనుమకొండలోని వేయి స్తంభాల గుడి, పాలంపేట రామప్ప దేవాలయం వంటి ప్రసిద్ధ దేవాల యాలు, అనేక తోరణాలు – వీరి కాలంలోనే నిర్మితమయ్యాయి. అందులో రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపద హోదా కూడా లభించింది. అలనాడు తవ్విన అనేక చెరువులు ఇప్పటికీ తెలంగాణలో వ్యవసాయానికి ప్రాణాధారంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నాటి చెరువుల పునరుద్ధరణకు ‘మిషన్ కాకతీయ’ను చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార చిహ్నంగా కాకతీయుల ‘తోరణా’న్ని గ్రహించారు. హంసలు, పూర్ణకుంభం, గర్జించే సింహాలు, మొసలి వంటి శిల్పాలు ఈ తోరణంపై ఉన్నాయి. – ఈదునూరి వెంకటేశ్వర్లు, వరంగల్ -
వివాహలకు బియ్యం పంపిణీ
చందుపట్ల(భువనగిరి అర్బన్) : పలు గ్రామాల్లోని పేద రైతుల కుమార్తెల వివాహాలకు చందుపట్ల పీఏసీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. మండలంలోని చీమలకొండూరు గ్రామానికి చెందిన మొలుగు రాములు కుమార్తె, ముస్త్యాలపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ వహిద్‌అలీ కుమార్తె, వీరవెల్లి గ్రామానికి చెందిన ఆముదాల నరేందర్‌రెడ్డి కుమార్తె, చందుపట్ల గ్రామానికి చెందిన దరకంటి చంద్రయ్య కుమార్తెల వివాహలకు ఒక్కొక్క రైతు కుటుంబానికి 100 కేజీల బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు బల్గూరి మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్. భిక్షపతి, సీఈఓ దంతూరి నర్సింహ, డైరెక్టర్లు నీల పార్వతమ్మ, బిజ్జాల వెంకటే శ్వర్లు, అంగడి బుచ్చయ్య, నల్ల ఎల్లయ్య, లక్ష్మారెడ్డి, చిన్నం రాములు, పాపిరెడ్డి, సిబ్బంది నర్సింహ, రాములు ఉన్నారు. -
యువకులు క్రీడల్లో రాణించాలి
చందుపట్ల(భువనగిరి అర్బన్) : గ్రామీణ యువకులు క్రీడా రంగంలో ముందుండి మండలానికి మంచి పేరు తీసుకరావాలని సర్పంచ్ చిన్నం శ్రీనివాస్ అన్నారు. భువనగిరి రూరల్ పోలీస్, కూనూరు గ్రామ సోల్జర్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం చందుపట్ల గ్రామంలో నిర్వహించిన మండల స్థాయి క్రీడాపోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఇందులో భాగంగా ఈ పోటీలకు మండలంతో పాటు ఇతర మండలాల నుంచి మొత్తం 20 టీంలు వచ్చినట్లు తెలిపారు. పోటీలలో గెలుపొందిన వారికి ఆగస్టు 15న నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవం కార్యక్రమం అనంతరం బహుమతులను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు బల్గూరి మధుసూదన్‌రెడ్డి, అధ్యక్షుడు పాశం శివానంద్, సభ్యులు గుర్రం ప్రమోద్, చిన్నం తిరుమల్, మధుసూదన్ తదితరులు ఉన్నారు. -
మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం
చందుపట్ల(భువనగిరి అర్బన్) : మండలంలోని చందుపట్ల గ్రామానికి చెందిన రైతు దరకంటి నర్సయ్య(67) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. సంఘంలో సభ్యత్వం ఉండడంతో మృతుడి కుటుంబానికి చందుపట్ల పీఏసీఎస్ బ్యాంకు సంఘ సభ్యుల డివిడెండ్ నిధి నుంచి రూ. 30 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బల్గూరి మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్. భిక్షపతి, సీఈఓ దంతూరి నర్సింహ, డైరెక్టర్లు నీల పార్వతమ్మ, సిబ్బంది నర్సింహ, రాములు పాల్గొన్నారు.