కమ్యూనిస్ట్‌ ఉద్యమ మార్గదర్శి | Devulapalli Venkateswara Rao: Comrade DV Rao Biography, UCCRI | Sakshi
Sakshi News home page

కమ్యూనిస్ట్‌ ఉద్యమ మార్గదర్శి

Published Tue, Jul 12 2022 12:28 PM | Last Updated on Tue, Jul 12 2022 12:28 PM

Devulapalli Venkateswara Rao: Comrade DV Rao Biography, UCCRI - Sakshi

కమ్యూనిస్టు విప్లవ లక్ష్యం కోసం, దేశంలో ఒక మనిషిని మరో మనిషి దోచుకోవడానికి వీలులేని సమసమాజ స్థాపన కోసం తన సర్వస్వాన్నీ అర్పించారు కామ్రేడ్‌ దేవులపల్లి వెంకటేశ్వరరావు (డీవీ). 1917 జూన్‌ 1వ తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లా మానుకోట తాలూకా ఇనుగుర్తి గ్రామంలో జన్మించిన డీవీ సొంతూరు ఉమ్మడి నల్లగొండ జిల్లా బండమీది చందుపట్ల. ఆయనది భూస్వా ముల కుటుంబం. 1939లో కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించిన డీవీ పూర్తిస్థాయి కార్యకర్తగా నల్లగొండ జిల్లాలో ఉద్యమ నిర్మాణం ప్రారంభించారు. తెలంగాణ  ప్రజల సాయుధపోరాటం (1946–51) అన్ని దశల్లోనూ కీలక పాత్ర నిర్వహించారు. ఆనాడు భూస్వాముల నికృష్టమైన, క్రూరమైన దోపిడీ, దౌర్జన్యాలనుండి ప్రజలను రక్షించడానికి ఆయన ఎంతగానో పోరాడారు. 

భూమి సమస్యను విప్లవోద్యమంతో ముడిపెట్టి ఉన్నతస్థాయి పోరాటాలకు ప్రజలను సమా యత్తం చేయటానికి డీవీ అనుసరించిన విధానాలు, ఎత్తుగడలు కీలకమై నవి. వాస్తవానికి తెలంగాణ సాయుధ పోరాటాన్ని విరమించాలనే ధోరణిని ఆయన తీవ్రంగా ఖండిస్తూ 1949లోనే ఒక డాక్యుమెంట్‌ను రచించారు.

ప్రజలు నేడు ఫ్యూడల్‌ భూస్వాముల, బడా పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల దోపిడీలు అనే మూడు బరువులను మోస్తున్నారనీ; ఈ దోపిడీలను సమూలంగా రద్దుచేసి ఒక నూతన ప్రజాతంత్ర వ్యవస్థను స్థాపించుకున్నప్పుడే దేశంలోని అన్ని రంగాల ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయనీ ఆయన ఉద్ఘాటించారు. ఈ లక్ష్య సాధనకు, దేశప్రజల విముక్తి కోసం విప్లవ పంథాను రూపొందించారు. భారత పాలక వర్గాలు తమపై కుట్ర కేసు (హైదరాబాదు కుట్ర కేసుగా అది ప్రసిద్ధిగాంచింది) బనాయించినపుడు కోర్టులో తమ విప్లవ కార్యక్రమాన్నీ, లక్ష్యాలనూ బహిరంగంగా డీవీ ప్రకటించారు. (క్లిక్‌: తరతరాలనూ రగిలించే కవి)

భారత విప్లవోద్యమంలో పొడచూపిన అనేక పెడధోరణులను ఎండగట్టారు. విప్లవ కర్తవ్య నిర్వహణలో కమ్యూనిస్టు విప్లవ యోధుడు కామ్రేడ్‌ తరిమెల నాగిరెడ్డి (టీఎన్‌)తో భుజం భుజం కలిపి నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైనది. 1975 ఏప్రిల్‌లో టీఎన్‌తో కలిసి యూసీసీఆర్‌ఐ (ఎంఎల్‌)ను స్థాపించి పనిచేశారు. చివరికి 1984 జూలై 12వ తేదీన అమరులయ్యారు. కమ్యూనిస్టు విప్లవ లక్ష్యంకోసం ఆయన మార్గంలో కర్తవ్యోన్ముఖులు కావడమే ఆ విప్లవ మూర్తికి మనమందించే నిజమైన నివాళులు.

– సి. భాస్కర్, యూసీసీఆర్‌ఐ (ఎంఎల్‌)
(జూలై 12న దేవులపల్లి వెంకటేశ్వరరావు వర్ధంతి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement