చంద్రబాబు సభ.. బయటపడ్డ డొల్లతనం!
సాక్షి, కాకినాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం చేపట్టిన ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు ప్రజలు రాకపోవడంతో స్థానిక టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పలు వేదికల మీద ప్రసంగించారు. అయితే ఎన్నికల హామీలు నెరవేర్చక పోవడం, కాపులకు రిజర్వేషన్ల హామీతో మోసం చేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని చంద్రబాబు సర్కార్ పై స్థానికుల్లో నెలకొన్న తీవ్ర అసంతృప్తి వెలుగుచూసింది.
దీంతో చంద్రబాబు సభలకు కూడా ప్రజలు రాకపోవడంతో టీడీపీ శ్రేణులకు ఏం చేయాలో పాలుపోలేదు. దీంతో టీడీపీ సర్కార్ పాలనలోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. మరోవైపు సీఎం చంద్రబాబు ప్రచారానికి రానున్నారని టీడీపీ శ్రేణులు నగరమంతా టీడీపీ పోస్టర్లు, ఫ్లెక్సీలతో పచ్చమయం చేశారు. అయితే దీనిపై స్పందించాల్సిన అధికారులు మాత్రం ఏ చర్య తీసుకోకపోవడం గమనార్హం.
కాకినాడ నాగమల్లితోట జంక్షన్ దగ్గర సీఎం మాట్లాడుతుండగా.. టీడీపీ జెండాలు చేతపట్టుకున్న కొందరు మహిళలు మాత్రం అదేం పట్టించుకోకుండా కూర్చోవడం గమనించవచ్చు. బలవంతంగా చంద్రబాబు తీసుకొచ్చిన తరహాలో మహిళలు సభ నుంచి వెళ్లిపోవడం టీడీపీ శ్రేణులకు చెమటలు పట్టిస్తోంది. దీంతో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి ఓటమి తప్పదని అధికార టీడీపీ శ్రేణులే చర్చించుకుంటున్నట్లు సమాచారం.