షరామామూలే..!
→ టమాటా మండీ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్
→ టమాట మార్కెట్లో కనిపించని డిజిటల్ బోర్డుల జాడ
→ పట్టించుకోని మార్కెటింగ్‌శాఖ అధికారులు
అనంతపురం రూరల్ : టమాట మార్కెట్లో కథ మళ్లీ మొదటికి వచ్చింది. అనంతపురం రూరల్ మండల పరిధిలోని కక్కలపల్లి గ్రామ సమీపంలోని టమాట మండీ మార్కెట్ నిర్వాహకులు, వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను మోసం చేస్తున్నారు. ప్రతి రోజు రైతులు టన్నుల కొద్ది టమాటలను మార్కెట్‌కు తీసుకువచ్చి మద్దతు ధర లేక నిరాశతో వెనుదిరుగుతున్నారు. టమాటను మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినాlఎవరూ పట్టించుకోవడం లేదు.
మంత్రి మాటలు బేఖాతరు
నెల క్రితం మంత్రి పరిటాల సునీత మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి టమాట మండీని పరిశీలించారు. టమాట ధరలను తెలిపే డిజిటల్ బోర్డులను ప్రతి మండీ ఎదుట ఏర్పాటు చేసి టమాట రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు రైతులకు కనీస మౌలిక వసతులను కల్పించాలని మండి నిర్వహకులకు సూచించినా వారు ఏమాత్రం పట్టించు కోలేదు. ఎక్కడ టమాట ధరలు తెలిపే బోర్డులు కూడా కనిపించడం లేదు. ఒక మండీలో ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డు కూడా పనిచేయడం లేదు.
మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రయోజనంలేదు
మార్కెట్‌కు టమాటలను తీసుకువచ్చే రైతులకందరికీ కనిపించే విధంగా మార్కెటింగ్ శాఖ అధికారులు బహిరంగ ప్రాంతంలో ధరలు తెలిపే డిజిటల్ బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఒక మార్కెట్ లోపలి భాగంలో డిజిటల్ బోర్డును అధికారులు ఏర్పాటు చేశారు. మిగిలిన మండీలకు టమాటాలను తీసుకెళ్లే రైతులకు ధరలు తెలియక వ్యాపారులు చెప్పిన ధరలకే సరుకును అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారు.
డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయిస్తాం: హిమశైల, ఏడీ, మార్కెటింగ్‌శాఖ
వివిధ ప్రాంతాల్లోని మార్కెట్లలో టమాట ధరలను తెలిపే డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటాం.