ఎమ్మెల్యే శివ జలదీక్ష భగ్నం
సమైక్యాంధ్ర ఆందోళనలో భాగంగా ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఉండి సెంటర్ వద్ద పంటకాలువలో నీళ్లలో నిలబడి జలదీక్ష చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేవరకు దీక్ష కొనసాగిస్తానని ప్రకటించారు. సీమాంధ్రలో ఉద్యమం రోజురోజుకి తీవ్రమవుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే జలదీక్ష విషయం తెలుసుకున్న నరసాపురం డీఎస్పీ రఘువీరారెడ్డి, భీమవరం రూరల్ సీఐ శివాజీరావు ఘటనా స్థలానికి చేరుకుని దీక్ష విరమించాలని కోరగా, ప్రాణం పోయినా దీక్షను విరమించేది లేదని శివ భీష్మించారు. ఉదయం 11.20 గంటలకు ప్రారంభమైన దీక్ష రాత్రి 8.30 గంటల వరకు కొనసాగింది. సమైక్యవాదులు అధిక సంఖ్యలో వచ్చి జలదీక్షను తిలకించారు.
రాత్రి చీకటిలో కాలువలో దీక్ష కొనసాగించడం సరికాదని, విరమించాలని పోలీసులు ఎమ్మెల్యేకు చెప్పినా వినిపించుకోలేదు. దీంతో రాత్రి 8.30 గంటలకు పోలీసులు ఎమ్మెల్యేను బలవంతంగా కాలువ నుంచి బయటకు తీసుకువచ్చి దీక్షను భగ్నం చేశారు. అనంతరం 108లో భీమవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.ప్రభాకర్ ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే కోరిక మేరకు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.