9వేల మందితో బందోబస్తు
జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు
ఎక్కువమంది కలిసి ఒకే వాహనం వినియోగిస్తే మేలు
పాలిథిన్ కవర్ల వాడకంపై నియంత్రణ అవసరం
నకిలీల బెడకు పాస్‌లపై హోలోగ్రామ్‌లు
రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు వెంకటరంగారావు
వరంగల్ క్రైం, న్యూస్‌లైన్ : మేడారం జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్టు రూరల్ ఎస్పీ లేళ్ల కాళిదాసు వెంకటరంగారావు అన్నారు. జాతరకు వచ్చేందుకు ప్రజలు ఎక్కువ వాహనాలు వినియోగించకుండా తెలిసిన వ్యక్తులందరూ కలిసి పెద్ద వాహనంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ జామ్‌ను నివారించవచ్చన్నారు. అలాగే పాలిథిన్ కవర్లను వినియోగించవద్దని, వాటివల్ల పర్యావరణం దెబ్బతింటుందని సూచించారు. సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా మేడారంలో చేస్తున్న ఏర్పాట్లపై ఆయన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
పటిష్ట బందోబస్తు
తొమ్మిదివేల మంది పోలీసులతో జాతరలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. ట్రాఫిక్ జామ్, అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జాతర అవసరాలకు సంబంధించి ఓ చెక్‌లిస్ట్ తయారుచేసి సెక్టార్ ఇన్‌చార్జ్‌లకు ఇచ్చాం. వాటి ప్రకారం ఆయా ఇన్‌చార్జ్‌లు నడుచుకుంటారు. ఇలా ఎప్పటికప్పుడు చెక్‌చేసుకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తే ప్రశ్న ఉండదు. అలాగే జాతరకు సంబంధించి మార్గదర్శకాలను పై అధికారులకు అందజేశాం. వాటి ఆధారంగా పనులు ముందుకు సాగుతున్నాయి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే భక్తులు బంగారం(బెల్లం) వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. జాతరలో స్పోరియన్ బెల్లం దిగుమతి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెల్లబెల్లాన్ని పరీక్షించి తీసుకోవాలి. అలాగే ప్లాస్టిక్ వాడకంపై నియంత్రణ పాటించాలి. వ్యర్థాలను ఎక్కడికక్కడ పడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక పాలిథిన్ కవర్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. వాటిని వాడి పడేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. భూమిలో కలిసిపోవు సరికదా.. పర్యావరణానికి తీవ్ర విఘాతం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం సూచించిన నాణ్యత గల క్యారీ బ్యాగులనే ఉపయోగించాలి.
వ్యక్తిగత క్రమశిక్షణ ముఖ్యం
భక్తులు వ్యక్తిగత క్రమశిక్షణ పాటించాలి. అమ్మవారు గద్దెకు చేరుకునే సమయంలో జనాలు పెద్దమొత్తంలో ఉండడంతో తోపులాట జరిగే అవకాశం ఉంది. దీనికితోడు గద్దెలపై బంగారం(బెల్లం) ఉంటుంది కాబట్టి జారిపడే అవకాశాలు ఉంటాయి. నెమ్మదిగా గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లిస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. వీఐపీ పాస్‌లపై కూడా శ్రద్ధ చూపిస్తున్నాం. పాస్‌లకు హోలోగ్రామ్ ముద్రించడం వల్ల నకిలీల బెడద ఉండదు.
అప్పుడు చాలా తక్కువ
1998లో నేను ములుగు డీఎస్పీగా ఉన్నప్పుడు జాతరకు వచ్చే భక్తుల సంఖ్య తక్కువగానే ఉండేది. దీంతో భక్తుల కంటే అప్పటి పరిస్థితులను బట్టి మావోయిస్టులపైనే ఎక్కువగా నిఘాపెట్టేవాళ్లం. అప్పట్లో మావోయిస్టులు జాతరలో పోస్టర్లు అతికించేవారు. అటువంటివి జరగకుండా నిత్యం కూంబింగ్ నిర్వహించేవాళ్లం.
అభివృద్ధికి సంకేతమే డీజీపీ పర్యటన
వరంగల్ ఏజెన్సీలో డీజీపీ పర్యటించడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన ఏటూరునాగారం ఏజెన్సీకి డీజీపీ రోడ్డు మార్గంలో రావడం వెన క ఓ మంచి ఉద్దేశం ఉంది. ఆ స్థాయి వ్యక్తి సాధారణ పౌరుడిలా ఏజెన్సీ అంతా తిరిగితే నక్సలిజం అనేది లేదనే సంకేతాలు పారిశ్రామిక వేత్తలకు అందుతాయి. దీంతో ఆ ప్రాం తాభివృద్ధికి వారు సహకరిస్తారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తారు. ఏజెన్సీ ఏరియాలు కూడా అభివృద్ధి చెం దుతున్నాయనే విషయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేయడమే డీజీపీ పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం.