సర్వే జనరల్ ఆఫ్ ఇండియా@ 250
న్యూఢిల్లీ : దేశంలో పౌర, సైనిక అవసరాలకు మ్యాపుల్ని రూపొందించే సర్వే జనరల్ ఆఫ్ ఇండియా(ఎస్జీఐ) నేటితో 250 ఏళ్లు పూర్తిచేసుకుంది. దేశ, రాష్ట్రాల సరిహద్దులు, నదులు, డ్యాములు, రోడ్లు, వరద ప్రభావిత మైదాన ప్రాంతాలు, వివిధ స్థలాకృతులతో పాటు పట్టణ, నగర ప్రణాళిక మ్యాపుల్ని రూపొందించడం ఎస్జీఐ విధుల్లో ప్రధానమైనవి. 1767లో సర్వే జనరల్ ఆఫ్ ఇండియాను స్థాపించారు. ఎస్జీఐ తొలిసారి 1783లో అవిభక్త భారత్ పటాన్ని ‘మ్యాప్ ఆఫ్ హిందుస్తాన్’గా విడుదల చేసింది. అందులో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో పాటు అఫ్ఘానిస్తాన్, మయన్మార్‌లోని కొన్ని భూభాగాలున్నాయి.
భారత్‌లోని భూభాగాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి 1802లో ఎస్జీఐ ‘ట్రిగొనమెట్రిక్ సర్వే’ను జరిపింది. మద్రాసు రాష్ట్రంలోని సెయింట్ థామస్ పర్వతం నుంచి ముస్సోరీ వరకూ 40 ఏళ్లS పాటు ఈ సర్వే సాగింది. ఈ సర్వే గురించి ఎస్జీఐ అధికారి లెఫ్టినెంట్ కల్నర్ కునాల్ బోర్కర్ మాట్లాడుతూ ‘రెండు ప్రపంచ యుద్ధాల కంటే ఈ సర్వేలోనే ఎక్కువమంది భారతీయులు చనిపోయారు. మలేరియా, వడదెబ్బ, కొండ చరియలు విరిగిపడడం వంటి కారణాలతో చాలామంది మృత్యువాతపడ్డారు’ అని తెలిపారు.
ఈ సర్వేకు నేతృత్వం వహించిన కల్నల్ విలియం లాంబ్టన్ చనిపోవడంతో సర్ జార్జ్ ఎవరెస్ట్ ప్రాజెక్టుకు నేతృత్వం వహించారు. ఈయన పేరు మీదే ఎవరెస్ట్ పర్వతానికి ఆపేరు పెట్టారు. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఎవరెస్ట్ పర్వతం ఎత్తును భారతీయ గణితశాస్త్రవేత్త రాధనాథ్ సిక్డర్ లెక్కల సాయంతోనే ఎస్జీఐ నిర్థారించింది. దీన్ని అప్పట్లో చాలామంది యూరోపియన్లు సవాలు చేశారు. కానీ రాధనాథ్ అంచనాలే చివరికి నిజమయ్యాయి. ప్రస్తుతం ఎస్జీఐ సైన్యం కోసం జియో స్పేషియల్ (భౌగోళిక) మ్యాపుల్ని తయారుచేస్తోంది. వీటి కోసం మానవ రహిత విమానాలను ఉపయోగిస్తోంది.