నెగ్గాల్సింది రాజ్యాంగ నైతికతే..
సాహిత్యమూ ప్రజాఉద్యమాలూ క్రియాశీలక పాత్ర పోషించినప్పుడు సమాజంలో అనుకూల మార్పులు కొన్నయినా చోటు చేసుకుంటాయని వర్తమాన చరిత్ర చెబుతోంది. ప్రజానుకూల మార్పులు మరిన్ని రావాలంటే సాహిత్యం ఇప్పుడు నిర్వహిస్తున్న పాత్ర చాలదని చెప్పింది హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో జరిగిన సెమినార్.
కులవివక్ష నేరమంటుంది రాజ్యాంగం. దళి తులు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండేందుకు వీల్లేదంటుంది పైకులపు దురహంకారం. రాజ్యాంగ నీతికి - పైకులాల నీతికి మధ్య ఇదో వైరుధ్యం. పెచ్చరిల్లుతున్న ఇలాంటి వైరుధ్యాలు రాజ్యాంగ నైతికతను సవాల్ చేస్తున్నాయి. ఓ పక్క మతమూ కులమూ లింగమూ ప్రాంతమూ తదితర ప్రాతిపదికలపై చలామణిలో ఉన్న పలురకాల నీతు లు. మరోపక్క చట్టం ముందు అందరూ సమాను లనీ చెబుతున్న రాజ్యాంగనీతి. ఈ రెంటిమధ్య వైరుధ్యమొస్తే రాజ్యాంగ నైతికతే నెగ్గాలంటారు ‘టూల్స్ ఆఫ్ జస్టిస్: నాన్ - డిస్క్రిమినేషన్ అండ్ ది ఇండియన్ కానిస్టిట్యూషన్’ రచయిత కల్పనా కన్న భిరాన్. ‘రాజ్యాంగ నైతికత - స్వాతంత్య్రానంతర తెలుగు సాహిత్యం’పై జరిగిన రెండురోజుల సెమి నార్లో ఆమె కీలకోపన్యాసం చేశారు.
హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ వేదికగా ఇటీవల రెండ్రోజుల పాటు జరిగిన ఈ సెమినార్ను సాహిత్య అకాడెమీ - అస్మిత రిసోర్స్ సెంటర్ ఫర్ విమెన్ కలసి ఏర్పాటుచేశాయి. తొలిసారిగా ‘రాజ్యాంగ నైతికత’ అనే కొత్త విశ్లేషణా పరికరంతో సాహిత్య పరిశీలనకు శ్రీకారం చుట్టాయి. ఈ ఆలోచనకు బీజమేసింది ఓల్గా. ‘టూల్స్ ఆఫ్ జస్టిస్’ పుస్తకం చదివినప్పుడు రాజ్యాంగ నైతికతా దృష్టితో సాహిత్యాన్ని పరిశీలించాలనిపించింది’ అంటారా మె. ఈ నేపథ్యంలో వాస్తవ సమాజానికి దర్పణాల వంటి అక్కినేని కుటుంబరావు నవలలు నాల్గింటిని రాజ్యాంగ నైతికతా కోణంలో పరిశీలించి ‘సంతు లిత’ పేరిట ఇటీవల పుస్తకాన్ని వెలువరించారు.
ఇందులో చెప్పినట్టు ‘రాజ్యాంగ నేపథ్యంలోంచి సాహి త్యాన్ని పరిశీలించడమూ, విశ్లేషించడమూ, విమ ర్శించడమూ తెలుగు సాహిత్యంలో ఇంతవరకు జరగలేదు.’ కాబట్టి ఈ పుస్తకం పై కోణంలో పరిశీల న జరిపేవారికి ఓ నమూనా గ్రంథం. దీనికి కొన సాగింపుగా జరిగిన ఈ సెమినార్ ప్రత్యేకమైనది. ఎలాగంటే - సాహిత్యానికీ రాజ్యాంగానికీ సంబంధ మేమిటని రచయితలూ, అధ్యాపకులూ ప్రశ్నించే కాలంలో - ఆయా తరగతుల వాళ్ల చేతనే రాజ్యాంగ నైతికతా కోణంలోంచి 21 మంది రచనల్ని పరిశీలింపచేసినందుకు.
సామాజిక శాస్త్రాల వెలుగులో సాహిత్య పరిశీల న జరపడం.. సాహిత్యం ద్వారా సామాజికవేత్తలు సమగ్రత సంతరించుకోవడం-ఈ రెంటి అవసరా న్నీ సెమినార్ నొక్కి చెప్పింది. బాలగోపాల్, హర గోపాల్, వకుళాభరణం రామకృష్ణ వంటి సామాజిక వేత్తలు చేసిన అనువర్తిత సాహిత్య విమర్శకు ఈ సెమినార్ కొనసాగింపు కాగలదన్నారు అల్లం రాజయ్య కథలపై ప్రసంగించిన కాత్యాయనీ విద్మహే. ‘నిస్సహాయ క్రోధాలు సమీకృతమై దళిత ఉద్యమంగా రూపుదిద్దుకున్నాక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వంటివి అమలులోకి’ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు కె.ఎన్.మల్లీశ్వరి. సచార్ కమిటీ సిఫార్సులకు బలం చేకూర్చే వాదనలు ‘వత న్’ కథల సంపుటిలో ఉన్నాయన్నారు షాజహానా.
హక్కులు ఉపయోగించుకున్నప్పుడు దళితులు దారుణహింసకు గురికావడం.. వ్యవసాయ విధ్వం సం రైతుల్ని ఆత్మహత్యలవైపు నెట్టడం.. ఉత్పత్తిలో కీలకపాత్ర పోషించేవాళ్లు వనరులకు పరాయివాళ్లు కావడం.. వలస పాలనా న్యాయసూత్రాలు స్వాతం త్య్రానంతరమూ మారకపోవడం.. అప్రజాస్వామిక కుటుంబ వ్యవస్థ వల్ల స్త్రీలు తమను తాము కోల్పో వాల్సిరావడం.. పౌరసత్వ హక్కుల కోసం పోరా టం చేయాల్సిరావడం.. దీంతో చోటు చేసుకుంటు న్న జీవనవిషాదం.. తదితర విషయాల్ని ప్రతిఫలిం చిన సాహిత్యంపై పరిశీలన జరిగింది. హక్కుల ఉల్లంఘనలూ, సమానత్వ/జీవించే హక్కులపై జరుగుతున్న దాడులూ ప్రస్తావనకొచ్చాయి.
సంప్రదాయక కులవ్యవస్థతో పాటు వచ్చిన సాంఘిక నైతికతను పరిమార్చి రాజ్యాంగ నైతికతకు ప్రాధాన్యతా,చట్టసమ్మతీ ఇవ్వాలన్నారు అంబేద్కర్. కానీ రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఆరు దశా బ్దాల తర్వాత కూడా, చుండూరు ఘటనలో హైకో ర్టు తీర్పుపై వినతిపత్రం ఇచ్చేందుకెళ్లిన కార్యకర్తల్ని హైకోర్టు ప్రాంగణంలోకిరానీయక పోవడమూ గమ నించినప్పుడు-సమానత్వ సాధన దిశగా సాగే ప్రయాణం చాలా సుదీర్ఘమైనదనీ అర్థ మవుతుంది. సాహిత్యకారులు ఆ ప్రయాణంలో కలసి ముందుకు సాగాలి. అందులోకి మరింతమంది కలిసొచ్చేలా చేయాల్సిన బాధ్యత ప్రజా ఉద్యమాలపై ఎంతుం దో సాహిత్యకారుల పైనా అంతే ఉంది. ఇలాంటి సెమినార్లు అలాంటి బాధ్యతను గుర్తింపచేసేవే.
- వి.ఉదయలక్ష్మి