ఎయిర్‌పోర్టులో రూ.1.25 కోట్ల బంగారం పట్టివేత
చెన్నై : కౌలాలంపూర్ నుంచి తమిళనాడులోని తిరుచ్చి వచ్చిన ఏడుగురు ప్రయాణికుల నుంచి రూ.1.25 కోట్ల విలువ చేసే బంగారాన్ని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి బయలుదేరిన సదరు విమానంలో తిరుచ్చికి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సెంట్రల్ రెవెన్యూ ఇంటలిజెన్స్ అధికారులకు రహస్య సమాచారం అందింది.
దీంతో అధికారులు రంగంలోకి దిగి... సదరు విమాన ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు.ఆ క్రమంలో యువతితో సహా ఏడుగురి వద్ద భారీ బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి నుంచి మూడు కిలోల 186 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 800 గ్రామలు బంగారాన్ని విమానంలో వదలి వెళ్లారు.
దానిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో మొత్తం రూ.1.25 కోట్ల విలువైన మూడు కిలోల 986 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే అదే విమానంలో హాంకాంగ్, సింగపూర్‌కు చెందిన ఇద్దరు ప్రయాణికుల నుంచి రూ.16.28 లక్షల విలువ చేసే డాలర్ల అక్రమంగా తరలిస్తుండగా వాటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మహిళతోసహా తొమ్మిది మందిని ఉన్నతాధికారులు చెన్నైకు తరలించారు.