కుమార్తెలను పుట్టింట దింపి వస్తూ..
అమలాపురం రూరల్ :
దీపావళి పండుగకు పిల్లలను తన పుట్టినింట దించి ఆటోలో తిరిగివస్తున్న ఓ తల్లి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అమలాపురం మండలం ఎ.వేమవరానికి చెందిన రాకుర్తి గంగాభవాని (34) ఈ ప్రమాదంలో మృతి చెందింది. అమలాపురం– చల్లిపల్లి రోడ్డులోని కామనగరువు దుర్గమ్మ గుడి వద్ద శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో గంగా భవాని మృతి చెందగా ఆటో డ్రైవర్‌తో పాటు నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీపావళి పండుగ కావడంతో గంగాభవాని తన ఇద్దరు కూతుళ్లను చల్లపల్లిలోని తన పుట్టినింట దింపి, ఆటోలో తిరిగి ఎ.వేమవరం వస్తోంది. ఆటోను ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీ కొట్టి కొంత దూరం ఈడ్చుకు వెళ్లింది. ఆటోలో ఉన్న భవానితోపాటు తాళ్లరేవు శివారు అడవి పొలానికి చెందిన బోడా ప్రసాద్, కొమరిగిరిపట్నానికి చెందిన తిరుమల బంగారం, కోడూరి కుమారి, గోపవరానికి చెందిన కుంచే కుమారి గాయపడ్డారు. క్షతగాత్రులను కిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ భవాని మృతి చెందింది. భార్య భవాని చనిపోవటంతో ఆమె భర్త సుబ్రహ్మణ్యం కన్నీరుÐ మున్నీరుగా విలపిస్తున్నారు. తమ తల్లి మరణంతో ఆ చిన్నారులు రోదిస్తున్న తీరు అక్కడి వారిని కంటతడి పెట్టించింది. అమలాపురం తాలూకా ఎస్సై గజేంద్రకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.