kamarajar
-
మాజీ సీఎం సిఫారసుతో సినిమాల్లోకి
సాక్షి, చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి కామరాజర్ సిఫార్సుతోనే శ్రీదేవి బాలనటిగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. ఈ విషయం ఆమె తండ్రి అయ్యప్పన్ సన్నిహిత మిత్రులకు మాత్రమే తెలుసు. వారిలో ఒకరైన 81 ఏళ్ల బాలు నాయకర్ శ్రీదేవి మరణవార్తతో తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. శ్రీదేవి స్వగ్రామంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీదేవి తండ్రి అయ్యప్పన్, తాను సాత్తూరు కోర్టులో జూనియర్ న్యాయవాదులుగా ఉన్న సమయంలో స్నేహితులమయ్యామని చెప్పారు. అయ్యప్పన్కు చెన్నై సీఐటీ నగర్లో ఓ ఇల్లు కూడా ఉండేదని.. శ్రీదేవి నాలుగేళ్ల వయసులో ఆయన చెన్నైకు వచ్చేశారన్నారు. ఆ ఇంటికి సమీపంలోనే అప్పటి కాంగ్రెస్ నేత, దివంగత సీఎం కామరాజర్ నివాసం ఉండేదని ఆయన వివరించారు. కామరాజర్‌కు అయ్యప్పన్ సన్నిహితుడని.. ఆ పరిచయం శివకాశి నియోజకవర్గం నుంచి అయ్యప్పన్ ఎమ్మెల్యేగా పోటీచేయడానికి దారితీసిందన్నారు. ఆ ఎన్నికల్లో అయ్యప్పన్ ఓడిపోయాడని, దాంతో చెన్నైకు పరిమితమైనట్టు ఆయన తెలిపారు. ఓ సాయంత్రం అయ్యప్పన్ శ్రీదేవిని వాకింగ్‌కు తీసుకెళ్లిన సమయంలో కామరాజర్ చూశారని.. అప్పట్లో చిన్నారి శ్రీదేవి అందం, చురుకుదనం చూసి అక్కడే ఉన్న రచయిత కన్నదాసన్ను పిలిచి సినిమాల్లో నటింపజేయడానికి ఏర్పాట్లుచేయాలని సూచించినట్టు నాయకర్ తెలిపారు. అనంతరం కామరాజర్ సిఫారసుతో కన్నదాసన్.. నిర్మాత సాండో చిన్నప్ప దేవర్‌కు శ్రీదేవి గురించి చెప్పినట్టు ఆయన వివరించారు. అదే సమయంలో బాలనటి కోసం ఎదురుచూస్తున్న దేవర్, తొనైవన్ సినిమాలో శ్రీదేవికి అవకాశం కల్పించారన్నారు. దానితో మొదలైన శ్రీదేవి సినీ ప్రస్థానం ముంబై వరకు సాగించిందని ఆయన వివరించారు. శ్రీదేవి శాశ్వతంగా దూరం కావడం వేదన కల్గిస్తోందని నాయకర్ చెప్పారు. ప్రస్తుతం మీనంపట్టిలోని పూర్వీకుల నివాసంలో అయ్యప్పన్ సోదరుడు రామస్వామి కుటుంబం ఉంటున్నట్టు ఆయన చెప్పారు. -
కామరాజర్ స్వర్ణయుగమే లక్ష్యం
రాష్ర్టంలో మళ్లీ కామరాజర్ స్వర్ణయుగం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమిద్దామని కాంగ్రెస్ సేనలకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు ప్రజాగోడు పట్టదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం రక్కసిపై సమర భేరి మోగిద్దామన్నారు. తిరుచ్చి వేదికగా గురువారం జోరు వానలో తడిసి ముద్దయినా తన ప్రసంగాన్ని రాహుల్ కొనసాగించడం విశేషం. సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తిరుచ్చి జీకార్నర్ మైదానం వేదికగా మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ జయంతి వేడుక బహిరంగసభ జరిగింది. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ వర్గాలు తరలిరావడంతో సభా ప్రాంగణం కిట కిటలాడింది. పార్టీ నేతలందరూ తమ ఐక్యతను చాటుకుంటూ ఒకే వేదిక మీద నుంచి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ బహిరంగ సభ నిమిత్తం తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆ పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. అడుగడుగునా ఆహ్వానాలు పలికారు. నిఘా నీడలో జీ కార్నర్ మైదానం వేదిక మీదకు రాహుల్ రాగానే, వర్షంపు జల్లులు ఆరంభం అయ్యాయి. రాహుల్ ప్రసంగం సమయంలో వర్షం తీవ్రత పెరిగింది. అయినా, లెక్కచేయకుండా, తన ప్రసంగాన్ని రాహుల్ కొనసాగించారు. ఓ వైపు వర్షం కారణంగా మైక్ సక్రమంగా పనిచేయనప్పటికీ, పలు మార్లు మొరాయించినా, తనదైన శైలిలో అభిమానులకు అభివాదం చేస్తూ, జోరు వానలోనూ ప్రసంగాన్ని సాగించారు. కామరాజర్ స్వర్ణయుగం లక్ష్యం: మహానాయకుడు కామరాజర్ అంటే తనకు ఎంతో అభిమానం, గౌరవం అని వ్యాఖ్యానించారు. తమిళనాడులో విద్యాప్రదాతగా ఆయన అందించిన సేవలు, సాగించిన పాలనను గుర్తు చేస్తూ, ఓ పిట్ట కథను సైతం వివరించారు. నాయకుడు అనే వాడికి అందరి గళం విన్పించాలంటూ ఆ పిట్ట కథ ద్వారా నీతిని వళ్లించారు. అయితే, ఇక్కడి పాలకులకు ప్రజల గోడు వినే పరిస్థితి లేదని, ఇక ప్రాంతీయ పార్టీలకు ప్రజా గోడ్డు అస్సలు పట్టదని మండిపడ్డారు. అదే సమయంలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ పేరును ఆయన వ్యాఖ్యానించకపోవడం గమనార్హం. ఇక, అధికారం చేతిలో ఉంది కాదా, అన్ని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇంటి నుంచే పాలనను సాగించడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా సీఎం జయలలితను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. తమిళనాడులో నిరుద్యోగం తాండవం చేస్తున్నదని, అన్ని వర్గాల వారు అష్టకష్టాలు పడుతున్నారని, దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతున్నదని, ప్రజల గోడు కన్నా, మద్యం మీద వచ్చే ఆదాయం మీదే ప్రభుత్వం దృష్టి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేతిలోకి తీసుకుని ఉందని, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న మద్యం రక్కసిని తరిమి కొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. అన్ని వర్గాల ప్రజల ఆర్థికంగా బలోపేతం కావాలన్నా, యువత జీవితాల్లో వెలుగు నింపాలన్నా, ఆ నాటి కామరాజర్ స్వర్ణయుగం మళ్లీ తీసుకురావడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమిద్దామని పిలుపునిచ్చారు. తమిళనాడులోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మద్యం పాలసీ : కాంగ్రెస్‌కు అవకాశం కల్పిస్తే, మళ్లీ కామరాజర్ పాలన తీసుకొస్తుందని, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడుతాయని, మద్యానికి వ్యతిరేకంగా సరికొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దళిత, గిరిజన, మైనారిటీ తదితర సామాజిక వర్గాలు, పేద, మధ్య తరగతి వర్గాల్లో వెలుగు నింపే రీతిలో చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విమానాశ్రయం మార్గంలోని ఓ ఫాం హౌస్‌లో డెల్టా అన్నదాతలతో రాహుల్ భేటీ అయ్యారు. ఈసందర్భంగా అన్నదాతలు తమ కన్నీటి గోడును రాహుల్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, కాంగ్రెస్ నేతలు చిదంబరం, తంగబాలు, కృష్ణ స్వామి, కుష్బు , ఎమ్మెల్యేలు గోఫీనాథ్, విజయధరణి పాల్గొన్నారు. -
మాది గెలుపు కూటమి
చెన్నై: రాష్ట్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో గెలుపు కూటమి ఆవిర్భవించడం తథ్యమని కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి కే వాసన్ ధీమా వ్యక్తంచేశారు.ఎన్నూర్ హార్బర్లో ఆదివారం నిలు వెత్తి కామరాజర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎన్నూర్ హార్బర్‌కు మాజీ సీఎం, దివంగత నేత కామరాజర్ పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆ హార్బర్ ప్రవేశ మార్గంలో నిలువెత్తి కామరాజర్ విగ్రహం ఏర్పాటుకు కేంద్ర నౌకాయూన శాఖ చర్యలు తీసుకుంది. పది అడుగుల ఎత్తుతో 380 కిలోల బరువుతో కామరాజర్ నడిచి వస్తున్నట్టుగా విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఈ విగ్రహావిష్కరణ ఉదయం జరిగింది. విగ్రహావిష్కరణ: నిలువె త్తు కామరాజర్ విగ్రహాన్ని కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జికే వాసన్ ఆవిష్కరించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామరాజర్ సేవల్ని కొనియాడుతూ వాసన్ ప్రసంగించారు. కామరాజర్ ఖ్యాతిని ఎలుగెత్తి చాటే రీతిలో ఈ విగ్రహం రూపుదిద్దుకున్నదని వివరించారు. కామరాజర్ ఆశయాల సాధనే లక్ష్యంగా కేంద్రంలోని తమ ప్రభుత్వం పయనిస్తున్నదన్నారు. ఆయన హయూంలో ప్రవేశ పెట్టిన పథకాలు జాతీయ స్థాయిలో నేడు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. దేశాభివృద్ధికి యాభై ఏళ్ల ముందే ఆయన పునాది వేసి వెళ్లారని వివరించారు. అందుకే ఆయన పేరును నామకరణం చేయాలని కేంద్రాన్ని పట్టుబట్టామన్నారు. కేంద్రం అంగీకరించడంతో ఎన్నూర్ హార్బర్‌కు ఆయన పేరును నామకరణం చేశామని, ఉప్పు శాఖ స్థలాల్ని ఈ పోర్టు పరిధిలోకి తీసుకొచ్చామని వివరించారు. కామరాజర్ విగ్రహావిష్కరణతో ఇక్కడి పనులు ముగియ లేదని, ఈ హార్బర్‌ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ముందుకెళ్లనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నౌకాయూన శాఖ అధికారి మురుగానందన్, ఎన్నూర్ హార్బర్ చైర్మన్ భాస్కర్, చెన్నై హార్బర్ చైర్మన్ అతుల్య మిశ్ర తదితరులు పాల్గొన్నారు. వాసన్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో తమ నేతృత్వంలో గెలుపు కూటమి ఆవిర్భవించడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. నోటిఫికేషన్ వెలువడక ముందే, ఎలా కూటమిని ప్రకటిస్తామన్నారు. చర్చలు సాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో తమ నేతృత్వంలో ఏర్పడే కూటమి గెలుపు కూటమిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రం పథకాలు, నిధులు కేటాయిస్తూ వచ్చిందని వివరించారు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ మీద నమ్మకం ఉందని, తమకు పట్టం కట్టడం తథ్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతు తమకేనని, ఎవరెన్ని కుట్రలు, కుతుంత్రాలు, జిమ్మిక్కులు చేసినా కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడి తీరుతుందని జోస్యం చెప్పారు.