రాష్ర్టంలో మళ్లీ కామరాజర్ స్వర్ణయుగం లక్ష్యంగా
ప్రతి ఒక్కరూ శ్రమిద్దామని కాంగ్రెస్ సేనలకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు
రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలకు
ప్రజాగోడు పట్టదని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న
మద్యం రక్కసిపై సమర భేరి మోగిద్దామన్నారు.
తిరుచ్చి వేదికగా గురువారం జోరు వానలో తడిసి ముద్దయినా
తన ప్రసంగాన్ని రాహుల్ కొనసాగించడం విశేషం.
సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తిరుచ్చి జీకార్నర్ మైదానం వేదికగా మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ జయంతి వేడుక బహిరంగసభ జరిగింది. పెద్ద సంఖ్యలో ఆ పార్టీ వర్గాలు తరలిరావడంతో సభా ప్రాంగణం కిట కిటలాడింది. పార్టీ నేతలందరూ తమ ఐక్యతను చాటుకుంటూ ఒకే వేదిక మీద నుంచి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ బహిరంగ సభ నిమిత్తం తిరుచ్చి విమానాశ్రయానికి చేరుకున్న ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆ పార్టీ వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. అడుగడుగునా ఆహ్వానాలు పలికారు.
నిఘా నీడలో జీ కార్నర్ మైదానం వేదిక మీదకు రాహుల్ రాగానే, వర్షంపు జల్లులు ఆరంభం అయ్యాయి. రాహుల్ ప్రసంగం సమయంలో వర్షం తీవ్రత పెరిగింది. అయినా, లెక్కచేయకుండా, తన ప్రసంగాన్ని రాహుల్ కొనసాగించారు. ఓ వైపు వర్షం కారణంగా మైక్ సక్రమంగా పనిచేయనప్పటికీ, పలు మార్లు మొరాయించినా, తనదైన శైలిలో అభిమానులకు అభివాదం చేస్తూ, జోరు వానలోనూ ప్రసంగాన్ని సాగించారు.
కామరాజర్ స్వర్ణయుగం లక్ష్యం: మహానాయకుడు కామరాజర్ అంటే తనకు ఎంతో అభిమానం, గౌరవం అని వ్యాఖ్యానించారు. తమిళనాడులో విద్యాప్రదాతగా ఆయన అందించిన సేవలు, సాగించిన పాలనను గుర్తు చేస్తూ, ఓ పిట్ట కథను సైతం వివరించారు. నాయకుడు అనే వాడికి అందరి గళం విన్పించాలంటూ ఆ పిట్ట కథ ద్వారా నీతిని వళ్లించారు. అయితే, ఇక్కడి పాలకులకు ప్రజల గోడు వినే పరిస్థితి లేదని, ఇక ప్రాంతీయ పార్టీలకు ప్రజా గోడ్డు అస్సలు పట్టదని మండిపడ్డారు. అదే సమయంలో ఏ ఒక్క ప్రాంతీయ పార్టీ పేరును ఆయన వ్యాఖ్యానించకపోవడం గమనార్హం. ఇక, అధికారం చేతిలో ఉంది కాదా, అన్ని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, ఇంటి నుంచే పాలనను సాగించడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా సీఎం జయలలితను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. తమిళనాడులో నిరుద్యోగం తాండవం చేస్తున్నదని, అన్ని వర్గాల వారు అష్టకష్టాలు పడుతున్నారని, దాడులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ర్టంలో మద్యం ఏరులై పారుతున్నదని, ప్రజల గోడు కన్నా, మద్యం మీద వచ్చే ఆదాయం మీదే ప్రభుత్వం దృష్టి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేతిలోకి తీసుకుని ఉందని, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న మద్యం రక్కసిని తరిమి కొట్టేందుకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. అన్ని వర్గాల ప్రజల ఆర్థికంగా బలోపేతం కావాలన్నా, యువత జీవితాల్లో వెలుగు నింపాలన్నా, ఆ నాటి కామరాజర్ స్వర్ణయుగం మళ్లీ తీసుకురావడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమిద్దామని పిలుపునిచ్చారు. తమిళనాడులోని అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ అండగా ఉంటుందని, కేసుల సత్వర పరిష్కారానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
మద్యం పాలసీ : కాంగ్రెస్‌కు అవకాశం కల్పిస్తే, మళ్లీ కామరాజర్ పాలన తీసుకొస్తుందని, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడుతాయని, మద్యానికి వ్యతిరేకంగా సరికొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దళిత, గిరిజన, మైనారిటీ తదితర సామాజిక వర్గాలు, పేద, మధ్య తరగతి వర్గాల్లో వెలుగు నింపే రీతిలో చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం విమానాశ్రయం మార్గంలోని ఓ ఫాం హౌస్‌లో డెల్టా అన్నదాతలతో రాహుల్ భేటీ అయ్యారు. ఈసందర్భంగా అన్నదాతలు తమ కన్నీటి గోడును రాహుల్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్, కాంగ్రెస్ నేతలు చిదంబరం, తంగబాలు, కృష్ణ స్వామి, కుష్బు , ఎమ్మెల్యేలు గోఫీనాథ్, విజయధరణి పాల్గొన్నారు.
కామరాజర్ స్వర్ణయుగమే లక్ష్యం
Published Fri, Jul 24 2015 2:58 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement