Kamineni medical college
-
కౌముదికి రూ.10 లక్షలు చెల్లించండి: సుప్రీం కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: మెడికల్ పీజీలో ఓ విద్యార్థినికి ప్రవేశం నిరాకరించినందుకు గాను రూ. 10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని హైదరాబాద్‌కు చెందిన కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ హేమంత్ గుప్తాతో కూడిన ధర్మాసనం సోమవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. మోతుకూరి శ్రీయ కౌముది అనే విద్యార్థిని ఈ విద్యా సంవత్సరంలో నీట్ పరీక్ష రాసి అర్హత సాధించారు. ప్రవేశ అర్హత సాధించిన అనంతరం ఎంఎస్ సర్జన్ కోర్సులో ప్రవేశం నిమిత్తం కళాశాలకు సకాలంలో చేరుకున్నా ఆమెకు సదరు కళాశాల ప్రవేశం నిరాకరించింది. (చదవండి: ఒక్క క్లిక్‌తో ఐఐటీ సీటు ఢమాల్!) దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు అనుకూలంగా తీర్పునిస్తూ తనకు ప్రత్యేక సీటు కేటాయించాలని కళాశాలను ఆదేశించింది. ఆ తీర్పును నేషనల్ మెడికల్ కమిషన్ సవాల్ చేసింది. పిటిషన్‌ను విచారించిన జస్టిస్ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ‘‘కౌముదికి వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశం కల్పించాలి’’అని తీర్పునిచ్చింది. -
ఆ కోర్సులకు అనుమతిపై పునఃపరిశీలన
సాక్షి, హైదరాబాద్: కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 2019–20 విద్యా సంవత్సరానికి ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులను ప్రారంభించేందుకు అనుమతిని నిరాకరించిన నేపథ్యంలో, మరోసారి దీనిపై పునఃపరిశీలన చేయాలని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు కోర్సులకు అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ కామినేని దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ కోదండరామ్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కోర్సులకు అనుమతినిచ్చే ముందు ఎంసీఐ పరిశీలకులు తనిఖీలు చేస్తారని, అలాగే తమ కాలేజీలో కూడా తనిఖీలు చేసి, పలు లోపాలను ఎత్తి చూపారన్నారు. ఈ లోపాలను సరిదిద్దుకున్నామని, మరోసారి తనిఖీ చేసిన అధికారులు, మళ్లీ లోపాలున్నాయన్నారు. లేవనెత్తిన లోపాలను సరిదిద్దుకున్నా, కోర్సులకు అనుమతినివ్వడం లేదన్నారు. అయితే ఈ వాదనలను ఎంసీఐ తరఫు న్యాయవాది తోసిపుచ్చారు. సర్జరీలు ఎన్ని చేశారన్న విషయంలో కామినేని ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని, అందుకే ఈ నిబంధన విషయంలో ఎంసీఐ అధికారులు రాజీపడలేదని చెప్పారు. -
కామినేనిలో ఎంబీబీఎస్ విద్యార్ధి ఆత్మహత్య
నల్గొండ : నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి కామినేని వైద్య కళాశాలలో ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థి సాయి సురేష్ హాస్టల్ గదిలో ఫ్యాన్ ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. నార్కెట్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. కాగా విద్యార్థి ఆత్మహత్యపై మృతుని కుటుంబీకులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వారు చెబుతున్నారు. అయితే ఆత్మహత్య విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచారు. మరోవైపు పోలీసులు కూడా ఈ విషయంపై నోరు మెదపటం లేదు.