‘ఉత్తర ముంబై’ బరి పలుచోట్ల తెలుగు ఓటర్లే కీలకం
సాక్షి, ముంబై: ఉత్తర ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో పెద్దఎత్తున తెలుగు ప్రజలు నివసిస్తున్నారు. దీని పరిధిలో బోరివలి, దహిసర్, మఘఠాణే, తూర్పు కాందివలి, చార్కోప్, పశ్చిమ మలాడ్ శాసనసభ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడి నుంచి సిట్టింగ్ ఎంపీ సంజయ్ నిరుపం మళ్లీ బరిలో ఉండగా, బీజేపీ అధిష్టానం ఈసారి బోరివలి ఎమ్మెల్యే గోపాల్ శెట్టిని బరిలోకి దింపింది. ఆప్ తరఫున సతీష్ జైన్, సమాజ్‌వాదీ పార్టీ తరఫున కమలేష్ యాదవ్‌లు పోటీ చేస్తున్నారు. ఈ స్థానం పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో మరాఠీ, మైనార్టీ ఓటర్లతోపాటు అనేక రాష్ట్రాలకు చెందిన ఓటర్లు కీలకంగా ఉన్నారు. వీరిలో పలు ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో తెలుగు ప్రజల మనోభావాలు వారి మాటల్లోనే...
మేలు చేసేవారే కావాలి
సమాజానికి మేలు చేసే నాయకులు కావాలి. నిస్వార్థంగా వ్యవహరించాలి. అందరినీ కలుపుకుపోగలగాలి. అటువంటి వారే ప్రస్తుతం అవసరం. ప్రతి నాయకుడు ధర్మానికి కట్టుబడి సమాజాన్ని నడిపించాలి. - తోకల రాములు
మోడీయే మేలనిపిస్తోంది
రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేసి అనేకమంది డబ్బు సంపాదన కోసం నామినేషన్లు వేస్తున్నారు. ప్రజాసేవ చేద్దామనే ఆలోచన కలిగినవారి సంఖ్య అంతంతమాత్రమే. డబ్బు ఖర్చు చేయకుండా ఎన్నికల్లో గెలుపొందిన వారే సమస్యలు పరిష్కరిస్తారని నా నమ్మకం. గుజరాత్లో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి చూశాక దేశ ప్రధాని కూడా ఆయనే అయితే బాగుంటుందనిపిస్తోంది. మోడీ మేలు చేస్తాడనిపిస్తోంది. - సైదులు పోలెపాక
హామీలు నెరవేర్చాలి
ప్రజల సమస్యలను తన సమస్యలుగా భావించే నాయకుడు కావాలి. స్థానిక సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తగల గాలి. భారీగా నిధులు తీసుకొచ్చి ఏ సమస్యనైనా పరిష్కరించగలగాలి. నిత్యం ప్రజలతో మమేకమవ్వాలి. వారి కష్టాలను తెలుసుకోవాలి. పది హామీలిస్తే కనీ సం ఏడింటినైనా నెరవేర్చాలి. - గాజుల మహేష్
ధరలు విపరీతంగా పెరిగాయి
గత పదేళ్ల కాలంలో యూపీఏ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. సామాన్యుడి బతుకు భారంగా మారింది. పెట్రోల్ ధరలు సంవత్సరానికి ఐదు సార్లు పెంచారు. వాహనాలను ఉపయోగించుకోలేని పరిస్థితి తలెత్తింది. - వై.నరసింహులు