అవసరంలో సాయంతోనే సార్థకత
విజయవాడ (మొగల్రాజపురం) : అవసరంలో ఉన్న వారిని ఆదుకున్నప్పుడే చేసిన సాయానికి సార్థకత లభిస్తుందని కమ్మ విద్యార్థి సహాయ సంఘం అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఆదివారం పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో కమ్మ విద్యార్థి సహాయ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపకార వేతనాలను అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఎన్.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేవలం కమ్మ కులానికి చెందిన వారికే కాకుండా అన్ని కులాల వారికి ఉపకార వేతనాలను అందజేస్తున్నామని చెప్పారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్యారంగంలోSచేయుత ఇవ్వాలనే ఉద్దేశంలో 1994 నుంచి విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం ఉపకార వేతనాలను ఇవ్వడమే కాకుండా విద్యార్హతకు తగినట్లుగా ఉద్యోగాలు వచ్చేలా కూడా చేయూతనిస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘం కార్యదర్శి పర్వతనేని ప్రభాస్ మాట్లాడుతూ పదో తరగతి నుంచి మెడిసిన్ వరకు సుమారు 400 మంది విద్యార్థులకు రూ.22 లక్షలు ఉపకార వేతనాలుగా అందజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో సంఘం కోశాధికారి సి.కృష్ణారావు, రాజయ్య, ముత్తవరపు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.