అనుమతులు లేకపోతే కూల్చివేతే
సాక్షి, ముంబై: కంపాకోలాలోని అక్రమ నిర్మాణాలను కూల్చేయాలని బృహన్ ముంబై కార్పొరేషన్ ఓవైపు సమాయాత్తమవుతుంటే.. మరో 430 అనధికారిక నిర్మాణాలు వెలుగులోకి వచ్చాయి. బీఎంసీ వార్డుల వారీగా సర్వే నిర్వహిస్తుండగా ఈ నిర్మాణాలు బయటపడ్డాయి. ఇందులో కొన్ని భవనాల్లో అంతస్తులను మాత్రమే అక్రమంగా నిర్మించగా.. మరికొన్ని భవనాలు పూర్తిగా అనధికారికమైనవని తేలింది. అందులో 74 భవనాలు పూర్తిగా బీఎంసీ అనుమతులు లేకుండా నిర్మితమైనవని సర్వే వెల్లడించింది.
అక్రమంగా అదనపు అంతస్తులను నిర్మించిన 96 భవనాలతో బోరివిలీలోని ఆర్ సెంట్రల్వార్డ్ మొదటి స్థానంలో ఉంది. ఇక రెండో స్థానంలో వర్లీలోని జి-సౌత్ దక్కించుకుంది. కంపాకోలాలో 78 అక్రమ నిర్మాణాలున్నాయి. అక్రమ నిర్మాణాల పూర్తి జాబితాను సేకరించామని, వాటిని కచ్చితంగా కూల్చేస్తామని బీఎంసీ అధికారి ఒకరు తెలిపారు. ఏవైనా భవనాలు కోర్టు కేసుల్లో ఉన్నాయేమో పరిశీలించి ఓ నిర్ణయానికి వస్తామని ఆయన చెప్పారు.
ప్రమాదకర భవనాలూ కూల్చివేత
భీవండీ నిజాంపూర్ షహర్ మహానగర్ పాలిక పరిధిలోని ప్రమాదకరమైన భవనాల కూల్చివేత ప్రక్రియను అధికారులు చేపడుతున్నారు. కామత్‌ఘర్ ప్రాంతంలోని పటేల్-గనీ, కాంపౌండ్‌లోని ఇంటి నంబరు 108, 109 రెండు అంతస్తుల భవనాన్ని 40 ఏళ్ల కిందట నిర్మించారు. అయితే గత వర్షాకాలమే భవనం పైకప్పు శ్లాబ్ పోయి పగుళ్లు ఏర్పడింది. మళ్లీ వర్షాకాలం దగ్గర పడుతున్నందున ఎప్పుడైనా కూలే అవకాశాలు ఉండటంతో భవనాన్ని కూల్చేయాల్సిందిగా ప్రభాగ్ సమితి భవన నిర్మాణ శాఖ అధికారులు ఎన్నో మార్లు నోటీసులు జారీ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో చివరికి గురువారం స్థానిక పోలీసుల సహకారంతో భవనంలోని 36 కుటుంబాలను ఖాళీ చేయించి కూల్చేశారు.