హడలెత్తించిన సాగర్
జింఖానా, న్యూస్‌లైన్: పోస్టల్ జట్టు బౌలర్ సాగర్ 8 వికెట్లు పడగొట్టి మిధాని జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పోస్టల్ జట్టు 10 వికెట్ల తేడాతో మిధాని జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మిధాని... సాగర్ ధాటికి 53 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన పోస్టల్ జట్టు వికె ట్ కోల్పోకుండా 55 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో హెచ్ఏఎల్ జట్టు 8 వికెట్ల తేడాతో కెనరా బ్యాంక్‌పై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన కెనరా బ్యాంక్ 96 పరుగులకే చేతులెత్తేసింది.
హెచ్ఏఎల్ బౌలర్ సిద్ధప్ప 6 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన హెచ్ఏఎల్ రెండే వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెయింట్ సాయి జట్టు బౌలర్ అనీష్ (6/53) విజృంభించాడు.
దీంతో ఆ జట్టు 23 పరుగుల తేడాతో డెక్కన్ కోల్ట్స్ జట్టుపై నెగ్గింది. తొలుత డెక్కన్ కోల్ట్స్ 177 పరుగులకు ఆలౌటైంది. ప్రదీప్ 33 పరుగులు చేశాడు. సెయింట్ సాయి బౌలర్ జగదీశ్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ సాయి 153 పరుగులకు ఆలౌటైంది. జితేందర్ (33), చర్దిల్ (32) మినహా మిగతా వారు రాణించలేకపోయారు.