ఆత్మకథ రాసుకుంటే కలాంకు ప్రత్యేక పేజీలు
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. హైదరాబాద్‌లోని డీఆర్డీఎల్లో పదేళ్ల పాటు పరిశోధనలు జరిపి ఐదు రకాల క్షిపణులను రూపొందించారని, ఈ సమయంలోనే భారత క్షిపణి పితామహుడిగా కీర్తికెక్కారని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కలాం నిరాడంబర జీవితాన్ని గడిపారన్నారు. కలాం 84వ జయంతి సందర్భంగా గురువారం కంచన్‌బాగ్ డీఆర్డీఎల్ ఎదుట కలాం విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..
కలాం సేవలకు గుర్తింపుగా డీఆర్డీఎల్కు ‘ఏపీజే అబ్దుల్ కలాం క్షిపణి కేంద్రం’గా పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని తెలిపారు. ఒకవేళ తాను ఆత్మకథ రాసుకుంటే అందులో కలాంకు ప్రత్యేకంగా కొన్ని పేజీలను కేటాయిస్తానని సీఎం చెప్పారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం అందించిన జాతిపిత మహాత్మాగాంధీ తర్వాత అంతటి కీర్తి గడించిన వ్యక్తి అబ్దుల్ కలామేనని అభిప్రాయపడ్డారు. ‘‘భారత దేశ ముద్దుబిడ్డ కలాం.
ఆయన కృషి వల్ల నేడు హైదరాబాద్ కేంద్రంగా రాకెట్ల తయారీకి సంబంధించిన విడి భాగాలు తయారవుతున్నాయి. కలాం లాంటి మహోన్నతమైన వ్యక్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం నా అదృష్టంగా భావిస్తున్నా’’ అని సీఎం అన్నారు. కలాం విగ్రహాన్ని రూపొందించిన శిల్పి పి.వై.రాజును సీఎం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఎల్ డెరైక్టర్ డాక్టర్ జయరామన్, పలువురు శాస్త్రవేతలు, మేనేజ్మెంట్ సైన్స్ డెరైక్టర్ వైవీ రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.