హాస్టల్ బాత్రూంలో కెమెరాలు!
సాక్షి, చెన్నై:ఊరుగాని ఊరొచ్చి హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థినులతో ఓ ఎలక్ట్రీషియన్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాత్రూముల్లో స్నానం చేస్తున్న విద్యార్థినులను వీడియో తీశారన్న సమాచారంతో కంచిలోని ఓ వర్సిటీలోని విద్యార్థుల్లో ఆగ్రహం రేగిం ది. యాజమాన్యం నిర్లక్ష్య పూరితంగా సమాధానం ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బస్సులపై ప్రతాపం చూపించారు. కాంచీపురంలో ఓ ప్రైవే టు వర్సిటీ ఉంది. ఈవర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు మూడు వేల మంది వరకు చదువుకుంటున్నారు. వీరికి ఆ యాజమాన్యం హాస్టల్ సౌకర్యం కల్పించింది. అయితే, బుధవారం చోటు చేసుకున్న ఘటనతో విద్యార్థినులకు హాస్టల్లో భద్రత ఉందా? అన్న ప్రశ్న బయలు దేరింది.
ఎలక్ట్రీషియన్ అసభ్యకర ప్రవర్తన
ఆ హాస్టల్లో వార్డెన్‌గా పనిచేస్తున్న ఒకరికి సన్నిహితుడైన ఎలక్ట్రీషియన్ విద్యార్థినులతో అసభ్యకరం గా ప్రవర్తించాడు. అంతేకాకుండా స్నానం చేస్తున్న విద్యార్థినుల్ని రహస్యంగా తన మొబైల్ కెమెరాలో బంధించాడు. ఎన్నాళ్ల నుంచి ఈ తంతు సాగుతున్న దో ఏమోగానీ, బుధవారం కొందరు విద్యార్థినులు ఎలక్ట్రీషియన్ నిర్వాకాన్ని పసిగట్టారు.ఈ విషయాన్ని విద్యార్థుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ ఎలక్ట్రీషియన్‌పై చర్య తీసుకోవాలని, వార్డెన్‌ను సస్పెండ్ చేయాలన్న నినాదంతో విద్యార్థులు ఆందోళనబాట పట్టారు. యాజమాన్యం దృష్టికి తీసుకెళితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకొచ్చారు. మీడియాకు కొందరు విద్యార్థులు ఫోన్లలో సమాచారం ఇచ్చారు.
అప్పటికే మేల్కొన్న యాజమాన్యం విద్యార్థుల్ని బుజ్జగించే యత్నం చేసింది. కొందరు విద్యార్థులు ఆగ్రహించి తమ ప్రతాపాన్ని అక్కడి బస్సులపై చూపించారు. ల్యాబ్, కళాశాల పరిసరాల్లోని అద్దాలు ధ్వంసం చేశారు. ఓ దశలో కొందరు విద్యార్థులు ర్యాలీగా కలెక్టరేట్‌కు బయలు దేరగా, యజమాన్యం అడ్డుకున్నట్టు తెలిసింది. పోలీసులకు ఫిర్యాదు చేశామని, వార్డెన్‌ను సస్పెండ్ చేశామని చెబుతూ, కళాశాలకు సెలవు ప్రకటించేసింది. పది రోజుల పాటు సెలవు ప్రకటించిన కళాశాల యాజమాన్యం, ఆ ఎలక్ట్రీషియన్‌పై మొక్కుబడిగా కేసు నమోదు చేయించినట్టు విద్యార్థులకు సమాచారం అందడంతో మరోమారు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
సాయంత్రం విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో తమ ప్రతాపాన్ని ఆ వర్సిటీ ఆస్తులపై చూపించారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. సమాచారం అందుకున్న కాంచీపురం ఎస్పీ విజయకుమార్ నేతృత్వంలోని బలగాలు అక్కడికి చేరుకుని విద్యార్థులపై లాఠీలను ఝుళిపించాయి. తమపై లాఠీలు ఝుళిపించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు కళాశాల లోపల నిరసన కు దిగారు. పరిస్థితి మరింతగా అదుపు తప్పకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలక్ట్రీషియన్ మొబైల్లోని సిమ్ కార్డును వార్డెన్ ధ్వంసం చేసినట్టుగా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ నేతృత్వంలో విచారణ బృందాన్ని రంగంలోకి దించారు.