గన్నీ బ్యాగుల కోసం గలాట
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో రెండ్రోజులుగా పడిగాపులు
అధికారులు పట్టించుకోకపోవడంతో కంది రైతుల ఆందోళన
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : విత్తనాలు కొనాలన్నా.. ఎరువులు కొనాలన్నా.. రుణాల కోసమైనా.. పంట అమ్మాలన్నా.. అన్నదాతకు పడిగాపులు తప్పడంలేదు. దిగుబడి వచ్చిన కంది పంటను తీసుకొని ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు వచ్చిన రైతులకు రెండు రోజులుగా ఎదురుచూపులే మిగిలారుు. చివరికి గన్నీ సంచులు కావాలంటూ మంగళవారం రాత్రి యార్డులో ఆందోళనకు దిగారు. సంచులను క్రమపద్ధతిగా రైతులకు అందించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులంతా ఒకేసారి ఎగబడ్డారు.
దీంతో 200 మంది వరకు ఉన్న రైతులు ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగింది. కొంతమంది రైతులు స్వల్పంగా గాయపడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, తీసుకువచ్చిన కందులకు రెండు రోజులుగా నాణ్యత చూసి ధర నిర్ణయిస్తున్నారే తప్ప కొనుగోలు చేయడం లేదని పే ర్కొన్నారు. బుధవారం నుంచి గన్నీ సంచులు లేవని, రోజుల తరబడి కొనుగోళ్లు లేక ఇక్కడే ఉండాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులను నిలదీస్తే నిజామాబాద్ నుంచి సంచులు వస్తున్నాయని, రెండు రోజులుగా అదే మాట చెబుతున్నారని పేర్కొన్నారు. యూర్డులో సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
రెండ్రోజులుగా యార్డులోనే..
సోమవారం ఉదయం 9 గంటలకు కందులు పట్టుకొని మార్కెట్కు వచ్చిన కందుల కుప్ప దగ్గరికి వచ్చి ఎఫ్సీఐ అధికారులు చూసి వెళ్లిండ్రు. సంచులు లేవని కొనుగోలు చేయలేదు. తిండి లేక నీళ్లు లేక అవస్థలు పడుతున్నా. ఇంటికాడ మావోళ్లు పరేషన్ అవుతున్నారు. సార్లేమో పట్టించుకుంటులేరు.
- ఆస నారాయణ, సుంకిడి, తలమడుగు
60 కిలోమీటర్ల దూరం నుంచి
మా దగ్గర కందుల కొనుగోళ్లు లే వు. దళారులకు అమ్ముకుంటే నష్టపోవాల్సి వస్తుందని ఆదిలాబాద్ మార్కెట్కు 60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన. మద్దతు ధర లభిస్తుందని పొద్దుగాల ఇక్కడకు తీసుకువచ్చిన. ఇంతవరకు కొనలేదు. సద్ది కూడా తెచ్చుకోలేదు. కందులకు సంచులూ ఇస్తలేరు.
- మెస్రం మధు, అల్లిగూడ, ఉట్నూర్