Kandi Srinivas Reddy
-
'కుక్కర్ల పంపిణీలో కల్లోలం! జోగు రామన్నదే ఈ కుట్ర..' : కంది శ్రీనివాస్ రెడ్డి
ఆదిలాబాద్: కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి తన కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కుక్కర్ల పంపిణీ శుక్రవారం రాత్రి ఆందోళనకు దారి తీసింది. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్‌లో గల టీటీడీ కల్యాణ మండపంలో కుక్కర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందు కోసం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే ట్రాఫిక్, శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందంటూ పోలీసులు వాహనాల్లో ఉంచిన కుక్కర్లను సీజ్ చేశారు. ఆ వాహనాలను స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా మహిళలు అడ్డుకున్నారు. పార్టీ శ్రేణులు, మహిళలతో కలిసి పోలీసుల తీరును నిరసిస్తూ శ్రీనివాసరెడ్డి ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే జోగు రామన్న అడుగడుగున అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తాను కష్టపడిన డబ్బుతో ఆడబిడ్డలకు ప్రెషర్ కుక్కర్లను పంపిణీ చేస్తుంటే సహించలేక ఎమ్మెల్యే కుట్ర పూరితంగా పోలీసులను ఉసిగొల్పి కుక్కర్లను సీజ్ చేయించారని ఆరోపించారు. ఆయన మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. టోకెన్లు తీసుకున్న మహిళలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి జోగు రామన్న ఇంటిని ముట్టడించాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. -
TS Election 2023: అరుపులు, కేకలతో గందరగోళ పరిస్థితి.. ‘కంది’ పై సస్పెండ్ ప్రకటన..
ఆదిలాబాద్: కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. జిల్లాలో హస్తం పార్టీలో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దీంతో లొల్లి రచ్చకెక్కింది. పట్టణంలోని విద్యుత్ తరంగిణి భవన్లో సోమవారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ ఐక్యవేదిక సభ రసాభాసగా మారడమే ఇందుకు నిదర్శనం. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ సినీయర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత్‌రావు సమక్షంలో పార్టీ ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల పార్టీలో చేరిన ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి రాకను వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, పార్టీ సీనియర్ నేత గండ్రత్ సుజాత వర్గీయులు గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తన వర్గీయులు గేటు దూకి తాళాన్ని పగులకొట్టగా.. శ్రీనివాసరెడ్డి బౌన్సర్లతో కలిసి లోపలికి వెళ్లారు. సభహాలులోకి వస్తుండగా మరోసారి సుజాత, సాజీద్‌ఖాన్ వర్గీయులు గేటు మూసివేయడంతో శ్రీనివాసరెడ్డి వర్గీయులు తోసుకుని లోపలకు వెళ్లారు. తమ నాయకుడిని వేదికపైకి పిలువాలంటూ వీహెచ్‌తో వాగ్వాదానికి దిగారు. బెంచీలను గట్టిగా చరుస్తూ నినదించారు. మరోవర్గం కార్యకర్తలు వారిని అడ్డుకునే యత్నం చేయగా ఇరువర్గాల అరుపులు, కేకలతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని గందోరగోళ పరిస్థితి. ఈ క్రమంలో వీహెచ్ శ్రీనివాస రెడ్డిని వేదికపైగా పిలువగా వచ్చి కూర్చున్నారు. అయినా ఇరువర్గాల మధ్య ఘర్షణ తగ్గలేదు. ఓ క్రమంలో నేతలపై దాడిచేసినంత పనిచేశారు. వీహెచ్ మెడలోని కండువాను శ్రీనివాసరెడ్డి వర్గీయుడు లాక్కోవడం ఉద్రిక్తతకు కారణమైంది. ఈ క్రమంలో వీహెచ్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకుండా ఆందోళన కొనసాగించడంతో చేసేదిలేక వీహెచ్‌తో సహా నేతలంతా బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపు అక్కడే వేచి చూసిన శ్రీనివాసరెడ్డి తన వర్గీయులతో కలిసి బయటకు వెళ్లారు. కాగా వీహెచ్‌కు వ్యతిరేకంగా ఆయన వర్గీయులు నినాదాలు చేశారు. 15 నిమిషాల తర్వాత తిరిగి సభ ప్రారంభం కాగా వీహెచ్ ప్రసంగించారు. సీఆర్ఆర్కు నివాళి.. ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డికి మాజీ ఎంపీ వి.హనుమంతరావు నివాళులర్పించారు. శాంతినగర్‌లోని సీఆర్ఆర్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన వెంట ఏఐసీసీ సభ్యుడు డాక్టర్ నరేష్ జాదవ్ , డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, తదితరులు ఉన్నారు. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి.. దేశవ్యాప్తంగా బీసీల గణనను నిర్వహించడంతో పాటు కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని వీహెచ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీంతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపుతో పాటు పిల్లల చదువులు, స్కాలర్షిప్ అందేలా రిజర్వేషన్లు లభిస్తాయన్నారు. దేశంలో 52శాతం, రాష్ట్రంలో 54శాతం జనాభా కలిగిన బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొన్ని బీసీ కులాలు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదన్నారు. అలాంటి వారికి బీసీ రిజర్వేషన్లు తోడ్పడనున్నాయన్నారు. రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించిన న్యాయవ్యవస్థకు సెల్యూట్ చేస్తున్నట్లుగా వెల్లడించారు. దేశంలో రాహుల్ హవా నడుస్తుందని కేంద్రంలో ఆయన ప్రధాని కావడంతో పాటు రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దెదించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. టికెట్ హైకమాండ్ నిర్ణయిస్తుందని అది ఖరారు కాకముందే బౌన్సర్లతో వచ్చి దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదని కంది శ్రీనివాసరెడ్డిపై మండిపడ్డారు. అమెరికా నుంచి ప్రజాసేవ చేసేందుకు వచ్చిన వ్యక్తి అందరినీ కలుపుకుని పోవాలే తప్ప బౌన్సర్లతో ఇతర నేతలపై దాడులు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు. -
నమ్మకానికి ప్రతిరూపంగా సేవలందిస్తాం
పోచమ్మమైదాన్ : వ్యాపారానికి పునాది నమ్మకం... దానికి ప్రతిరూపంగా సేవలందిస్తామని కంది గ్రూప్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హన్మకొండ రాంనగర్‌లోని ఏబీకే మాల్లో, కేయూ క్రాస్ రోడ్లో, కాజీపేటలోని ఫాతిమా కాంప్లెక్స్‌లో, వరంగల్ పోచమ్మమైదాన్‌లోని జకోటియా కాంప్లెక్స్‌లో, హెడ్ పోస్టాఫీస్ సమీపంలో ఐదు కంది చిట్‌ఫండ్స్ బ్రాంచిలను శనివారం ఏకకాలంలో ప్రారంభించారు. పోచమ్మమైదాన్‌లోని జకోటియా కాంప్లెక్స్‌లో వరంగల్-1 బ్రాంచ్‌ను ఐసీఏఐ వరంగల్ చెర్మైన్, ప్రముఖ సీఏ పీవీ నారాయణరావు చేతులమీదుగా ప్రారంభోత్సవం చేశారు. పూజా కార్యక్రమాల అనంతరం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని ప్రముఖ చిట్ ఫండ్స్ సంస్థల్లో వివిధ హోదాల్లో పనిచేసిన, 20 ఏళ్ల అనుభవం ఉన్నవారి పర్యవేక్షణలో నడుస్తున్న సంస్థ కంది చిట్స్ అని అన్నారు. చిట్స్ యూక్షన్ తేదీ నుంచి 15 రోజుల్లో చిట్ డబ్బులు చెల్లిస్తూ... అందరి నమ్మకాన్ని కార్యరూపంలో నిజం చేస్తూ ముందుకు సాగుతామన్నారు. ఉన్నత ప్రమాణాలు, విలువలతో కూడిన సేవలను వరంగల్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అందించేలా కంది చిట్‌ఫండ్స్ సంస్థలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. చిట్ మెంబర్ల సహాయ సహకారాలతోపాటు జిల్లా ప్రజల ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నామన్నారు. ఐసీఏఐ వరంగల్ బ్రాంచ్ చైర్మన్ నారాయణరావు మాట్లాడుతూ కంది చిట్ ఫండ్స్ జిల్లా ప్రజలకు మరిన్ని సేవలందిస్తూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రే వూరి ప్రకాష్ రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తోట సంపత్‌కుమార్, బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రేమ్‌సాగర్‌రెడ్డి, ఐరన్ అండ్ హార్డ్‌వేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దామోదర్, తెలంగాణ కాటన్ ఇండ్రస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్‌రెడ్డి, ప్రముఖ వ్యాపార వేత్త కంది రవీందర్‌రెడ్డి, కంది చిట్‌ఫండ్స్ సీఈఓ రమణారెడ్డి, తేజస్వీ స్కూల్ కారస్పాండెంట్ జెన్నారెడ్డి, మట్టెవాడ సీఐ శివరామయ్య, చిట్ ఫండ్ జీఎం, బీఎంలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.