కుక్కర్ల పంపిణీని అడ్డుకుంటున్న పోలీసులు
ఆదిలాబాద్: కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాసరెడ్డి తన కేఎస్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన కుక్కర్ల పంపిణీ శుక్రవారం రాత్రి ఆందోళనకు దారి తీసింది. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్‌లో గల టీటీడీ కల్యాణ మండపంలో కుక్కర్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందు కోసం మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అయితే ట్రాఫిక్, శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందంటూ పోలీసులు వాహనాల్లో ఉంచిన కుక్కర్లను సీజ్ చేశారు. ఆ వాహనాలను స్టేషన్‌కు తరలించేందుకు యత్నించగా మహిళలు అడ్డుకున్నారు. పార్టీ శ్రేణులు, మహిళలతో కలిసి పోలీసుల తీరును నిరసిస్తూ శ్రీనివాసరెడ్డి ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొద్ది సేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే జోగు రామన్న అడుగడుగున అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తాను కష్టపడిన డబ్బుతో ఆడబిడ్డలకు ప్రెషర్ కుక్కర్లను పంపిణీ చేస్తుంటే సహించలేక ఎమ్మెల్యే కుట్ర పూరితంగా పోలీసులను ఉసిగొల్పి కుక్కర్లను సీజ్ చేయించారని ఆరోపించారు. ఆయన మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. టోకెన్లు తీసుకున్న మహిళలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చి జోగు రామన్న ఇంటిని ముట్టడించాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment