ఆదిలాబాద్: కాంగ్రెస్‌లో వర్గపోరు తీవ్రస్థాయికి చేరింది. జిల్లాలో హస్తం పార్టీలో ఇప్పటి వరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. దీంతో లొల్లి రచ్చకెక్కింది. పట్టణంలోని విద్యుత్ తరంగిణి భవన్‌లో సోమవారం నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ ఐక్యవేదిక సభ రసాభాసగా మారడమే ఇందుకు నిదర్శనం. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ సినీయర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంత్‌రావు సమక్షంలో పార్టీ ఇరువర్గాల నాయకులు, కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
ఇటీవల పార్టీలో చేరిన ఎన్‌ఆర్‌ఐ కంది శ్రీనివాసరెడ్డి రాకను వ్యతిరేకిస్తూ డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, పార్టీ సీనియర్ నేత గండ్రత్ సుజాత వర్గీయులు గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. ఈ క్రమంలో తన వర్గీయులు గేటు దూకి తాళాన్ని పగులకొట్టగా.. శ్రీనివాసరెడ్డి బౌన్సర్లతో కలిసి లోపలికి వెళ్లారు. సభహాలులోకి వస్తుండగా మరోసారి సుజాత, సాజీద్‌ఖాన్ వర్గీయులు గేటు మూసివేయడంతో శ్రీనివాసరెడ్డి వర్గీయులు తోసుకుని లోపలకు వెళ్లారు. తమ నాయకుడిని వేదికపైకి పిలువాలంటూ వీహెచ్‌తో వాగ్వాదానికి దిగారు. బెంచీలను గట్టిగా చరుస్తూ నినదించారు.
మరోవర్గం కార్యకర్తలు వారిని అడ్డుకునే యత్నం చేయగా ఇరువర్గాల అరుపులు, కేకలతో అక్కడ ఏం జరుగుతుందో తెలియని గందోరగోళ పరిస్థితి. ఈ క్రమంలో వీహెచ్ శ్రీనివాస రెడ్డిని వేదికపైగా పిలువగా వచ్చి కూర్చున్నారు. అయినా ఇరువర్గాల మధ్య ఘర్షణ తగ్గలేదు. ఓ క్రమంలో నేతలపై దాడిచేసినంత పనిచేశారు. వీహెచ్ మెడలోని కండువాను శ్రీనివాసరెడ్డి వర్గీయుడు లాక్కోవడం ఉద్రిక్తతకు కారణమైంది.
ఈ క్రమంలో వీహెచ్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వినకుండా ఆందోళన కొనసాగించడంతో చేసేదిలేక వీహెచ్‌తో సహా నేతలంతా బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపు అక్కడే వేచి చూసిన శ్రీనివాసరెడ్డి తన వర్గీయులతో కలిసి బయటకు వెళ్లారు. కాగా వీహెచ్‌కు వ్యతిరేకంగా ఆయన వర్గీయులు నినాదాలు చేశారు. 15 నిమిషాల తర్వాత తిరిగి సభ ప్రారంభం కాగా వీహెచ్ ప్రసంగించారు.
సీఆర్‌ఆర్‌కు నివాళి..
ఇటీవల అనారోగ్యంతో మరణించిన మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డికి మాజీ ఎంపీ వి.హనుమంతరావు నివాళులర్పించారు. శాంతినగర్‌లోని సీఆర్‌ఆర్ ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. ఆయన వెంట ఏఐసీసీ సభ్యుడు డాక్టర్ నరేష్ జాదవ్ , డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి, తదితరులు ఉన్నారు.
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలి..
దేశవ్యాప్తంగా బీసీల గణనను నిర్వహించడంతో పాటు కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని వీహెచ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీంతో బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపుతో పాటు పిల్లల చదువులు, స్కాలర్‌షిప్ అందేలా రిజర్వేషన్లు లభిస్తాయన్నారు. దేశంలో 52శాతం, రాష్ట్రంలో 54శాతం జనాభా కలిగిన బీసీలకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కొన్ని బీసీ కులాలు ఇప్పటికీ అసెంబ్లీలో అడుగుపెట్టలేదన్నారు. అలాంటి వారికి బీసీ రిజర్వేషన్లు తోడ్పడనున్నాయన్నారు. రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించిన న్యాయవ్యవస్థకు సెల్యూట్ చేస్తున్నట్లుగా వెల్లడించారు.
దేశంలో రాహుల్ హవా నడుస్తుందని కేంద్రంలో ఆయన ప్రధాని కావడంతో పాటు రాష్ట్రంలో కేసీఆర్‌ను గద్దెదించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. టికెట్ హైకమాండ్ నిర్ణయిస్తుందని అది ఖరారు కాకముందే బౌన్సర్లతో వచ్చి దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదని కంది శ్రీనివాసరెడ్డిపై మండిపడ్డారు. అమెరికా నుంచి ప్రజాసేవ చేసేందుకు వచ్చిన వ్యక్తి అందరినీ కలుపుకుని పోవాలే తప్ప బౌన్సర్లతో ఇతర నేతలపై దాడులు చేయడమేంటని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment