Kandula Sivananda Reddy
-
శివానందరెడ్డి తనయుడు నాని అరెస్టు
యువతిని మోసం చేసిన కేసులో నిందితుడు కడప అర్బన్: ఓ యువతిని మోసం చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కందుల శివానందరెడ్డి తనయుడు చంద్ర ఓబుల్‌రెడ్డి అలియాస్ నానిని బుధవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం సంబటూరుకు చెందిన పుత్తా వాసంతిరెడ్డి(23).. 2013–15 మధ్యకాలంలో నగర శివార్లలోని కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు.ఆ సమయంలో నాని ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు. ఆమెను మభ్యపెట్టేందుకు 2015 ఏప్రిల్ 30న తిరుత్తణిలోనూ, అదే ఏడాది నవంబర్ 2న తిరుపతిలోనూ వివాహం చేసుకున్నాడు. తర్వాత తనతో జీవనం సాగించట్లేదని, మోసగించాడని వాసంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు నెలలక్రితం కడపలోని చిన్నచౌకు పోలీసులు నానిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నానిని బుధవారం అరెస్టు చేశారు.అయితే మీడియా కంటబడకుండా అతన్ని జిల్లా కోర్టులోని రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీధర్ ఎదుట హాజరుపరిచారు. 14 రోజులరిమాండ్ విధించారు. -
నా భర్త నాకు కావాలి
కందుల కుటుంబం నన్ను బెదిరిస్తోంది ప్రేమ వివాహం చేసుకుని పొమ్మంటున్నారు బాధితురాలు వాసంతిరెడ్డి కడప వైఎస్ఆర్ సర్కిల్: కందుల ఓబుల్‌రెడ్డి(నాని) తనను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాసంతిరెడ్డి వాపోయారు. గురువారం వైఎస్సార్ జిల్లా కడపలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2013–15లో కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో నాని, తను ప్రేమించుకున్నామని, 2015 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత తనను వాళ్లింటికి తీసుకుపొమ్మని ఓబుల్‌రెడ్డిని అడిగినట్లు చెప్పారు. అతను తనను తీసుకువెళ్లకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 10 నెలల నుంచి పెద్ద మనుషులను వాళ్ల ఇంటికి పంపితే ఏ సమాధానం చెప్పడం లేదని తెలిపారు. తన తల్లిని.. ఎంత డబ్బులు కావాలో చెప్పండి, మీ ముఖాన పడేస్తాం అంటూ అవమానించారన్నారు. ‘మా దగ్గర డబ్బు ఉంది, నిన్ను ఏమైనా చేస్తాం, మీ ఆడవాళ్లు నన్నేం చేస్తారు, మాకు రాజకీయ అండదండలు ఉన్నాయి’ అంటూ ఓబుల్‌రెడ్డి, అతని స్నేహితులు బెదిరిస్తూ, సెల్ మెసేజ్‌లతో వేధిస్తున్నారని వాసంతిరెడ్డి వాపోయారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రేమించానంటూ కళాశాలలోనే వెంటపడేవారన్నారు. ఈ విషయం కళాశాలలో అందరికీ తెలుసని పేర్కొన్నారు. బుధవారం తన భర్తను చూపించాలంటూ పెట్రోల్ బాటిల్‌తో నాని ఇంటి దగ్గరకు వెళ్లితే వారు పోలీసులను పిలిపించారన్నారు. పోలీసులు తనను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. వారిపై ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం చేశారని, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8.45 వరకు ఉంచి, తర్వాత ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ మహిళా పోలీస్ స్టేషన్‌కు పొమ్మన్నారని కన్నీరుమున్నీరయ్యారు. తన భర్తతోనే జీవితం కావాలని, అతను తనకు దక్కేవరకు పోరాడతానన్నారు. సమావేశంలో ఐద్వా మహిళా సంఘం కమిటీ సభ్యులు తస్లీమ్, నగర అధ్యక్షురాలు జమీలా, సహాయక కార్యదర్శి లక్ష్మీదేవి పాల్గొన్నారు. -
ఓబుల్ రెడ్డిపై మహిళా ప్రొఫెసర్ ఫిర్యాదు
కడప: బీజేపీ నాయకుడు కందుల శివానందరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డిపై మహిళా ప్రొఫెసర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓబుల్ రెడ్డి తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని వాసవీరెడ్డి అనే అసిస్టెంట్ ప్రొఫెసర్ కడప వన్ టౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. అతడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వాసవీ రెడ్డి గతంలో శివానందరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ పనిచేసినట్టు తెలుస్తోంది. తనకు శివానందరెడ్డి ఆస్తులు ఏమీ వద్దని, ఓబుల్ రెడ్డి భార్యగా గుర్తింపు కావాలని బాధితురాలు పేర్కొంది. తాను ఎంటెక్ చదివానని, తన కాళ్లపై తాను నిలబడగలనని తెలిపింది. భర్తతో కలిసుండాలన్న ఆకాంక్షను వ్యక్తం చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఓబుల్ రెడ్డి, వాసవీ రెడ్డి మధ్య అసలేం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.