
విలేకరుల సమావేశంలో తనకు జరిగిన అవమానాన్ని వివరిస్తూ విలపిస్తున్న వాసంతిరెడ్డి
- కందుల కుటుంబం నన్ను బెదిరిస్తోంది
- ప్రేమ వివాహం చేసుకుని పొమ్మంటున్నారు
- బాధితురాలు వాసంతిరెడ్డి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కందుల ఓబుల్‌రెడ్డి(నాని) తనను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వాసంతిరెడ్డి వాపోయారు. గురువారం వైఎస్సార్ జిల్లా కడపలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2013–15లో కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో నాని, తను ప్రేమించుకున్నామని, 2015 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నట్లు తెలిపారు. పెళ్లయిన ఆరు నెలల తర్వాత తనను వాళ్లింటికి తీసుకుపొమ్మని ఓబుల్‌రెడ్డిని అడిగినట్లు చెప్పారు.
అతను తనను తీసుకువెళ్లకుండా బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. 10 నెలల నుంచి పెద్ద మనుషులను వాళ్ల ఇంటికి పంపితే ఏ సమాధానం చెప్పడం లేదని తెలిపారు. తన తల్లిని.. ఎంత డబ్బులు కావాలో చెప్పండి, మీ ముఖాన పడేస్తాం అంటూ అవమానించారన్నారు. ‘మా దగ్గర డబ్బు ఉంది, నిన్ను ఏమైనా చేస్తాం, మీ ఆడవాళ్లు నన్నేం చేస్తారు, మాకు రాజకీయ అండదండలు ఉన్నాయి’ అంటూ ఓబుల్‌రెడ్డి, అతని స్నేహితులు బెదిరిస్తూ, సెల్ మెసేజ్‌లతో వేధిస్తున్నారని వాసంతిరెడ్డి వాపోయారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో ప్రేమించానంటూ కళాశాలలోనే వెంటపడేవారన్నారు. ఈ విషయం కళాశాలలో అందరికీ తెలుసని పేర్కొన్నారు.
బుధవారం తన భర్తను చూపించాలంటూ పెట్రోల్ బాటిల్‌తో నాని ఇంటి దగ్గరకు వెళ్లితే వారు పోలీసులను పిలిపించారన్నారు. పోలీసులు తనను వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారని తెలిపారు. వారిపై ఫిర్యాదు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం చేశారని, మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 8.45 వరకు ఉంచి, తర్వాత ఈ కేసు తమ పరిధిలోకి రాదంటూ మహిళా పోలీస్ స్టేషన్‌కు పొమ్మన్నారని కన్నీరుమున్నీరయ్యారు. తన భర్తతోనే జీవితం కావాలని, అతను తనకు దక్కేవరకు పోరాడతానన్నారు. సమావేశంలో ఐద్వా మహిళా సంఘం కమిటీ సభ్యులు తస్లీమ్, నగర అధ్యక్షురాలు జమీలా, సహాయక కార్యదర్శి లక్ష్మీదేవి పాల్గొన్నారు.