
శివానందరెడ్డి తనయుడు నాని అరెస్టు
యువతిని మోసం చేసిన కేసులో నిందితుడు
కడప అర్బన్: ఓ యువతిని మోసం చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కందుల శివానందరెడ్డి తనయుడు చంద్ర ఓబుల్‌రెడ్డి అలియాస్ నానిని బుధవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం సంబటూరుకు చెందిన పుత్తా వాసంతిరెడ్డి(23).. 2013–15 మధ్యకాలంలో నగర శివార్లలోని కేఎస్‌ఆర్‌ఎం ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసేవారు.ఆ సమయంలో నాని ఆమెను వివాహం చేసుకుంటానని నమ్మించాడు.
ఆమెను మభ్యపెట్టేందుకు 2015 ఏప్రిల్ 30న తిరుత్తణిలోనూ, అదే ఏడాది నవంబర్ 2న తిరుపతిలోనూ వివాహం చేసుకున్నాడు. తర్వాత తనతో జీవనం సాగించట్లేదని, మోసగించాడని వాసంతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు నెలలక్రితం కడపలోని చిన్నచౌకు పోలీసులు నానిపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నానిని బుధవారం అరెస్టు చేశారు.అయితే మీడియా కంటబడకుండా అతన్ని జిల్లా కోర్టులోని రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీధర్ ఎదుట హాజరుపరిచారు. 14 రోజులరిమాండ్ విధించారు.