పోలీసే మహిళల్ని లైంగికంగా వేధించారు!
అహ్మదాబాద్: ఆకతాయిల నుంచి మహిళలను రక్షించాల్సిన పోలీసే వారిని లైంగికంగా వేధించిన ఉదంతానికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగిన కంకారియా కార్నివాల్లో ఓ పోలీసు మహిళ సందర్శకులని లైంగికంగా వేధించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగుచూడటంతో గుజరాత్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
డిసెంబర్ చివరివారంలో ఏడురోజుల పాటు అహ్మదాబాద్‌లో కంకారియా కార్నివాల్ జరిగింది. ఈ కార్నివాల్‌కు పెద్ద ఎత్తున సందర్శకులు రానుండటంతో వందలమంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్నివాల్లో సాంస్కృతిక, కళాత్మక, సాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో కార్నివాల్‌కు వచ్చిన మహిళలతో ఓ పోలీసు అసభ్యంగా ప్రవర్తిస్తున్న నిమిషం పాటు వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో తీసింది ఎవరన్నది తెలియదు. వీడియోలో ఉన్న పోలీసును కూడా ఇంకా గుర్తించలేదు. వందలమంది పోలీసులు కార్నివాల్ వద్ద ఉండటంతో ఇలా అనుచితంగా ప్రవర్తించిన పోలీసు ఎవరన్నది ఇంకా గుర్తించలేదని, అంతేకాకుండా పోలీసు వెనుకవైపు నుంచి కనిపిస్తుండటంతో అతన్ని గుర్తించడం కష్టంగా మారిందని సీనియర్ ఇన్స్పెక్టర్ తెలిపారు.