అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
కొయ్యలగూడెం : కన్నాపురం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన కలపను అటవీ శాఖ ఉన్నతాధికారులు శనివారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. స్క్వాడ్ డీఎఫ్వో గురుప్రభాకర్ నేతృత్వంలో రాజమండ్రి నుంచి వచ్చిన అధికారులు ఎస్సీ ఏరియాలోని ఓ ప్రాంతంలో దాడులు చేశారు. సుమారు రూ.30 వేల విలువైన కలపను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కన్నాపురం వాసులైన కె.రామకృష్ణ, చరిమళ్ల రాంబాబు నుంచి ఈ కలపను స్వాధీనం చేసుకున్నట్టు అటవీశాఖ కార్యాలయ డీఆర్వో శ్రీనివాస్ తెలిపారు. అలాగే ముప్పిడి శ్రీను అనే వ్యక్తి వద్ద అక్రమంగా కలప నిలవ ఉండడంతో రూ. 14 వేల జరిమానాను విధించామని పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న కలపను కన్నాపురం కార్యాలయానికి తరలించామని వెల్లడించారు.