kapil dev team
-
1983 వరల్డ్‌కప్: టీమిండియా సభ్యుల మ్యాచ్ ఫీజు ఎంతో తెలుసా?
భారత క్రికెట్లో '1983' సంవత్సరం ఒక పెను సంచలనం. దేశంలో క్రికెట్‌ను పిచ్చిగా అభిమానించే స్థాయికి కారణమైన ఏడాది. క్రికెట్లో ఉండే మజాను భారత అభిమానులకు పరిచయం చేసింది ఆ సంవత్సరం. 1983 వన్డే ప్రపంచకప్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచకప్ సాధించిన కపిల్ డెవిల్స్ అద్బుతం చేసి చూపెట్టింది. అప్పటివరకు సాధారణ వ్యక్తులుగా కనిపించిన ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయారు. ప్రపంచకప్ సాధించిన టీమిండియాలోని 14 మంది ఆటగాళ్లు తర్వాతి తరానికి ఒక ఐకాన్‌గా మారిపోయారు. తాజాగా బాలీవుడ్లో కపిల్ డెవిల్స్ సాధించిన 1983 వరల్డ్‌కప్‌ను బేస్ చేసుకొని కబీర్ ఖాన్ దర్శకత్వంలో '83' సినిమా తెరకెక్కిందన్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. ఈ మధ్యన విడుదలైన ట్రైలర్‌తో తెరపై ఒక అద్భుతం చూపించబోతున్నారని క్లియర్‌గా అర్థమవుతుంది. కపిల్ దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్ నటిస్తుండడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చి చేరింది. డిసెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనున్న '83' సినిమా బ్లాక్బాస్టర్గా నిలవడం ఖామమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక కలెక్షన్ల విషయంలోనూ ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగారాసే అవకాశముందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సినిమా సంచలనం చేస్తుందా లేదా అన్నది పక్కనబెడితే.. 1983 ప్రపంచకప్‌లో టీమిండియా జట్టు సభ్యుల పారితోషికం విలువ సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. చదవండి: 83 Movie Trailer Out: '83' ట్రైలర్ విడుదల.. సెలబ్రిటీల ప్రశంసలు ఇప్పుడంటే టీమిండియా క్రికెట్ బోర్డు బీసీసీఐ.. క్రికెట్‌ను కనుసైగలతో శాసిస్తోంది. ఏకంగా ఐసీసీని కూడా ఒప్పించగల శక్తి ఉంది. మరి 1983 ప్రపంచకప్‌లో పాల్గొన్న టీమిండియా జట్టు సభ్యుల రోజువారి అలవెన్స్, మ్యాచ్ ఫీజు తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ. అప్పట్లో కపిల్ సేనకు ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ. 1500, అలవెన్స్ కింద రోజుకు రూ.200 చొప్పున మూడురోజులకు గానూ రూ.600.. మొత్తంగా రూ.2100 అందించారు. ఆ ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టు సభ్యులు ప్రతీసారి రూ.2100 మాత్రమే అందుకోవడం విశేషం. చదవండి: Kapil Dev: కపిల్‌లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి.. 2019లో మర్కండ్ వెయిన్గాంకర్ అనే జర్నలిస్ట్.. 1983 వరల్డ్‌కప్ టీమిండియా జట్టు 14 మంది సభ్యుల వేతనాలకు సంబంధించిన ఫోటోను తన ట్విటర్లో షేర్ చేస్తూ అప్పటి ఆటగాడు కనీస విలువ రూ.10 కోట్లుగా ఉంటుంది. అని చెప్పడం వైరల్‌గా మారింది. తాజాగా '83' సినిమా విడుదల నేపథ్యంలో మరోసారి టీమిండియా ఆటగాళ్ల వేతనాల ఫోటోను షేర్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా 83 సినిమా నేపథ్యంలో 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ అయిన కపిల్‌దేవ్ సేనకు సినిమా టీమ్ ప్రత్యేకంగా రూ.15 కోట్లు అందించినట్లు సమాచారం. ఈ మేరకు కెప్టెన్ అయిన కపిల్ దేవ్ రూ. 5 కోట్లు తీసుకోనున్నాడని.. మిగతా రూ. 10 కోట్లను జట్టులోని మిగతా 13 మంది సభ్యలకు సమానంగా పంచనున్నట్లు సమాచారం. Each one of them deserve 10 Cr. pic.twitter.com/BzBYSgqit6 — Makarand Waingankar (@wmakarand) July 16, 2019 ఇక ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఒక క్రికెటర్‌కు ఇస్తున్న పారితోషికం ఈ విధంగా ఉంది ►ఒక టెస్టు మ్యాచ్ ఆడితే రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు.. టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అందుతుంది. ►సెంట్రల్ కాంట్రాక్ట్ కింద ఏప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాడికి ఏడాదికి గానూ రూ. 7 కోట్లు.. ఇక గ్రేడ్ ఏ కింద ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, గ్రేడ్ బి కింద ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు, గ్రేడ్ సి కింద ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. కోటి అందజేస్తున్నారు ►ఒక మ్యాచ్‌లో ఎవరైనా బ్యాట్స్‌మన్ డబుల్ సెంచరీ సాధిస్తే రూ. 7 లక్షలు. ఇక ఐదు వికెట్లు తీసిన బౌలర్‌కు.. టెస్టులో సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌కు రూ. 5లక్షలు అదనంగా ఇస్తున్నారు. 1983 ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా లీగ్ దశలో తొలుత ఓటములు ఎదురైనప్పటికీ బెరుకు లేకుండా ముందుకు సాగుతూ ఒక్క మెట్టు ఎక్కింది. చూస్తుండగానే సెమీస్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో అప్పటికే రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. ఫైనల్‌కు ముందు ''టీమిండియా ఇంతవరకు రావడమే గొప్ప.. బలమైన విండీస్‌ను మీరు ఓడించలేరు.. వట్టి చేతులతో ఇంటికి వెళ్లండి'' అంటూ పలువురు అవమానకరంగా మాట్లాడారు. వీటన్నింటిని ఒక చాలెంజ్‌గా స్వీకరించిన భారత్ ఫైనల్లో విండీస్‌తో పోరాడైనా కప్ సాధించాలనుకుంది. జూన్ 25, 1983న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కపిల్ సేన విండీస్ బౌలర్ల దాటికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంకేముంది ఈసారి కూడా టైటిల్ విండీస్‌దే అని అంతా భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. క్లైవ్ లాయిడ్ సేన బ్యాటింగ్ సాగుతున్న కొద్దీ టీమిండియా బౌలర్లు చెలరేగి వికెట్లు తీశారు. చివరికి విండీస్ 140 పరుగులకే ఆలౌట్ కావడంతో 43 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా విశ్వవిజేతగా అవతరించింది. చదవండి: MS Dhoni International Debut: ఎంఎస్ ధోని@17.. ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు -
ఇది సిక్సర్‌కు మించినది.. సెలబ్రిటీల ప్రశంసల జల్లు
Ranveer Singh 83 Movie Trailer Out And Got Appreciation: క్రికెట్ ప్రియులకు ఆ ఆట అన్నా, ఆటపై వచ్చే సినిమాలన్న పిచ్చి ఇష్టం. వాటిపై సినిమాలు వస్తే ఇండియా వరల్డ్ కప్ గెలిచినంతగా ఆనందపడతారు. క్రికెట్ నేపథ్యంలో వచ్చిన ఎంఎస్. ధోనీ చిత్రానికి ఎంత హిట్ ఇచ్చారో తెలిసిందే. అలాంటి సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న సినీ, క్రికెట్ అభిమానుల కోసం తెరకెక్కిందే '83' చిత్రం. ఎంతగానో ఎదురు చూస్తున్న బాలీవుడ్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె నటించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. గత క్రిస్మస్ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనాతో ఆలస్యం అయింది. అశేష అభిమానుల ఎదురుచూపుల మధ్య ఎట్టకేలకు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. రణ్వీర్ సింగ్ క్రికెట్ దిగ్గజం, ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌గా కనిపించిన 3 నిమిషాల 49 సెకన్ల ట్రైలర్‌ను అభిమానులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం తెగ ఇష్టపడుతున్నారు. ఈ ట్రైలర్‌ను రణ్వీర్ సింగ్ తన ఇన్‌స్టా గ్రామ్‌లో 'అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఇంక్రెడబుల్ ట్రూ స్టోరీ #83 ట్రైలర్ హిందీ భాషలో వచ్చేసింది. డిసెంబర్ 24, 2021న హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మళయాలం భాషల్లోనే కాకుండా త్రీడీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.' రాస్తూ షేర్ చేశాడు. ఈ పోస్ట్‌పై చాలా మంది సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభిషేక్ బచ్చన్ షేక్‌హ్యాండ్ ఎమోజీతో వ్యాఖ్యానిస్తే, 'వాట్ ఏ వావ్... ఇది సిక్సర్‌ని మించినది. మీరు చేయలేనిది అంటూ ఏముంది రణ్వీర్ సింగ్. గూస్బంప్స్ తెప్పించింది. ఇది కచ్చితంగా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది.' అని రకుల్ ప్రీత్ సింగ్ కామెంట్ చేసింది. ఇషా డియోల్ 'ఔట్ స్టాండింగ్. రణ్వీర్ సింగ్ నిన్ను చూసి గర్వపడుతున్నాను.' అని తెలిపింది. View this post on Instagram A post shared by Ranveer Singh (@ranveersingh) ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రలో రణ్వీర్ సింగ్, అతని భార్య పాత్రలో దీపికా నటించారు. అలాగే తాహీర్ రాజ్ భాసిన్, జీవా, సాకిబ్ సలీమ్, జతిన్ సర్నా, చిరాగ్ పాటిల్, దిన్కర్ శర్మ, నిశాంత్ దహియా, హార్డీ సంధు, సాహిల్ ఖట్టర్, అమ్మీ విర్క్, ఆదినాథ్ కూడా యాక్ట్ చేశారు. దీపికా పదుకొణె, కబీర్ ఖాన్, విష్ణువర్ధన్ ఇందూరి, సాజిద్ నదియడ్‌వాలా, ఫాంటమ్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల కానుంది. -
‘తొలి ప్రేమ’ పుట్టిన వేళా విశేషం..
జీవితంలో ఎన్ని విజయాలు సాధించినా మొదటి గెలుపు ఇచ్చే కిక్కే వేరప్పా! మన గురించి మనం చెప్పుకుంటే ఇలాంటి భావన చాలా మందిలో సాధారణమే. సరిగ్గా ఇలాంటిదే భారత క్రికెట్‌కు కూడా వర్తింపజేస్తే ఆ తొలి గెలుపు విలువేమిటో మనకు తెలుస్తుంది. మరో మాటలో చెప్పాలంటే 1983 వన్డే వరల్డ్‌కప్ టైటిల్‌ను భారత్ గెలవడం అలాంటి అపూర్వ ఘట్టమే. రోజుకు 1500 రూపాయల మ్యాచ్ ఫీజుల నుంచి కోట్లాది రూపాయల కనకవర్షం కురిపించే స్థాయికి క్రికెట్ చేరిందంటే అది ఈ గెలుపు చలవే. భారత క్రికెట్ గతిని మార్చేసిన ఈ ఘనతకు నేటితో 37 ఏళ్లు. క్రికెట్లో విశ్వ విజేతగా నిలిచే సమయానికి భారత్‌లో హాకీదే హవా. అప్పటికే ఒకసారి ప్రపంచకప్ గెలవగా... 1980 మాస్కో ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణంతో ఏకంగా ఎనిమిది పసిడి పతకాల రికార్డు మన ఖాతాలో ఉంది. అలాంటి సమయంలో వచ్చిన కపిల్‌దేవ్ బృందం సాధించిన వరల్డ్‌కప్ విజయం దేశంలో క్రికెట్‌కు కొత్త అభిమానులను తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ఈ ఆట పంచిన వినోదం దేశంలో అద్భుతాలను సృష్టించింది. వరల్డ్‌కప్ తర్వాత ఒకవైపు క్రికెట్ ఉజ్వలంగా వెలుగుతూ ఉవ్వెత్తున దూసుకుపోగా.... దానికి వ్యతిరేక దిశలో హాకీ పతనం కూడా ప్రారంభమైంది. ఆ తర్వాత భారత్‌లో తిరుగులేని ఆటగా, ఒక మతంగా క్రికెట్ మారిపోయింది. అంచనాలు లేకుండా... 1975లో జరిగిన తొలి ప్రపంచకప్‌లో భారత్ 3 మ్యాచ్‌లలో ఒకటే, అదీ ఎవరూ పట్టించుకోని ఈస్ట్ ఆఫ్రికాపై గెలిచింది. 1979లో రెండో ప్రపంచకప్‌లో ఆ విజయం కూడా దక్కకుండా సున్నాకు సున్నా మార్కులే వచ్చాయి. పైగా వరల్డ్‌కప్‌లు మినహాయించి అప్పటి వరకు కేవలం 10 వన్డే సిరీస్‌లే ఆడిన భారత్ సొంతగడ్డపై 2 మాత్రమే గెలిచి, మిగతా 8 ఓడింది. ఇలాంటి నేపథ్యంతో బరిలోకి దిగిన 1983 ప్రపంచకప్‌లో కపిల్‌దేవ్ బృందంపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ చివరకు అందరి లెక్కలను తలకిందులు చేస్తూ తుదిపోరుకు భారత్ అర్హత సాధించింది. లీగ్ దశలో గ్రూప్‌లోని మిగిలిన 3 జట్లతో రెండేసిసార్లు భారత్ తలపడింది. వెస్టిండీస్‌పై 34 పరుగులతో గెలుపు... 66 పరుగులతో ఓటమి; ఆస్ట్రేలియాపై 162 పరుగులతో ఓటమి... 118 పరుగులతో విజయం; జింబాబ్వేపై 5 వికెట్లతో... 31 పరుగులతో విజయాలు భారత్ ఖాతాలో చేరాయి. 4 మ్యాచ్‌లు గెలిచి సెమీఫైనల్ చేరిన మన టీమ్ సెమీస్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును 6 వికెట్లతో చిత్తు చేసి ఫైనల్ చేరింది. అద్భుతం ఆవిష్కృతం... జూన్ 25, 1983... ఫైనల్‌కు వెళ్లినా, అప్పటికే లీగ్‌లో ఓడించినా సరే... దుర్బేధ్యమైన లైనప్ ఉన్న డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌తో గెలుపు అంత సులువు కాదని అందరికీ తెలుసు. పైగా ముందుగా బ్యాటింగ్ చేసి 183 పరుగులకే కుప్పకూలడంతో ఇక ఆశలు లేకపోయాయి. కానీ కపిల్ డెవిల్స్ మాత్రం తమపై నమ్మకం కోల్పోలేదు. తమ సర్వశక్తులూ ఒడ్డి వెస్టిండీస్ జట్టును 140 పరుగులకే ఆలౌట్ చేసింది. 43 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి విశ్వవిజేతగా నిలిచిన క్షణాన లార్డ్స్ మైదానం భారత అభిమానుల హోరుతో ఊగిపోయింది. ప్రపంచ క్రికెట్‌పై భారత్ ముద్ర పడిన ఆ క్షణం ఎప్పటికీ మరచిపోలేని మధుర ఘట్టంగా మిగిలిపోయింది. –సాక్షి క్రీడా విభాగం -
మనోళ్లు చరిత్ర సృష్టించిన రోజు ఇది..
టీమిండియాకు, భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైన రోజు ఇది. భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించి జగజ్జేతగా నిలిచిన రోజు ఇది. వెస్టిండీస్ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న రోజుల్లో, ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్ ప్రపంచ కప్ సాధించి.. నేటి సరిగ్గా 33 సంవత్సరాలు. 1983 జూన్ 25న ప్రఖ్యాత లండన్ లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్ సమరంలో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. అప్పటి వరకు కలగానే మిగిలిపోయిన ప్రపంచ కప్‌ను సాకారం చేసుకుంది. ఈ విజయం తర్వాత భారత్ క్రికెట్ దశ క్రమేణా మారిపోయింది. ఆటలోనే కాదు పాలనలోనూ ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయికి ఎదిగింది. లార్డ్స్ ఫైనల్‌ను ఓ సారి గుర్తు చేసుకుందాం. అప్పట్లో వన్డేలను 60 ఓవర్ల చొప్పున ఆడేవారు. ప్రపంచ కప్ ఫైనల్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన కపిల్ సేన 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టులో అత్యధికంగా శ్రీకాంత్ 38 పరుగులు చేశాడు. సందీప్ పాటిల్ 27, మొహిందర్ అమర్నాథ్ 26 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లు ఆండీ రాబర్ట్స్ మూడు, మాల్కం మార్షల్, మైఖేల్ హోల్డింగ్, లారీ గోమ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్‌ను భారత బౌలర్లు 52 ఓవర్లలో 140 పరుగులకు కట్టడి చేయడంతో ప్రపంచ కప్ సొంతమైంది. వివ్ రిచర్డ్స్ 33, జెఫ్ డుజన్ 25, మాల్కం మార్షల్ 18 మినహా ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లు మొహిందర్ అమర్నాథ్, మదన్‌లాల్ చెరో రెండు, బల్వీందర్ సంధు రెండు వికెట్లు తీశారు.