భారత క్రికెట్‌లో '1983' సంవత్సరం ఒక పెను సంచలనం. దేశంలో క్రికెట్‌ను పిచ్చిగా అభిమానించే స్థాయికి కారణమైన ఏడాది. క్రికెట్‌లో ఉండే మజాను భారత అభిమానులకు పరిచయం చేసింది ఆ సంవత్సరం. 1983 వన్డే ప్రపంచకప్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచకప్ సాధించిన కపిల్ డెవిల్స్ అద్బుతం చేసి చూపెట్టింది. అప్పటివరకు సాధారణ వ్యక్తులుగా కనిపించిన ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయారు. ప్రపంచకప్ సాధించిన టీమిండియాలోని 14 మంది ఆటగాళ్లు తర్వాతి తరానికి ఒక ఐకాన్‌గా మారిపోయారు.
తాజాగా బాలీవుడ్‌లో కపిల్ డెవిల్స్ సాధించిన 1983 వరల్డ్‌కప్‌ను బేస్ చేసుకొని కబీర్ ఖాన్ దర్శకత్వంలో '83' సినిమా తెరకెక్కిందన్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుంచే మంచి హైప్ తెచ్చుకుంది. ఈ మధ్యన విడుదలైన ట్రైలర్‌తో తెరపై ఒక అద్భుతం చూపించబోతున్నారని క్లియర్‌గా అర్థమవుతుంది. కపిల్ దేవ్‌గా రణ్‌వీర్‌సింగ్ నటిస్తుండడంతో ఈ సినిమాకు మరింత హైప్ వచ్చి చేరింది. డిసెంబర్ 24న థియేటర్లలో సందడి చేయనున్న '83' సినిమా బ్లాక్‌బాస్టర్‌గా నిలవడం ఖామమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక కలెక్షన్ల విషయంలోనూ ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగారాసే అవకాశముందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సినిమా సంచలనం చేస్తుందా లేదా అన్నది పక్కనబెడితే.. 1983 ప్రపంచకప్‌లో టీమిండియా జట్టు సభ్యుల పారితోషికం విలువ సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.
చదవండి: 83 Movie Trailer Out: '83' ట్రైలర్ విడుదల.. సెలబ్రిటీల ప్రశంసలు
ఇప్పుడంటే టీమిండియా క్రికెట్ బోర్డు బీసీసీఐ.. క్రికెట్‌ను కనుసైగలతో శాసిస్తోంది. ఏకంగా ఐసీసీని కూడా ఒప్పించగల శక్తి ఉంది. మరి 1983 ప్రపంచకప్‌లో పాల్గొన్న టీమిండియా జట్టు సభ్యుల రోజువారి అలవెన్స్, మ్యాచ్ ఫీజు తెలిస్తే షాక్ అవ్వడం గ్యారంటీ. అప్పట్లో కపిల్ సేనకు ఒక్కో మ్యాచ్‌కు ఫీజు రూ. 1500, అలవెన్స్ కింద రోజుకు రూ.200 చొప్పున మూడురోజులకు గానూ రూ.600.. మొత్తంగా రూ.2100 అందించారు. ఆ ప్రపంచకప్‌లో టీమిండియా ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ జట్టు సభ్యులు ప్రతీసారి రూ.2100 మాత్రమే అందుకోవడం విశేషం.
చదవండి: Kapil Dev: కపిల్‌లా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ చేయండి..
2019లో మర్కండ్ వెయిన్‌గాంకర్ అనే జర్నలిస్ట్.. 1983 వరల్డ్‌కప్ టీమిండియా జట్టు 14 మంది సభ్యుల వేతనాలకు సంబంధించిన ఫోటోను తన ట్విటర్‌లో షేర్ చేస్తూ అప్పటి ఆటగాడు కనీస విలువ రూ.10 కోట్లుగా ఉంటుంది. అని చెప్పడం వైరల్‌గా మారింది. తాజాగా '83' సినిమా విడుదల నేపథ్యంలో మరోసారి టీమిండియా ఆటగాళ్ల వేతనాల ఫోటోను షేర్ చేయడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా 83 సినిమా నేపథ్యంలో 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ అయిన కపిల్‌దేవ్ సేనకు సినిమా టీమ్ ప్రత్యేకంగా రూ.15 కోట్లు అందించినట్లు సమాచారం. ఈ మేరకు కెప్టెన్ అయిన కపిల్ దేవ్ రూ. 5 కోట్లు తీసుకోనున్నాడని.. మిగతా రూ. 10 కోట్లను జట్టులోని మిగతా 13 మంది సభ్యలకు సమానంగా పంచనున్నట్లు సమాచారం.
Each one of them deserve 10 Cr. pic.twitter.com/BzBYSgqit6
— Makarand Waingankar (@wmakarand) July 16, 2019
ఇక ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఒక క్రికెటర్‌కు ఇస్తున్న పారితోషికం ఈ విధంగా ఉంది
►ఒక టెస్టు మ్యాచ్ ఆడితే రూ. 15 లక్షలు.. ఒక వన్డే మ్యాచ్‌కు రూ.6 లక్షలు.. టి20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అందుతుంది.
►సెంట్రల్ కాంట్రాక్ట్ కింద ఏప్లస్ కేటగిరీలో ఉన్న ఆటగాడికి ఏడాదికి గానూ రూ. 7 కోట్లు.. ఇక గ్రేడ్ ఏ కింద ఉన్న ఆటగాళ్లకు రూ. 5 కోట్లు, గ్రేడ్ బి కింద ఉన్న ఆటగాళ్లకు రూ. 3 కోట్లు, గ్రేడ్ సి కింద ఉన్న ఆటగాళ్లకు ఏడాదికి రూ. కోటి అందజేస్తున్నారు
►ఒక మ్యాచ్‌లో ఎవరైనా బ్యాట్స్‌మన్ డబుల్ సెంచరీ సాధిస్తే రూ. 7 లక్షలు. ఇక ఐదు వికెట్లు తీసిన బౌలర్‌కు.. టెస్టులో సెంచరీ సాధించిన బ్యాట్స్‌మన్‌కు రూ. 5లక్షలు అదనంగా ఇస్తున్నారు.
1983 ప్రపంచకప్‌లో అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా లీగ్ దశలో తొలుత ఓటములు ఎదురైనప్పటికీ బెరుకు లేకుండా ముందుకు సాగుతూ ఒక్క మెట్టు ఎక్కింది. చూస్తుండగానే సెమీస్‌లో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైనల్లో అప్పటికే రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన వెస్టిండీస్‌తో తలపడాల్సి ఉంది. ఫైనల్‌కు ముందు ''టీమిండియా ఇంతవరకు రావడమే గొప్ప.. బలమైన విండీస్‌ను మీరు ఓడించలేరు.. వట్టి చేతులతో ఇంటికి వెళ్లండి'' అంటూ పలువురు అవమానకరంగా మాట్లాడారు.
వీటన్నింటిని ఒక చాలెంజ్‌గా స్వీకరించిన భారత్ ఫైనల్లో విండీస్‌తో పోరాడైనా కప్ సాధించాలనుకుంది. జూన్ 25, 1983న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కపిల్ సేన విండీస్ బౌలర్ల దాటికి 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇంకేముంది ఈసారి కూడా టైటిల్ విండీస్‌దే అని అంతా భావించారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. క్లైవ్ లాయిడ్ సేన బ్యాటింగ్ సాగుతున్న కొద్దీ టీమిండియా బౌలర్లు చెలరేగి వికెట్లు తీశారు. చివరికి విండీస్ 140 పరుగులకే ఆలౌట్ కావడంతో 43 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియా విశ్వవిజేతగా అవతరించింది.
చదవండి: MS Dhoni International Debut: ఎంఎస్ ధోని@17.. ఎన్నిసార్లు చదివినా బోర్ కొట్టదు
Comments
Please login to add a commentAdd a comment