మనోళ్లు చరిత్ర సృష్టించిన రోజు ఇది..
టీమిండియాకు, భారత క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైన రోజు ఇది. భారత క్రికెట్ చరిత్రలో తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించి జగజ్జేతగా నిలిచిన రోజు ఇది. వెస్టిండీస్ ప్రపంచ క్రికెట్ను శాసిస్తున్న రోజుల్లో, ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కపిల్ డెవిల్స్ ప్రపంచ కప్ సాధించి.. నేటి సరిగ్గా 33 సంవత్సరాలు. 1983 జూన్ 25న ప్రఖ్యాత లండన్ లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్తో జరిగిన ఫైనల్ సమరంలో భారత్ చరిత్రాత్మక విజయం సాధించింది. అప్పటి వరకు కలగానే మిగిలిపోయిన ప్రపంచ కప్ను సాకారం చేసుకుంది. ఈ విజయం తర్వాత భారత్ క్రికెట్ దశ క్రమేణా మారిపోయింది. ఆటలోనే కాదు పాలనలోనూ ప్రపంచ క్రికెట్ను శాసించే స్థాయికి ఎదిగింది. లార్డ్స్ ఫైనల్ను ఓ సారి గుర్తు చేసుకుందాం.
అప్పట్లో వన్డేలను 60 ఓవర్ల చొప్పున ఆడేవారు. ప్రపంచ కప్ ఫైనల్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ దిగిన కపిల్ సేన 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. భారత జట్టులో అత్యధికంగా శ్రీకాంత్ 38 పరుగులు చేశాడు. సందీప్ పాటిల్ 27, మొహిందర్ అమర్నాథ్ 26 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లు ఆండీ రాబర్ట్స్ మూడు, మాల్కం మార్షల్, మైఖేల్ హోల్డింగ్, లారీ గోమ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన విండీస్ను భారత బౌలర్లు 52 ఓవర్లలో 140 పరుగులకు కట్టడి చేయడంతో ప్రపంచ కప్ సొంతమైంది. వివ్ రిచర్డ్స్ 33, జెఫ్ డుజన్ 25, మాల్కం మార్షల్ 18 మినహా ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. భారత బౌలర్లు మొహిందర్ అమర్నాథ్, మదన్లాల్ చెరో రెండు, బల్వీందర్ సంధు రెండు వికెట్లు తీశారు.