![Virat Kohli likely to play IND vs ENG 2nd ODI in Cuttack,](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/Jaiswal.jpg.webp?itok=mFRxCXBk)
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat kohli).. ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. తొలి వన్డేకు ముందు నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కోహ్లి కూడి కాలి మోకాలికి గాయమైంది.
దీంతో నాగ్‌పూర్ వన్డేకు అతడు దూరంగా ఉన్నాడు. అయితే కోహ్లి ఇప్పుడు గాయం నుంచి కోలుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టినట్లు సమాచారం. దీంతో ఫిబ్రవరి 8న కటక్ వేదికగా జరగనున్న రెండో వన్డేకు అందుబాటులో ఉండనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
"బుధవారం ప్రాక్టీస్ సందర్భంగా విరాట్ కోహ్లి కుడి కాలి మోకాలికి బంతి తాకింది. అయినప్పటికి అతడు తన ప్రాక్టీస్‌ను కొనసాగించాడు. ప్రాక్టీస్ సమయంలో ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ శిక్షణ తర్వాత హూటల్‌కు వెళ్లాక అతడి మోకాలిలో వాపు కన్పించింది. దీంతో ముందు జాగ్రత్తగా అతడికి విశ్రాంతిని ఇచ్చాము. విరాట్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. అతడు కటక్ వన్డేలో ఆడే అవకాశం ఉందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నారు.
అదేవిధంగా కోహ్లి గాయంపై టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సైతం అప్‌డేట్ ఇచ్చాడు. "విరాట్ భాయ్ గాయంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదు. మా తర్వాతి గేమ్‌కు అతడు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని" తొలి వన్డే అనంతరం గిల్ పేర్కొన్నాడు.
జైశ్వాల్‌పై వేటు..
ఇక విరాట్ కోహ్లి రెండో వన్డేకు అందుబాటులోకి వస్తే యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌పై వేటు పడే అవకాశముంది. నాగ్‌పూర్ వన్డేతో అరంగేట్రం చేసిన జైశూ.. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో అతడిని పక్కన పెట్టి శుబ్‌మన్ గిల్‌ను యథావిధిగా ఓపెనర్‌గా పంపాలని టీమ్ మెనెజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరుసగా మూడు, నాలుగు స్ధానాల్లో విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.
సచిన్ రికార్డుకు చేరువలో కోహ్లి..
ఇక ఈ మ్యాచ్‌కు ముందు విరాట్ కోహ్లికి ఓ ప్రపంచరికార్డు ఊరిస్తోంది. కటక్ వన్డేలో కోహ్లి మరో 96 రన్స్ చేస్తే.. అత్యంతవేగంగా వన్డేల్లో 14,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ తన 350వ వన్డే ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌పై ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కోహ్లి విషయానికి వస్తే.. 283 వన్డే ఇన్నింగ్స్‌లలో 58.18 సగటుతో 13906 పరుగులు చేశాడు.
చదవండి: IND vs ENG: శ్రేయస్ అయ్యర్ వరల్డ్ రికార్డు..
Comments
Please login to add a commentAdd a comment