Karepally
-
చంపి, మూడు ముక్కలు చేసి.. లైంగిక వాంఛ తీర్చనందుకే!
కారేపల్లి: ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా చేసి రైలు పట్టాలపై పడవేసిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లిలో మంగళవారం జరిగింది. కారేపల్లి అంబేడ్కర్ కాలనీకి చెందిన ఆదెర్ల ఉపేందర్.. మండల పరిధిలోని భజ్యాతండాకు చెందిన అజ్మీరా నాజి(70) అనే వృద్ధురాలిని రెండ్రోజుల క్రితం కాలనీలోని తన ఇంటి వద్దనే హత్య చేశాడు. కాళ్లు, చేతులు, తలను మొండెం నుంచి వేరు చేసి వాటిని చీమలపాడు అటవీ ప్రాంతంలో కాల్చి వేశాడు. అనంతరం సోమవారం రాత్రి మొండెంను బస్తాలో వేసుకుని మరో యువకుడి సాయంతో తరలించేందుకు ప్రయత్నించాడు. యువకుడు ఆ బస్తా గురించి అడగ్గా.. అది అడవి పంది అని, దుర్వాసన వస్తుండటంతో అటవీ అధికారులు చూస్తే కేసు అవుతుందని బయట పడవేస్తున్నానని నమ్మబలికి ఆ యువకుడి సాయంతో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం తిర్లాపురం రైల్వే ట్రాక్‌పై పడవేశారు. అయితే, ఉపేందర్ మాటలతో అనుమానం వచ్చిన సదరు యువకుడు మూట విప్పి చూడగా అందులో మొండెం కనిపించింది. దీంతో భయాందోళనలకు గురైన సదరు యువకుడు కారేపల్లి పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఉపేందర్‌ను పట్టుకుని విచారణ చేస్తున్నారు. కాగా.. తాను లైంగిక వాంఛ తీర్చమని అడిగితే తిరస్కరించినందుకే హత్య చేశానని, శవాన్ని మాయం చేసేందుకే ఇలా చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు క్షుద్ర పూజల నేపథ్యంలోనే వృద్ధురాలిని హత్య చేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉపేందర్‌తోపాటు మరికొందరు కూడా హత్యలో పాలు పంచుకుని ఉంటా రని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఇల్లెందు ఏసీపీ వెంకటరెడ్డి, కారేపల్లి సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ సురేశ్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కరోనాతో ఉద్యోగం రాదని విద్యార్థి బలవన్మరణం -
ఇద్దరిని మింగిన చెరువు
నాన్నా నేను ఈత నేర్చుకుంటా.. అంటూ ఆ బాలుడు చెరువు ఒడ్డు నుంచి నీళ్లలోకి దిగాడు. అంతేఒక్కసారిగా మునిగిపోతూ.. నాన్న.. నాన్న అని కేకలు వేశాడు. కుమారుడిని కాపాడేందుకు తండ్రి కూడా చెరువులో దిగాడు. భయంతో తండ్రీకొడులకు ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఇద్దరూ మునిగిపోయారు. ఇటీవల ‘మిషన్ కాకతీయ’ పనులతో ఏర్పడిన పెద్ద పెద్ద గోతులు ఆ తండ్రీకొడుకుల ప్రాణాలు తీశాయి. సాక్షి, కారేపల్లి: కొడుకు చెరువులో మునిగిపోతుండగా కాపాడబోయి తండ్రి కూడా నీటిలో మునిగి ఇద్దరూ మృత్యువాత పడ్డ సంఘటన కారేపల్లి మండలం గుంపెళ్లగూడెం గ్రామంలో శని వా రం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని గుంపెళ్లగూడెం గ్రామానికి చెందిన పిప్పళ్ల సత్యనారాయణ (45), పిప్పళ్ల సులోచ న దంపతులకు కుమారుడు పిప్పళ్ల భరత్ (14), కుమార్తె శైలజ ఉన్నారు. భరత్ సమీప గ్రామం పేరుపల్లి హైసూ్కల్లో 9వ తరగతి చదువుతున్నాడు. శైలజ మణుగూరులోని ఓ హాస్టల్లో ఉంటూ 10వ తరగతి చదువుతోంది. సత్యనారాయణ దంపతులు గ్రామంలో ఇస్త్రీ షాపు నడుపుకుంటూ, రజక వృత్తి నిర్వహించుకుంటూ, కూలి పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. ఈ నెల 14వ తేదీన వారి ఎదురింట్లో వివాహ వేడుక జరిగింది. ఇంటిల్లిపాది వివాహవేడుకల్లో పాల్గొన్నా రు. శనివారం సత్యనారా యణ దంపతులు పెళ్లి ఇంటి బట్టలు ఉతికేందుకు సమీపంలోని మాధారం చెరువు అలుగు వద్దకు వెళ్లారు. స్వల్ప అనారోగ్యంతో పాఠశాలకు వెళ్లకుండా ఇంటివద్ద ఉన్న భరత్ కూడా వారితోపాటు వెళ్లాడు. పనిలో అమ్మానాన్నలకు సాయం చేశా డు. బట్టలు ఉతకటం పూర్తయ్యాక ఈత నేర్చుకుంటానంటూ చెరువు ఒడ్డు నుంచి నీటిలోకి దిగాడు. ఇటీవల మిషన్ కాకతీయ పథకంలో చేపట్టిన పనులతో చెరువు అలుగు వద్ద పెద్ద పెద్ద గొయ్యిలు ఏర్పడ్డాయి. దీంతో బాలు డు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగి పోతూ.. ‘నాన్న నాన్న’అని కేకలు వేశాడు. అక్కడే ఉన్న తండ్రి.. కొడుకును కాపాడేందుకు చెరువులో దిగాడు. భయంతో ఒకరునొకరు గట్టిగా పట్టుకోవడం, తండ్రికి ఈతవచ్చినా.. ఈతకొట్టే వీలుకాక పోవటంతో..ఇద్దరూ నీటిలో మునిగి పోయారు. దీంతో తల్లి ఓ కొడుకో..! ఓ దేవుడో..!! అంటూ కేకలు వేసింది. కేకలు విన్న గ్రామ యువకులు పరుగు పరుగున వచ్చి చెరువులోకి దిగారు. అర్ధగంటపాటు గాలింపు చేపట్టారు. చెరువు అడుగుకు చేరిన తండ్రీ కొడుకులను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే ఇద్ద రూ మృతి చెందారు. కళ్ల ముందే భర్త, కుమారుడు విగత జీవులుగా మారడంతో సులోచన కన్నీరుమున్నీరుగా విలపించింది. కొడుకు మృతదేహం పై పడి ‘ఒక్కసారి లే కొడకా..! ఓ దేవుడా నా కొడుకుకు ఊపిరి ఊదు దేవుడా..!! అంటూ రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. ఘటన స్థలాన్ని సింగరేణి సీఐ బి శ్రీనివాసులు, ఎస్ఐ పొదిల వెంకన్న, ఆర్ఐ సక్రు, వీఆర్వో నాగలక్ష్మి సందర్శించారు. పంచనామా నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఒకే ఇంట్లో ఇద్దరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
రూపాయి దొంగతనం; వాతలు పెట్టిన తల్లి
సాక్షి, కారేపల్లి: అభం శుభం తెలియని ఓ చిన్నారిపై కన్నతల్లి కర్కశత్వాన్ని ప్రదర్శించింది. పొయ్యిలో కొరకాసుతో చేయి, తొడ భాగంపై వాతలు పెట్టింది. తీవ్ర గాయాల పాలైన చిన్నారి కేకలు వేస్తూ విలవిల్లాడిపోయింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం పేరుపల్లి గ్రామానికి చెందిన సిరికొండ నాగమణి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. భర్త లక్ష్మయ్య ఆమెను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. దీంతో 10 ఏళ్ల కూతురు కృష్ణవేణితో కలిసి జీవిస్తోంది. చిన్నారి ఇంట్లో ఒక రూపాయి దొంగతనం చేసిందని, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 29వ తేదీన రాత్రి పొయ్యిలో మండుతున్న కర్ర (కొరకాసు) తీసుకొని చిన్నారి చేతిపై, తొడ భాగంపై విచక్షణరహితంగా వాతలు పెట్టింది. తీవ్రగాయాల పాలైన చిన్నారి ఏడుస్తూ అల్లాడిపోయింది. ఇరుగుపొరుగు గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగమణికి బుద్ధి చెప్పే ప్రయత్నం చేశారు. తల్లి నాగమణికి కౌన్సెలింగ్ ఇస్తున్న ఐసీడీఎస్ అధికారులు అయినా తాను చేసిన తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయగా..ఓ యువకుడు తన సెల్ ఫోన్‌తో వీడియో తీసి స్థానికంగా ఉన్న వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. అది వైరల్‌గా మారింది. సోమవారం ఉదయం విలేకరులు, ఐసీడీఎస్ అధికారులు పేరుపల్లి గ్రామానికి చేరుకుని గాయ పడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఐసీడీఎస్ సీడీపీఓ దమయంతి, సూపర్వైజర్ పుష్పావతిలు నాగమణికి కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నారిని సీడబ్ల్యూసీ అధికారులు ఆదేశాల మేరకు ఖమ్మంలోని బాలల సదన్‌కు తరలించారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పుష్పావతి ఫిర్యాదు మేరకు కృష్ణవేణిపై ఎస్ఐ పొదిల వెంకన్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీఓ విలేకరులతో మాట్లాడుతూ చిన్నారి గాయాలు మానేవరకు బాలల సదన్‌లో ఉంచి చికిత్స నిర్వహిస్తామని తెలిపారు. సీడబ్ల్యూసీ అధికారుల సూచనల మేరకు చిన్నారిని హాస్టల్లో ఉంచి చదివించాలా? తల్లికి అప్పగించటమా..! అనే విషయమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. -
ఓ కొడుకా.. నీ వెంటే వస్తున్నా..!
సాక్షి, కారేపల్లి: చెట్టంత కొడుకు మరణాన్ని తట్టుకోలేని ఓ తల్లి, ‘ఓరి కొడుకా.. నీ వెంటే వస్తున్నా’నన్నట్టుగా, గుండెపోటుతో మృతిచెందింది. కారేపల్లి రైల్వే స్టేషన్ రోడ్డులో హోటల్ నిర్వహిస్తున్న షేక్ మరున్‌బీ(70) భర్త పదేళ్ల క్రితం మృతిచెందాడు. వీరికి ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. ఒక కుమార్తె, ఒక కుమారుడు మూగవారు. వివాహితురాలైన మరో కుమార్తె, భర్త మృతితో పుట్టింటిలోనే ఉంటోంది. రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన ఓ కుమారుడు కూడా ఇంటి వద్దే ఉంటున్నాడు. ఇంత పెద్ద కుటుంబాన్ని చిన్న కుమారుడైన ఇక్బాల్ పోషిస్తున్నాడు. గత నెల 31న రైలు ప్రమాదంలో ఇక్బాల్ మృతిచెందాడు. అప్పటినుంచి తల్లి మరున్‌బీ తీవ్ర మనోవేదనతో ఉంటోంది. ఆమె బుధవారం రాత్రి తీవ్రంగా అస్వస్థురాలైంది. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందింది. కుటుంబ పోషకుడైన సోదరుడు, తల్లి దూరమవడంతో ఆ ఇంటిలోని వారి పరిస్థితి దయనీయంగా మారింది. మూగవారైన జకియా, నిజాముద్దీన్‌ను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. -
రైలు నుంచి జారి పడి యువకుడి మృతి
కారేపల్లి : ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి యువకుడు మృతి చెందిన ఘటన కారేపల్లి రైల్వే స్టేషన్లో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కారేపల్లి రైల్వే స్టేషన్ బజార్‌కు చెందిన షేక్ ఇక్బాల్ (33) రైల్వే స్టేషన్‌కు ఎదురుగా హోటల్ నిర్వహిస్తున్నాడు. స్టేషన్లో రైలు ఆగినప్పుడు ఇక్బాల్ వాటర్ బాటిల్, ఫ్రూట్ బాటిల్స్ అమ్ముతుంటాడు. ఎప్పటిలాగే కొత్తగూడెం నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్యాసింజర్ కారేపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే వాటర్, ఫ్రూట్ బాటిల్స్‌తో ఇక్బాల్ ఆగి ఉన్న రైలు ఎక్కి అమ్మాడు. రైలు కదులుతున్న సమయంలో ప్లాట్‌ఫాం వైపు కాకుండా మరో వైపు దిగే క్రమంలో రైలు కింద పడి పోయాడు. సుమారు 20 మీటర్ల మేర వరకు రైలు లాక్కెల్లింది. తీవ్ర గాయాలపాలైన ఇక్బాల్‌ను గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించారు. ఎస్ఐ కిరణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని ఖమ్మంలో ఓ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇక్బాల్ మృతి చెందాడు. అందరితో కలువుడిగా ఉంటూ సుపరిచితుడిగా పేరున్న ఇక్బాల్ మరణ వార్తతో స్నేహితులు దుఃఖ సాగరంలో మునిగిపో యారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఇక్బాల్ మృతి చెందటంతో కుటుంబ సభ్యులు దిక్కుతోచక గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. మృతుడు ఇక్బాల్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి వీరాభిమాని కాగా, వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ నాయకుడిగా కొనసాగుతున్నాడు. -
బొలేరో బోల్తా.. 15 మంది కూలీలకు గాయాలు
కారేపల్లి: మిర్చి తోట ఏరుటకు వచ్చిన కూలీలతో ఉన్న బొలేరో మ్యాక్స్ వాహనం అదుపు తప్పి బోల్తా పడిన ఘటన మండల పరిధిలోని గుడితండా–చీమలపాడు రహదారి మధ్యలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం టేకులపల్లి మండలం తడికలపుడికి చెందిన 15 మంది మహిళా కూలీలు సోమవారం కారేపల్లి మండలంలోని గుడితండా గ్రామంలో మిర్చి ఏరుటకు వచ్చారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో గుడితండా–చీమలపాడు బీటీ రోడ్డు మధ్యలో ఉన్న మూలమలుపు వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మరో వాహనంలో ఇల్లందు ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. -
రైల్వే ఉద్యోగితో ఘర్షణ : ఫోన్లు ధ్వంసం
కారేపల్లి: ఓ యువకుడికి, రైల్వే టికెట్ కౌంటర్లో ఉద్యోగికి మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన యువకుడు స్టేషన్‌లోని ల్యాండ్ ఫోన్లను ధ్వంసం చేశాడు. ఈ సంఘటన ఖమ్మం-భద్రాచలం రోడ్డు రైలు మార్గంలోని కారేపల్లి రైల్వే స్టేషన్లో శనివారం ఉదయం జరిగింది. తమ బంధువులు రైలు ఎక్కాలి.. టికెట్టు ఇవ్వమంటూ సారంగపాణి, సంపత్ అనే యువకులు టికెట్ కౌంటర్ వద్దకు వచ్చారు. అయితే రైలు కదులుతోంది.. టికెట్టు ఇవ్వడం కుదరదంటూ ఆ ఉద్యోగి చెప్పాడు. దీంతో ఆగ్రహించిన యువకులు ఆ ఉద్యోగితో ఘర్షణ పడ్డారు. అనంతరం స్టేషన్ మేనేజర్‌ను కలిసేందుకు వెళ్తుండగా అక్కడున్న రైల్వే సిబ్బంది వారిని అడ్డగించి తోసేయడంతో సారంగపాణి గోడకు తగిలి కిందపడ్డాడు. గాయపడిన అతను ఆగ్రహంతో అక్కడున్న ల్యాండు ఫోన్లను ధ్వంసం చేయడంతో కొద్దిసేపు కమ్యూనికేషన్లకు అంతరాయం కలిగింది. ఈ క్రమంలో రెండో యువకుడు సంపత్ అక్కడినుంచి జారుకున్నాడు. అనంతరం డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి రైల్వే పోలీసులు వచ్చి వివరాలు సేకరించి ఆ యువకులపై కేసు పెట్టారు. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. -
ఏడేళ్ల బాలికపై అత్యాచారం
కారేపల్లి (ఖమ్మం జిల్లా) : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాధారం గ్రామంలో ఏడేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన పాస్తం నాగ(20) అనే యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. గమనించిన కుటుంబసభ్యులు కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రైతు బలవన్మరణం
కారేపల్లి (ఖమ్మం) : ఆర్థిక ఇబ్బందులు తాళలేక రైతు వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం మాదారం పంచాయతీ పరిధిలోని కొత్త తండాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తండాకు చెందిన ధరావత్ భీముడు(48) తనకున్న నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు రూ. 3 లక్షలు కావడంతో వాటిని తీర్చే దారి కానరాక బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.