
మృతురాలు అజ్మీరా నాజి(ఫైల్ ఫొటో), నిందితుడు ఉపేందర్
కారేపల్లి: ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసి శరీర భాగాలను ముక్కలుగా చేసి రైలు పట్టాలపై పడవేసిన ఘటన ఖమ్మం జిల్లా కారేపల్లిలో మంగళవారం జరిగింది. కారేపల్లి అంబేడ్కర్ కాలనీకి చెందిన ఆదెర్ల ఉపేందర్.. మండల పరిధిలోని భజ్యాతండాకు చెందిన అజ్మీరా నాజి(70) అనే వృద్ధురాలిని రెండ్రోజుల క్రితం కాలనీలోని తన ఇంటి వద్దనే హత్య చేశాడు. కాళ్లు, చేతులు, తలను మొండెం నుంచి వేరు చేసి వాటిని చీమలపాడు అటవీ ప్రాంతంలో కాల్చి వేశాడు. అనంతరం సోమవారం రాత్రి మొండెంను బస్తాలో వేసుకుని మరో యువకుడి సాయంతో తరలించేందుకు ప్రయత్నించాడు. యువకుడు ఆ బస్తా గురించి అడగ్గా.. అది అడవి పంది అని, దుర్వాసన వస్తుండటంతో అటవీ అధికారులు చూస్తే కేసు అవుతుందని బయట పడవేస్తున్నానని నమ్మబలికి ఆ యువకుడి సాయంతో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం తిర్లాపురం రైల్వే ట్రాక్‌పై పడవేశారు.
అయితే, ఉపేందర్ మాటలతో అనుమానం వచ్చిన సదరు యువకుడు మూట విప్పి చూడగా అందులో మొండెం కనిపించింది. దీంతో భయాందోళనలకు గురైన సదరు యువకుడు కారేపల్లి పోలీసులకు సమాచారం అందించగా.. పోలీసులు ఉపేందర్‌ను పట్టుకుని విచారణ చేస్తున్నారు. కాగా.. తాను లైంగిక వాంఛ తీర్చమని అడిగితే తిరస్కరించినందుకే హత్య చేశానని, శవాన్ని మాయం చేసేందుకే ఇలా చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నట్లు సమాచారం. మరోవైపు క్షుద్ర పూజల నేపథ్యంలోనే వృద్ధురాలిని హత్య చేశారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఉపేందర్‌తోపాటు మరికొందరు కూడా హత్యలో పాలు పంచుకుని ఉంటా రని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఇల్లెందు ఏసీపీ వెంకటరెడ్డి, కారేపల్లి సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ సురేశ్ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment