నిర్లక్ష్యం నీడలో రోగులు
కరీంనగర్‌హెల్త్, న్యూస్‌లైన్: కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చావుబతుకుతుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకునేనాథుడు కరువ య్యాడు. ఆదివారం ప్రభుత్వాధికారులకు సెలవు అన్నట్లుగా ప్రభుత్వ వైద్యాధికారులు వ్యవహరిస్తున్నారు.
సాక్షాత్తుకలెక్టర్ ఆసుపత్రిని తనిఖీ చేసి తీరుమార్చుకోవాలని హెచ్చరించినా వారు లెక్కచేయడం లేదు. తాజాగా ఆనారోగ్యంతో సొమ్మసిల్లి పడిపోయి గాయాలపాలై ఆసుపత్రిలో చేరిన వ్యక్తిని రెండుగంటలపాటు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. బాధితుడి తల్లి మల్లవ్వ తెలిపిన వివరాలు.. కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన గోదాసు లింగయ్య ఆదివారం పనుల కోసం హుస్నాబాద్‌కు వెళ్లాడు.
ఫిట్స్‌తో కిందపడిపోవడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గమనించి అతడిని వెంటనే ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ప్రభుతాసుపత్రికి రెఫర్ చేశారు. లింగయ్యను సాయంత్రం ఆరుగంటలకు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యం కోసం అత్యవసర సేవల విభాగానికి వెళ్తే.. ఇక్కడ కాదంటూ మేల్ వార్డుకు పంపించారు. అక్కడ కాదంటూ మళ్లీ ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అక్కడ, ఇక్కడ అంటూ తిప్పడంతో చేసేదిలేక మేల్‌వార్డులో వరండాలో ఖాళీగా ఉన్న బెడ్‌పై పడుకోబెట్టారు. డాక్టర్‌కు సమాచారం అందించినా పట్టించుకోదని, ప్రాణాలు తీస్తారా..అంటూ నిలదీయడంతో వైద్యం మొదలుపెట్టారని మల్లవ్వ తెలిపింది.