ఎర్రవల్లే.. తొవ్వ చూపాలె!
* ఎర్రవల్లి, నర్సన్నపేటలు దేశానికే ఆదర్శం కావాలి: సీఎం కే సీఆర్
* రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా తయారుచేసేందుకే నా తండ్లాట
* త్వరలోనే డబుల్ బెడ్రూం ఇళ్లల్లోకి పోదాం
* ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూం ఇళ్ల పనుల పరిశీలించిన సీఎం
* గ్రామసభలో కేసీఆర్ ప్రసంగం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘‘మనం గొప్ప విజయం సాధించబోతున్నం. గోదావరి నీళ్లొచ్చి ఒక్క పంట పండితే మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతది. మీరు ఎట్ల జేసిండ్రో జర మాకు కూడా తొవ్వ జూపించి పొమ్మని ఎర్రవెల్లి గ్రామస్తులను వేరే గ్రామాలోళ్లు వచ్చి అడిగే రోజు వస్తది.
మిమ్ముల్ని చూసి తెలంగాణ నేర్చుకోవాలె. యావత్తు దేశం నే ర్చుకోవాలే. ఆ ఉద్దేశంతో ఇక్కడ పనిచేస్తున్నాం. ఈ ప్రయోగం ఎర్రవల్లి కోసం కాదు. దీన్ని చూసుకుంటూ యావత్తు రాష్ర్టం బ్రహ్మాండంగా తయారు కావాలె. అందుకోసమే నా తండ్లాట’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మెదక్ జిల్లాలోని తన దత్తత గ్రామమైన ఎర్రవల్లిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లను, ఊరు చుట్టూ ఉన్న చెరువులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామ సభలో మాట్లాడారు. ‘‘కొద్దిగ తొవ్వ దొరికినట్టు అనిపిస్తంది.
డబుల్ ఇళ్లు అయిపోయినయి. ఇప్పుడే ఓ ఇల్లు ఎక్కి చూసిన. ఇంటి మీద నీళ్ల ట్యాంకు కడుతుండ్రు. గోదావరి నుంచి వచ్చే నీళ్లు మీ ఊరి పెద్ద ట్యాంకులకు.. అక్కడ్నుంచి ఇంటి మీదున్న ట్యాంకులకు వస్తయి. 24 గంటలు నల్లా నీళ్లు వస్తయి. నల్లా నీళ్లతో సహా ఇండ్లళ్లకు వెళ్తాం. గ్రామమంతా సీసీ రోడ్లు వేస్తరు. మే 15 నాటికి ఇండ్ల నిర్మాణం పూర్తయిపోతది. అయ్యగారిని అడుగుతా... మే 15 నుంచి 30 మధ్యన ఎన్నడు మంచిరోజు ఉంటే ఆనాడు పండుగ జేసుకొని అందరం కలసి ఇండ్లళ్లకు పోవాలె. చినుకుబడే సమయానికి మొక్కలు తీసుకొచ్చి నాటాలి. 6-7 ఫీట్ల ఎత్తు మొక్కలు తెచ్చి పెడితే ఎర్రవల్లి పచ్చగా కనిపిస్తుంది’’ అని అన్నారు. సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..
పొత్తుల ఎవుసం చేద్దాం
మన ఊరి (ఎర్రవల్లి) పక్కన మాచిరెడ్డి కుంట, నల్లకుంట, లింగరాజుకుంటలు ఉన్నాయి. పాండురంగ దేవుని పేరు మీద ఇంకో పెద్దకుంట కట్టుకుందాం. కూడవెళ్లి వాగుమీద రెండు చెక్‌డ్యాంలు కట్టుకుంటున్నం. అన్ని చెరువుల్ల కలసి 200 ఎంసీఎఫ్‌టీల నీళ్లు నిల్వ ఉంటయి. ఈ నీళ్లు ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు ఒక్కసారికి సరిపోతయి. మరోసారి నింపుకుంటే ఇంకో ఏడాది వస్తయి. రైతులు ఏడాదికి మూడు పంటలు పండించాలె.
రెండు పెద్ద పంటలతోపాటు వేసవి సమయం కూడా వృథా కాకుండా తక్కువకాలంలో దిగుబడి వచ్చే పంటలు పెట్టాలె. అప్పుడే మనం గొప్పోళ్లం అవుతం. 2,800 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతి బిట్టుకు 200 ఎకరాల చొప్పున 14 బిట్లు చేస్తారు. దీనికి డ్రిప్ ఇరిగేషన్ కల్పిస్తరు. కట్క ఒత్తితే 2,800 ఎకరాలకు నీళ్లు పారుతయి. ఊళ్లలో భూమి లేని కుటుంబాల నుంచి యువకులను ఎంపిక చేసి ప్రతి బిట్టుకు ఒక ఆపరేటర్‌ను పెడతం.
ఆయనకు ఎకరానికి ఇంత అని ఇద్దాం. ఈ ఆపరేటర్లే వాళ్లకు కేటాయించిన బిట్టులోని 200 ఎకరాలకు రోజు నీళ్లు పారిస్తరు. పొద్దున 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు నీటి పారకం పూర్తవుతుంది. రైతులుగా మనం పొలం పారిందా? లేదా చూసుకోవాలి. కలుపు, గడ్డిమొక్కలు ఉంటే వాటిని పీకేసి పొలాన్ని శుభ్రంగా పెట్టుకోవాలె.
పురుగు లేకుండా పోవాలె..
పంట పొలానికి కావాల్సిన ఎరువులు, పురుగు మందులు ఒక్కొక్కరం కొట్టుకోం. ఊరు ఊరంతా కలసి పురుగు మందులు కొడతాం. 14 బిట్లకు ఒక్కొక్కటి చొప్పున పురుగు మందులు కొట్టే యంత్రాలు ఉంటయి. ఇప్పుడు నా పొలం కాడ ఉంది. మందులు కూడా ఎవరికి వాళ్లు కొనాల్సిన పని లేదు. దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుందాం. ఆ కమిటే మందులు కొనుగోలు చేస్తది. ఒకరి పొలంలో ముందు కొడితే పురుగు ఇంకొకరి పొలానికి పోతంది. అట్లా లేకుండా ఊరు ఊరంతా కలిపి కొడితే పురుగు లేకుండా పోతది.
నిజామాబాద్ జిల్లా అంకాపూర్ కాడ చేసేది ఇదే పని. అక్కడ మార్కెట్ కమిటీ ఉంటది. కానీ మనకు ఆ బాధ లేదు. ఎందుకంటే విత్తన కంపెనీ ముందుగా రేటు నిర్ణయించి మనకు రేటు కట్టిస్తది. ఎవరి పొలంలో ఎంత దిగుబడి వస్తే వాళ్లకు అంత లాభం వస్తది. మూడో పంట మాత్రం మన ఇష్టం. పుచ్చకాయ, దోసకాయ, మెంతికూర, ఏది వీలైతే అది పండిద్దాం. దీన్ని కూడా హైదరాబాద్ నుంచి వ్యాపారులు వచ్చి కొనుక్కపోయేటట్టు ఆలోచన చేద్దాం. ఇదీ ఎర్రవల్లిలో మనం వ్యవసాయం చేసే పద్ధతి. పొత్తుల ఎవుసం ఉంటది కానీ ఎవరి భూమి వాళ్లకే ఉంటది. ఎవరి భూమిలో ఎంత పంట పండితే అంత డబ్బులు వాళ్లకు వస్తది.
ఆడవాళ్ల పెత్తనం ఉన్నచోట లక్ష్మి
గోదావరి ప్రాజెక్టులపై మనకు, మహారాష్ట్రకు మధ్య ఒప్పందం కుదిరింది. త్వరలో నేనే స్వయంగా వెళ్లి మాట్లాడి వస్తా. పాములపర్తి, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్ల పనులను 15, 20 రోజుల్లోనే ప్రారంభిస్తం. రెండు, రెండున్నరేళ్లలోనే పాములపర్తిలో నీళ్లు ఉంటయి. ఒక్కసారి గోదావరి నీళ్లు వచ్చినయంటే 365 రోజులు నీళ్లు ఉంటయి. ఈ 2 గ్రామాలు దేశానికే ఆదర్శంగా ఉండాలని నేను తండ్లాడుతున్న. తెలంగాణ రాష్ట్రానికి, యావత్తు దేశానికి కొత్త పాఠం చెప్పబోతున్నం.
ఇప్పటి దాకా మీరే ఓ జిల్లాకు వెళ్లి చూసొచ్చిన్రు. ఇప్పుడు ఇంకో జిల్లా కలెక్టర్లే మీ దగ్గరకొచ్చి చూసి పోతుండ్రు. ఇదం తా మీ ఐకమత్యంతోనే అయింది. కొంత ప్రభుత్వ సాయం ఉంది. మీ వెంట నేను కార్యకర్తగా ఉన్నా. అందుకే అనుకున్నవన్నీ సాధించ కలుగుతున్నం. ఈ ఐక్యత ను కొనసాగించాలి. మా అక్కాచె ల్లెళ్లు పట్టు మీదుండాలె.
అంకాపూర్ అభివృద్ధికి కారణం మహిళలే. ఆడవాళ్ల పెత్తనం ఎక్కడ ఉంటుందో అక్కడ లక్ష్మి అమ్మవారు ఉంటది. ఎర్రవల్లి పచ్చగా కళకళలాడాలే. నాలుగైదు గ్రామాలను ఇలా చేసి చూపెట్టి ఇగో ఈ పద్ధతిలోనే మీరు కూడా చేసుకొమ్మని చెప్తే ఇంకొకళ్లకు తొవ్వ దొరుకుతది. మీరు అదృష్టవంతులు. నేను ఇక్కడ ఉండటం వల్ల మీ ఊరును తీసుకున్న. ఇదే విధానాన్ని యావత్తు రాష్ట్రం విస్తరిస్తాం.