గంటా అనుచరుడిపై వైఎస్ఆర్ సీపీ నేత ఫైర్
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రధాన అనుచరుడు పరిచూరి భాస్కర రావుపై వైఎస్ఆర్ సీపీ నాయకుడు కర్రి సీతారాం మంగళవారం విశాఖలో నిప్పులు చెరిగారు. మంత్రి గంటా లేకుండానే ఆయన తరఫున శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని భాస్కర రావుపై మండిపడ్డారు. ఏ అర్హతతో అధికారులతో కలసి భాస్కరరావు ప్రారంభోత్సవాలు, కార్యక్రమాలు తలపెడుతున్నారని ప్రశ్నించారు. పరిచూరి భాస్కరరావుపై సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
సోమవారం భీమిలి నియోజకవర్గం పరిధిలో రూ. 83 లక్షల విలువైన పనులకు పరిచూరి భాస్కరరావు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలో కర్రి సీతారాం పై విధంగా స్పందించారు. మంత్రి ఘంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా గంటా అనుచరునిగా షాడో మంత్రిగా వ్యవహరిస్తున్నారని పరిచూరి భాస్కరరావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.