టెక్సాస్: మేయర్ ఎన్నికల బరిలో తెలుగోడు
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, భారత సంతతికి చెందిన వ్యక్తులూ.. అక్కడి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడం చూస్తున్నాం. చిన్న పదవుల మొదలుకుని జడ్జిలు, చట్ట సభలు, దేశ ప్రధానుల్లాంటి ఉన్నత పదవులనూ అధిరోహిస్తున్నారు. తాజాగా.. ఓ తెలుగోడు టెక్సాస్ స్టేట్‌లో మేయర్ ఎన్నికల్లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. ట్రాన్స్పరెన్సీ(పారదర్శకత) ఈజ్ ద గేమ్.. కార్తీక్ ఈజ్ ది నేమ్ అంటూ.. 35 ఏళ్ల యువకుడు ట్రావిస్ కౌంటీలోని ది హిల్స్ మేయర్ ఎన్నికల ప్రచారంతో హాట్ టాపిక్‌గా మారాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు(ప్రస్తుతం బాపట్ల) చెందిన కార్తీక్ నరాలశెట్టి Karthik Naralasetty.. ది హిల్స్ మేయర్ ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన కార్తీక్.. న్యూజెర్సీ రట్టర్స్ యూనివర్సిటీలో కంప్యూటర్‌సైన్స్ డిపార్ట్మెంట్లో చేరాడు. ఆపై చదువు ఆపేసి ఇండియాకు తిరిగొచ్చి సోషల్‌బ్లడ్ పేరుతో ఓ ఎన్జీవో ఏర్పాటు చేసి.. క్రమక్రమంగా వ్యాపారవేత్తగా ఎదిగాడు. అదే టైంలో పెంపుడు జంతువులకు సంబంధించిన మరో కంపెనీ స్థాపించాడు.అమెరికాలో ఉన్న తొలినాళ్లలోనే అధితితో పరిచయం.. ఆపై వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు. ఈ క్రమంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న ‘ది హిల్స్’ మేయర్ ఎన్నికలపై దృష్టి సారించాడు కార్తీక్. ఆగస్టు నుంచే ప్రచారం మొదలుపెట్టిన కార్తీక్.. ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన అనుభవంతో ది హిల్స్ అభివృద్ధికి దోహదపడతానని ప్రచారం చేశాడు కూడా. ది హిల్స్‌లో 2,000 జనాభా ఉంది. కేవలం ఐదు భారతీయ కుటుంబాలు మాత్రమే అక్కడ స్థిరపడ్డాయి. అయితే న్యూజెర్సీలో ఉన్న బంధువుల సహకారంతో ప్రచారం ఉధృతం చేశాడు కార్తీక్. నవంబర్ 5న ఇక్కడ మేయర్ ఎన్నిక జరగనుంది. ఒకవేళ.. కార్తీక్ ఈ ఎన్నికల్లో గెలిస్తే గనుక.. ‘ది హిల్స్’ మేయర్ పదవి చేపట్టిన అతిపిన్న వయస్కుడిగా, తొలి భారతీయ వ్యక్తిగా నిలుస్తాడు.