Karuppaiah resigns
-
ఆ రోజే రాజీనామా చేద్దామనుకున్నా
సాక్షి, చెన్నై: డీఎంకేకు పల కరుప్పయ్య రాజీనామా చేశారు. తాను పార్టీ నుంచి తప్పుకుంటున్నట్టు డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌కు లేఖ రాశారు. కార్పొరేట్ ఏజెన్సీ, సంస్థల చేతికి పార్టీ చేరినట్టుగా కరుప్పయ్య ఆవేదన వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో ఏళ్ల తరబడి కొనసాగి 2016లో అమ్మ జయలలితను ఢీకొట్టి పార్టీ నుంచి పల కరుప్పయ్య బయటకు వచ్చారు. అన్నాడీఎంకే నుంచి బయటకు రావడమే కాదు, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హార్బర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ తదుపరి పరిణామాలో డీఎంకేలో చేరారు. అధికార ప్రతినిధి హోదాతో ముందుకు సాగుతూ వచ్చిన ఆయన.. కొన్ని చిత్రాల్లోనూ నటనపై దృష్టి పెట్టారు. విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో సీనియర్ నేతగా, సీఎం పాత్రలో పరోక్షంగా దివంగత డీఎంకే నేత కరుణానిధిని తలపించే దిశగా అందర్నీ మెప్పించారు. సినిమాలు, రాజకీయపయనం అంటూ సాగుతూ వచ్చిన కరుప్పయ్య గురువారం ఓ ప్రకటన చేశారు. తాను డీఎంకే నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేస్తూ లేఖను స్టాలిన్‌కు పంపించారు. బై..బై.. మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాలు, పార్టీలపై విమర్శలు గుప్పించే రీతిలో కరుప్పయ్య స్పందించారు. పరోక్షంగా డీఎంకేను ఉద్దేశించి ఆయన మాటల తూటాల్ని పేల్చారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన తనను ఓ వివాహ వేదికపై.. కరుణానిధి తనను చూశారని గుర్తు చేశారు. ఆయన పిలుపుమేరకు తాను బలవంతంగానే డీఎంకేలోకి వచ్చానని పేర్కొన్నారు. ఆయన మరణం తదుపరి బయటకు వచ్చేయాలని నిర్ణయించుకున్నా, పరిస్థితులు అనుకూలించలేదన్నారు. అయితే, ప్రస్తుతం కార్పొరేట్ సంస్థ అన్నట్టుగా పరిస్థితులు మారి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి అనుసరించిన రాజకీయవ్యూహాలు, సిద్ధాంతాలను గుర్తు చేస్తూ, ఇప్పుడు అవన్నీ ప్రకటనల ఏజెన్సీల సంస్థల గుప్పెట్లోకి చేరి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీలు ఇచ్చే సలహాలు సూచనల్ని పాటించే స్థాయికి దిగజారే పరిస్థితి ఒక గొప్ప పార్టీకి రావడం ఆవేదన కల్గిస్తున్నదని, అందుకే బయటకు రావడం మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. తల పండిన నేతలు, సీనియర్లతో చర్చించి వ్యూహాల్ని రచించే కాలం పోయి, ఇప్పుడు కార్పొరేట్ సంస్థల వలే ఏజెన్సీలకు అప్పగించడం ఆయా పార్టీల నేతల చేతగానితనానికి నిదర్శనం అన్నట్టుగా పరిస్థితులు మారుతాయని హెచ్చరించారు. -
అంతా అవినీతిమయం
అధికార ఎమ్మెల్యే ఆరోపణ పార్టీ నుంచి ఉద్వాసన ‘అమ్మ’ కన్నెర్ర ఎమ్మెల్యే పదవికి కరుప్పయ్య రాజీనామా సాక్షి, చెన్నై: రాష్ర్టంలో ప్రతి పనికి చేతులు తడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అంతా అవినీతిమయం అంటూ అన్నాడీఎంకే ఎమ్మెల్యే పి.కరుప్పయ్య గురువారం చెన్నైలో ఆరోపణలు గుప్పించారు. అధికార పక్షం ఎమ్మెల్యే స్వయంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మొదలెట్టడంతో చర్చ బయల్దేరి ఉన్నది. అదే సమయంలో ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తూ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు. హార్బర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన పి.కరుప్పయ్య అమ్మ(జయలలిత) విధేయుడే. ఎప్పుడు అమ్మ జపం చేస్తుండే ఈ కరుప్పయ్య తుగ్లక్ పత్రిక వేడుకలో నోరు జారారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు. ఇది కాస్త అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు కోపాన్ని తెప్పించినట్టుంది. తక్షణం ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తనను తొలగిస్తూ నిర్ణయం వెలువడిందో లేదో తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు కరుప్పయ్య సిద్ధం అయ్యారు. తన రాజీనామా లేఖను స్వయంగా అసెంబ్లీ స్పీకర్‌కు, కార్యదర్శికి అందించేందుకు యత్నించారు. అయితే ఆ ప్రయత్నం విఫలంతో మీడియా ముందుకు వచ్చారు. అంతా అవినీతి మయం: రాజధాని నగరంలో హార్బర్ నియోజకవర్గానికి ప్రతినిధిగా తాను ఉన్నా, తన ద్వారా ఇక్కడి ప్రజలకు నాలుగు మంచి పనులు చేయలేని పరిస్థితి నెలకొని ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో కబ్జా అవుతున్న స్థలాల్ని కూడా రక్షించుకోలేని పరిస్థితిగా ఆరోపించారు. తన పార్టీ పెద్దలే , తన నియోజకవర్గం మీద పడి దోచుకుంటుంటే, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు వారి చర్యలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు. మనస్సాక్షిని చంపుకుని ఇన్నాళ్లు ఆ పార్టీలో ఉండాల్సి వచ్చిందని, అందుకే మనస్సాక్షి చెప్పిన మేరకు పదవికి రాజీనామా చేశాననన్నారు. అయితే, ఆ రాజీనామా లేఖను ఎవ్వరూ అందుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తాను అమ్మ జయలలితను విమర్శించడానికో, ఆరోపణలు గుప్పించడానికో మీడియా ముందుకు రాలేదని, వాస్తవాలను ఆమె గ్రహించాలని సూచించారు. రాష్ర్టవ్యాప్తంగా ప్రతి పనికి చేతులు తడపాల్సిన పరిస్థితి ఉందని, అంతా అవినీతిమయంగా మారడం సిగ్గు చేటుగా వ్యాఖ్యానించారు. వేల కోట్ల గ్రానైట్ స్కాంను బయట పెట్టిన సహాయం లాంటి ఐఏఎస్‌లు ఎందరో రాష్ర్టంలో ఉన్నారని, వాళ్లందరూ తమ మనసును చంపుకుని పాలకులకు సహకరించాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడి ఉందని ధ్వజమెత్తారు. ఇలాంటి విషయాల్ని ఎత్తి చూపించే వాళ్లకు భద్రత తప్పని సరిగా వ్యాఖ్యానించారు.