అంతా అవినీతిమయం | Pazha Karuppaiah resigns as MLA | Sakshi
Sakshi News home page

అంతా అవినీతిమయం

Published Fri, Jan 29 2016 1:58 AM | Last Updated on Thu, May 24 2018 12:08 PM

అంతా అవినీతిమయం - Sakshi

అంతా అవినీతిమయం

అధికార ఎమ్మెల్యే ఆరోపణ
 పార్టీ నుంచి ఉద్వాసన
 ‘అమ్మ’ కన్నెర్ర
 ఎమ్మెల్యే పదవికి కరుప్పయ్య రాజీనామా
 
 సాక్షి, చెన్నై: రాష్ర్టంలో ప్రతి పనికి చేతులు తడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అంతా అవినీతిమయం అంటూ అన్నాడీఎంకే ఎమ్మెల్యే పి.కరుప్పయ్య గురువారం చెన్నైలో ఆరోపణలు గుప్పించారు. అధికార పక్షం ఎమ్మెల్యే స్వయంగా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం మొదలెట్టడంతో చర్చ బయల్దేరి ఉన్నది. అదే సమయంలో ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తూ సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత నిర్ణయం తీసుకున్నారు.
 
 హార్బర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన పి.కరుప్పయ్య అమ్మ(జయలలిత) విధేయుడే. ఎప్పుడు అమ్మ జపం చేస్తుండే ఈ కరుప్పయ్య తుగ్లక్ పత్రిక వేడుకలో నోరు జారారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన స్పందించారు. ఇది కాస్త అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు కోపాన్ని తెప్పించినట్టుంది. తక్షణం ఆయన్ను పార్టీ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తనను తొలగిస్తూ నిర్ణయం వెలువడిందో లేదో తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు కరుప్పయ్య సిద్ధం అయ్యారు. తన రాజీనామా లేఖను స్వయంగా అసెంబ్లీ స్పీకర్‌కు, కార్యదర్శికి అందించేందుకు యత్నించారు. అయితే ఆ ప్రయత్నం విఫలంతో మీడియా ముందుకు వచ్చారు.
 
 అంతా అవినీతి మయం: రాజధాని నగరంలో హార్బర్ నియోజకవర్గానికి ప్రతినిధిగా తాను ఉన్నా, తన ద్వారా ఇక్కడి ప్రజలకు నాలుగు మంచి పనులు చేయలేని పరిస్థితి నెలకొని ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో కబ్జా అవుతున్న స్థలాల్ని కూడా రక్షించుకోలేని  పరిస్థితిగా ఆరోపించారు. తన పార్టీ పెద్దలే , తన నియోజకవర్గం మీద పడి దోచుకుంటుంటే, ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఏ మేరకు వారి చర్యలు ఉంటాయో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.
 మనస్సాక్షిని చంపుకుని ఇన్నాళ్లు ఆ పార్టీలో ఉండాల్సి వచ్చిందని, అందుకే మనస్సాక్షి చెప్పిన మేరకు పదవికి రాజీనామా చేశాననన్నారు.
 
 అయితే, ఆ రాజీనామా లేఖను ఎవ్వరూ అందుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తాను అమ్మ జయలలితను విమర్శించడానికో, ఆరోపణలు గుప్పించడానికో మీడియా ముందుకు రాలేదని, వాస్తవాలను ఆమె గ్రహించాలని సూచించారు. రాష్ర్టవ్యాప్తంగా ప్రతి పనికి చేతులు తడపాల్సిన పరిస్థితి ఉందని, అంతా అవినీతిమయంగా మారడం సిగ్గు చేటుగా వ్యాఖ్యానించారు. వేల కోట్ల  గ్రానైట్ స్కాంను బయట పెట్టిన సహాయం లాంటి ఐఏఎస్‌లు ఎందరో రాష్ర్టంలో ఉన్నారని, వాళ్లందరూ  తమ మనసును చంపుకుని పాలకులకు సహకరించాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడి ఉందని ధ్వజమెత్తారు. ఇలాంటి విషయాల్ని ఎత్తి చూపించే వాళ్లకు భద్రత తప్పని సరిగా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement