Karuppusvami
-
గుడిలో తొక్కిసలాట
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తురయూరు వండితురై కరుప్పు స్వామి ఆలయ ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా పిడి కాసుల పంపిణీలో తొక్కిసలాటతో ఏడుగురు మృతిచెందారు. వండితురై కరుప్పుస్వామి ఆలయంలో చిత్ర పౌర్ణమి ఉత్సవాల్లో చివరి రోజున పిడి కాసుల్ని(పిడికిలి నిండా చిల్లర)ను ఆలయ పూజారి పంపిణీ చేయడం ఆనవాయితీ. ఈ కాసుల్ని ఇంట్లో ఉంచుకుంటే మహాలక్ష్మి నట్టింట్లో ఉన్నట్టే అన్నది భక్తుల నమ్మకం. ఆదివారం పిడి కాసుల పంపిణీ కార్యక్రమానికి పదిహేను జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా పోటెత్తారు. పూజల అనంతరం పిడి కాసుల కోసం భక్తులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో అరియలూరు జిల్లా తిరుమానూరు మంగళాపురానికి చెందిన కంథాయి(38), పెరంబలూరు జిల్లా వెప్పన్ తడైకు పిన్నకులంకు చెందిన రామర్(52), నమ్మక్కల్ జిల్లా సేందమంగళంకు చెందిన శాంతి(47), కరూర్ జిల్లా నన్నియూర్‌కు చెందిన లక్ష్మి కాంతన్(60), కడలూరు జిల్లా పిన్నయత్తూరుకు చెందిన పూంగావనం(46), అరియలూరు జిల్లా పొన్ పరప్పికి చెందిన వళ్లి(46), కడలూరు జిల్లా దిట్టకుడికి చెందిన రాఘవేల్(52) అక్కడికక్కడే మృతిచెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆలయ ఉత్సవాలు నిర్వహిస్తున్న పూజారి ధనపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే, గాయపడిన వారికి ప్రధానమంత్రి సహాయ నిధి నుంచి రూ.50వేల చొప్పున అందజేస్తామన్నారు. -
చెట్టును ఢీకొన్న కారు ...ఐదుగురి దుర్మరణం
హొసూరు, న్యూస్‌లైన్: క్రిష్ణగిరి జిల్లా పోచంపల్లి వద్ద బుధవారం తెల్లవారు జామున కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి అతివేగం కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వివరాలలోకి వెళితే.. పోచంపల్లి సమీపంలోని అమ్మన్ఆలయ ప్రాంతానికి చెందిన కాట్టురాజా (45), తేని జిల్లాలోని కరుప్పుస్వామి ఆలయంలో మొక్కుబడి తీర్చునేందుకు తమ కుటుంబ సభ్యులతోపాటు అతని తన భార్య స్నేహితురాలు సెందామరైతో కలసి కారులో బయలుదేరారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డుపై వాహనాల రద్దీ లేకపోవడంతో, త్వరగా ఆలయానికి వెళ్లి, చీకటి పడేలోపే ఇంటికి చేరుకోవాలని కాట్టురాజా కారును వేగంగా నడిపినట్లు తెలిసింది. కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చింత చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కాట్టురాజా (45), అతని భార్య మలర్విళి (40), అత్తయ్య పద్మ (55) స్నేహితులు రాజేంద్రన్ (43), పళణి (42) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాల పాలైన కాట్టురాజా కొడుకు వసంత్ (7), కూతురు వశీక (15), సెందామరై (40)లను స్థానికులు ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. వెనుక సీట్లో కూర్చొవడం వల్ల కాట్టురాజా కొడుకు, కూతురు, సెందామరై ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. పోచంపల్లి ఇన్స్పెక్టర్ మురుగన్, బారూరు ఇన్స్పెక్టర్ మురుగేశన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.