చెట్టును ఢీకొన్న కారు ...ఐదుగురి దుర్మరణం
Published Thu, Aug 8 2013 4:34 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM
హొసూరు, న్యూస్‌లైన్: క్రిష్ణగిరి జిల్లా పోచంపల్లి వద్ద బుధవారం తెల్లవారు జామున కారు చెట్టును ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదానికి అతివేగం కారణంగా పోలీసులు భావిస్తున్నారు. వివరాలలోకి వెళితే.. పోచంపల్లి సమీపంలోని అమ్మన్‌ఆలయ ప్రాంతానికి చెందిన కాట్టురాజా (45), తేని జిల్లాలోని కరుప్పుస్వామి ఆలయంలో మొక్కుబడి తీర్చునేందుకు తమ కుటుంబ సభ్యులతోపాటు అతని తన భార్య స్నేహితురాలు సెందామరైతో కలసి కారులో బయలుదేరారు.
తెల్లవారుజామున 4 గంటల సమయంలో రోడ్డుపై వాహనాల రద్దీ లేకపోవడంతో, త్వరగా ఆలయానికి వెళ్లి, చీకటి పడేలోపే ఇంటికి చేరుకోవాలని కాట్టురాజా కారును వేగంగా నడిపినట్లు తెలిసింది. కారు అకస్మాత్తుగా అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చింత చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కాట్టురాజా (45), అతని భార్య మలర్‌విళి (40), అత్తయ్య పద్మ (55) స్నేహితులు రాజేంద్రన్ (43), పళణి (42) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
తీవ్రగాయాల పాలైన కాట్టురాజా కొడుకు వసంత్ (7), కూతురు వశీక (15), సెందామరై (40)లను స్థానికులు ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం అదే ఆస్పత్రికి తరలించారు. వెనుక సీట్లో కూర్చొవడం వల్ల కాట్టురాజా కొడుకు, కూతురు, సెందామరై ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. పోచంపల్లి ఇన్‌స్పెక్టర్ మురుగన్, బారూరు ఇన్‌స్పెక్టర్ మురుగేశన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement