మహిళా ఐపీఎస్ డి.రూప (ఫైల్ ఫొటో)
సాక్షి, బెంగళూరు: ఒత్తిళ్లు, విమర్శలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే 'లేడీ సింగం'గా మహిళా ఐపీఎస్ డి.రూప సోషల్ మీడియాలో చాలా పాపులర్. అయితే రూప చెప్పింది పచ్చి అబద్ధమంటూ తేల్చింది నమ్మ బెంగళూరు ఫౌండేషన్ (ఎన్‌బీఎఫ్). ఎన్‌బీఎఫ్ ఎన్‌జీఓ సంస్థ తనకు అవార్డు ఇచ్చేందుకు సిద్ధమైనా తిరస్కరించినట్లు ప్రకటించి సంచలనానికి తెరలేపారు రూప. అవార్డు స్వీకరించినలేనని ఫౌండేషన్ సీఈవో ఎన్‌బీఎఫ్ శ్రీధర్ శెట్టికి ఆమె లేఖ రాయడం నిజం కాదని యాజమాన్యం వెల్లడించింది.
నమ్మ బెంగళూరు ఫౌండేషన్ సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ.. అసలు తాము ఐపీఎస్ రూపకు అవార్డు ప్రకటించలేదన్నారు. అలాంటిది ఎన్‌బీఎఫ్ ఇచ్చే అవార్డును స్వీకరించనంటూ ఆమె ఎలా ప్రకటన చేస్తారంటూ మండిపడ్డారు. అవార్డు స్వీకరించలేనని చెప్పిన రూప.. ఆ అవార్డు తనకు దక్కించుకునేందుకు జ్యూరీ సభ్యులు, ఎన్‌బీఎఫ్ బృందం, ట్రస్టీలతో పలుమార్లు చర్యలు జరిపారని ఆ సంస్థ వెల్లడించడంతో 'లేడీ సింగం' వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నమ్మ బెంగళూరు ఫౌండేషన్ చరిత్రలో అవార్డు కోసం ఓ నామినీ ఇలా ప్రలోభాలకు పాల్పడటం, జ్యూరీ సభ్యులు, ఎన్‌బీఎఫ్ బృందంతో చర్చలు జరపడం తొలిసారి చూస్తున్నామని పెదవి విరవడం గమనార్హం.
అవార్డు ప్రకటించకున్నా 'లేడీ సింగం' లేఖ
ఇటీవల ఐపీఎస్ రూప లేఖ రాయడమే వివాదానికి కారణమైంది. ‘ ఎన్‌బీఎఫ్ అవార్డుకు నా పేరును ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు. కానీ, ఈ అవార్డు స్వీకరించేందుకు నా మనస్సాక్షి ఒప్పకోవడం లేదు. రాజకీయాలకు, రాజకీయ అనుబంధ సంస్థలకు ప్రభుత్వ అధికారులు వీలైనంత దూరంగా ఉండాలి. అప్పడే ప్రజల మనసులో మచ్చలేని అధికారులుగా ఉంటారు. కొన్ని రోజుల్లోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో నా అవార్డు అంశం రాజకీయం కావటం నాకు ఇష్టం లేదని’ లేఖలో రూప పేర్కొన్నారు.
నమ్మ బెంగళూరు ఫౌండేషన్ అనే సంస్థ ప్రతి సంవత్సరం ఐదు రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులను అందిస్తోంది. అందులో ఉత్తమ ప్రభుత్వ అధికారి కేటగిరీ కోసం కోసం 8 మంది పేర్లతో ఒక జాబితాను తయారు చేసింది. ఈ లిస్ట్‌లో ఐజీ (హోమ్‌గార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్) రూప పేరును కూడా పరిశీలనలోకి తీసుకుంది. అయితే ఆ జాబితా నుంచి తన పేరును తొలగించాలని కోరడంతో ఫౌండేషన్ సిబ్బంది ఐపీఎస్ రూప చెప్పింది పచ్చి అబద్ధాలని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ జైలు రాజభోగాలను బయటపెట్టి రూప వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment