కొడవ’కు స్వయం ప్రతిపత్తి కల్పించండి
Published Wed, Aug 7 2013 4:37 AM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
సాక్షి, బెంగళూరు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం అంగీకారం తెలిపిన నేపథ్యంలో కర్ణాటకలోని కొడుగు ప్రాంతాన్ని సైతం స్వయం ప్రతిపత్తి గల ప్రాంతంగా ప్రకటించాలనే డిమాండ్‌లు తెరపైకి వస్తున్నాయి. ఈ మేరకు కొడవ నేషనల్ కౌన్సిల్(సీఎన్‌సీ) ఆధ్వర్యంలో మంగళవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎన్.యూ.నాచప్ప కొడవ మాట్లాడుతూ... కొడుగు ప్రాంతాన్ని స్వయం ప్రతిపత్తి గల ‘కొడవ ల్యాండ్’ గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ ప్రాంత వాసులకు ఒక ప్రత్యేక వస్త్రధారణ, సంస్కృతి, సంప్రదాయం ఉన్నాయని, వాటిని రక్షించుకోవడానికే తమ ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. భాషా, సంస్కృతిల పరంగా కొడగును అత్యంత వెనకబడిన ప్రాంతంగా గుర్తించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 340,342 ల ప్రకారం కొడగు ప్రాంతాన్ని స్వయంప్రతిపత్తి గల ‘కొడవ ల్యాండ్’గా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
అంతేకాక ప్రస్తుతం కొడవ వర్గానికి చెందిన ప్రజల సంఖ్య లక్షా యాభైవేలు మాత్రమేనని అందువల్ల తమను కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 331ప్రకారం ఆంగ్లో ఇండియన్‌లకు ఇచ్చినట్లుగా రాజకీయాల్లో రిజర్వేషన్‌ను కల్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లును కూడా ఇదే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టాలని కోరారు. ఈ డిమాండ్‌లన్నింటి పరిష్కారం కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగానే ఈనెల 15న కొడగులో ధర్నా నిర్వహించనున్నామని వెల్లడించారు. అనంతరం ఈనెల 18న నగరంలోని టౌన్‌హాల్ ఎదుట ధర్నాను నిర్వహిస్తామని, అంతేకాక నవంబర్ 1న ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో కొడవ వర్గానికి చెందిన ఐదు వేల మందితో భారీ ర్యాలీని సైతం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
Advertisement