సేవ్ మీ ప్లీజ్...
హత్యలు... అఘాయిత్యాలు... అక్రమాలు... అరాచకాలు...
లంచగొండితనం... అవినీతి... దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలు.
ఇప్పుడు మరో కొత్త సమస్య... పైరసీ...
ఎందరో చలనచిత్ర నిర్మాతల తలరాతలను మారుస్తున్న పైరసీపై కర్రా శేషసాయి (కరూర్ వైశ్యా బ్యాంక్‌లో పనిచేస్తున్నాడు), శ్రీపాద సందీప్ (మఫకంజా కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌లో రెండవ సంవత్సరం చదువుతున్నాడు) సంయుక్తంగా తీసిన లఘుచిత్రం ‘సేవ్ మీ ప్లీజ్’.
డెరైక్టర్స్ వాయిస్: మాకు నటన, డెరైక్షన్లంటే ప్రీతి. సినిమాలంటే చాలా ఇష్టం. అందువల్ల ఈ రంగం వైపు యాక్టివ్‌గా ఉన్నాము. మాకు మా తల్లిదండ్రుల నుంచి పూర్తి సహకారం ఉంది. ఇటీవలే విడుదలైన ఒక చిత్రానికి సంబంధించిన పైరసీకి స్పందిస్తూ ఈ లఘుచిత్రం తీశాం. ఈ చిత్రాన్ని ఒక గంటలో షూటింగ్, మరో గంట పోస్ట్ ప్రొడక్షన్ చేశాం. కేవలం రెండు గంటలలో ఈ చిత్రాన్ని పూర్తి చేసి, సోషల్ నెట్వర్కింగ్ అయిన ట్విటర్, ఫేస్‌బుక్‌లలో ప్రమోట్ చేశాం. ఆ తర్వాత యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేశాం. ఈ చిత్రాన్ని చూసిన సాయి (త్రివిక్రమ్ గారి కో డెరైక్టర్) మాకు ఫోన్ చేసి, మమ్మల్ని అభినందించారు. త్రివిక్రమ్‌గారు కూడా, నచ్చిందని చెప్పారు. మేం ఇంతకుముందు ‘భగవద్గీత’ అనే లఘుచిత్రం తీశాం. త్వరలో మరో లఘుచిత్రం తీయబోతున్నాం.
షార్ట్‌స్టోరీ: ఇద్దరు స్నేహితులు ఒక ప్రదేశంలో కలుస్తారు. అందులో ఒక వ్యక్తి డాక్టరు, మరో వ్యక్తి మామూలు ఉద్యోగి. ఆ డాక్డరుకి పదేపదే ఫోన్ వస్తూంటుంది. అన్నిసార్లు మోగుతుండటం వలన, ఇక తప్పదని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అవతలి వ్యక్తి, ‘మా ఆవిడకు వచ్చే నెలలో డెలివరీ డేట్ ఇచ్చారు కదా. మీరు తీసిన స్కానింగ్ రిపోర్టులో మాకు అమ్మాయో, అబ్బాయో తెలిసి ఉంటుంది కదా! కాస్త చెబుతారా’ అని అడుగుతాడు. అందుకు డాక్టరు స్పందిస్తూ, ‘ముందుగానే చెప్పడం నేరమని మీకు తెలియదా’ అని చాలా సిన్సియర్‌గా చెబుతాడు. వెంటనే పక్కనున్న స్నేహితుడు అందుకు స్పందిస్తూ, ‘నువ్వు నన్ను పైరసీ సీడీ కావాలని అడిగావు. అది కూడా ఇంతే తప్పు కదా!’ అంటాడు.
కామెంట్: ప్రస్తుతం సినీ పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ సమస్య మీద స్పందిస్తూ కేవలం మూడు నిముషాల నిడివిలో తీసిన ఈ లఘుచిత్రం సినీ రంగానికి సంబంధించిన ప్రతిఒక్కరూ చూసి, తప్పు తెలుసుకోవాలి. చిన్నవయసు పిల్లలు ఎంత బాగా స్పందించారో తెలుసుకోవాలి. సందేశాత్మక చిత్రమైనప్పటికీ, మరీ సందేశం ఇస్తున్నట్టు కాకుండా, స్కానింగ్‌లో ముందుగానే పుట్టబోయేది ఏ బిడ్డో తెలుసుకోవడం వంటి అంశాన్ని తీసుకోవడం చాలా బావుంది. యువతలో ఇటువంటి బాధ్యతాయుతమైన స్పందనను అభినందించి తీరాల్సిందే. ఇందులో టేకింగ్, కథనం, డైలాగ్స్, కెమెరా, ఎడిటింగ్ అన్నీ చాలా చక్కగా ఉన్నాయి. కథ పేరును ఎంచుకోవడం కూడా చాలా బావుంది. చిన్న సూచన. చిత్రాలకు పేర్లను సాధ్యమైనంత వరకు తెలుగులో ఇస్తే బాగుంటుంది. ఏది ఏమైనా ఈ చిత్రానికి మంచి ప్రశంసలు వస్తాయనడంలో సందేహం లేదు.
- డా.వైజయంతి