సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ..
ముదిమి వయసు... బాల్యం లాంటిదనే మాటలను నిజం చేస్తున్నాడతను. మొదట హౌజింగ్‌బోర్డులో పనిచేసి... తరువాత టూరింగ్గైడ్గా మారిపోయిన ఉత్సాహం పేరు కాశీనాథ్‌రావు. ఎనిమిది పదుల వయసులోనూ ఎంప్లాయ్‌గా కొనసాగుతూ... 40 ఏళ్లు నిండితే నీరసించిపోతున్న నేటితరానికి సవాల్ విసురుతున్నాడు. విల్‌పవర్ ఉండాలే కానీ... వయసు మనసుకే కాదు, ఉద్యోగానికి అడ్డుకాదని నిరూపిస్తున్నాడు!
..:: పిల్లి రాంచందర్/ చార్మినార్
80 ఏళ్లు దాటిన ఓ వ్యక్తి ఏం చేస్తారు? ‘కృష్ణా.. రామా’ అంటూ ఏ తీర్థయాత్రలకో వెళ్తారు! కానీ పర్యటనలకు వెళ్లడం కాదు... ఎనభై పదుల వయసులో తానే టూరిస్ట్ గైడ్‌గా పనిచేస్తున్నారు కంది కాశీనాథ్‌రావు. పాతబస్తీ చందూలాల్ బారాదరికి చెందిన కాశీనాథ్ బహుభాషా ప్రవీణుడు. తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, హిందీ, అరబిక్, పర్షియన్, ఫ్రెంచ్, జపనీస్, బెంగాలీ, సంస్కృత భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. అందుకే నగరాన్ని చూసేందుకు వచ్చిన ప్రముఖులెవరైనా... గైడ్ మాత్రం ఆయనే. 50 ఏళ్లకిందట... అప్పటి టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్రలూథర్.... కాశీనాథ్‌ను టూరిస్ట్‌గైడ్‌గా నియమించారు.
2003 జనవరిలో సింగపూర్ అధ్యక్షులు ఎస్. ఆర్. నాథన్, 2003 మార్చిలో జర్మనీ అధ్యక్షులు జోహన్స్, 2005 మేలో ఇరాన్ ఉపాధ్యక్షులు అలీ హష్మీ బహ్మనీ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆర్.ఎస్. సర్కారియాతోపాటు ఎంతోమంది ప్రముఖులు చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియంలను సందర్శించడానికి వచ్చినప్పుడు టూరిస్టు గైడ్‌గా వ్యవహరించింది ఆయనే. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలో ఎంత ఎనర్జిటిక్‌గా ఉన్నారో... ఇప్పుడూ అంతే ఉత్సాహంతో పనిచేస్తున్నారాయన.
2013 ఏప్రిల్ 14న చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం చూసేందుకు వచ్చిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సెక్రటరీ జనరల్ కాలెబ్ రిఫయ్కూ గైడ్‌గా వ్యవహరించింది కాశీనాథే! ఇన్నేళ్లలో ఆయనకు వచ్చిన ప్రశంసలు అనేకం. పలుమార్లు బెస్ట్ టూరిస్ట్ గైడ్ అవార్డు అందుకున్నారు. ప్రపంచ భాషలన్నీ నేర్చుకోవాలనే తపన కాశీనాథ్రావులో కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయప ఎంఫిల్ చేస్తున్నారు. ఈ వయసులో ఇంత యాక్టివ్‌గా ఎలా ఉండగలుగుతున్నారంటే... ‘వాకింగ్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ’ అంటారాయన!.