విద్యుత్ కంచెతో రెండు చిరుతలు మృతి
సాక్షి, కాశినాయన : పంటలను కాపాడుకోవడానికి పొలానికి పెట్టిన విద్యుత్ వన్యప్రాణులను బలి తీసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనే వైఎస్ఆర్ జిల్లా కాశినాయన మండలం వరికుంట్ల గ్రామ సమీపంలో జరిగింది. నారాయణ అనే రైతు తన పంటను అడవిజంతువుల బారినుంచి కాపాడుకోవడానికి పొలం చుట్టూ విద్యుత్ తీగలతో కంచె ఏర్పాటు చేశాడు.
శుక్రవారం రాత్రి రెండు చిరుతపులులు ఆ విద్యుత్ కంచెకు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందాయి. శనివారం ఉదయం పొలానికి చెందిన రైతు నారాయణ వాటి మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టాడు. అయినా విషయం బయటకు పొక్కింది. దీంతో అటవీ అధికారులు చిరుత పులుల మృతదేహాలను వెలికి తీసి పంచనామా నిర్వహించి రైతుపై కేసు నమోదు చేశారు.