kasipeta
-
కొడుకు రాసిన మరణశాసనం
తాండూర్: ఆన్లైన్ ట్రేడింగ్ ఆ ఇంటిల్లిపాది పాలిట మృత్యుపాశమైంది. అనతికాలంలోనే డబ్బు సంపాదించాలనే కుమారుడి అత్యాశ.. కుటుంబం బలవన్మరణానికి కారణమైంది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన సముద్రాల శివప్రసాద్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి నష్టపోవడం, అప్పులు అధికం కావడం, అప్పులు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం శీతల పానీయంలో గడ్డి మందు కలుపుకొని తాగిన విషయం తెలిసిందే. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంలో శివప్రసాద్(26)తోపాటు తల్లిదండ్రులు మొండయ్య(58), శ్రీదేవి(52), అక్క చైతన్య అలియాస్ చిట్టి(30) ఒక్కొక్కరుగా గంటల వ్యవధిలో నలుగురూ బుధవారం మృతిచెందారు.యూట్యూబ్‌కు ఆకర్శితుడై..శివప్రసాద్ బెల్లంపల్లిలో కొంతకాలం ల్యాబ్ టెక్నీషియన్‌గా పని చేశాడు. గత ఏడాదిన్నర కాలంగా యూట్యూబ్ ద్వారా ఆన్లైన్ ట్రేడింగ్ వైపు ఆకర్శితుడయ్యాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. తొలుత కాస్త లాభాలు ఆర్జించాడు. ఆ తర్వాత వరుసగా నష్టాలు రావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి వద్ద అప్పులు చేయడంతో వడ్డీలు పెరిగి భారమయ్యాయి.రూ.50 లక్షలకు పైగా..అప్పులు పెరిగిపోవడంతో ఏడాది క్రితం కొంతకాలం శివప్రసాద్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో గేమ్స్ ఆడడం, స్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టడంతో అప్పులు రూ.50లక్షలకు పైగా పెరిగిపోయాయి. బ్యాంకు రుణాల పేరుతో మరికొంత అప్పు చేయడంతో మోయలేని భారమైంది. అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే దారిలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.వైకల్యం నుంచి శాశ్వత నిద్రలోకి..చైతన్య పుట్టుకతోనే దివ్యాంగురాలు కావడంతో తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచారు. మరొకరి సాయం ఉంటే గానీ జీవనం సాగించలేని పరిస్థితి కావడంతో దగ్గరుండి చూసుకునేవారు. తామందరం లేకుండా కూతురు ఎలా జీవిస్తుందోనని, చివరికి ఆమె ఎవరికి భారం కాకూడదని ఆలోచించిన తల్లిదండ్రులు తమతోపాటే గడ్డిమందు తాగించి పేగుబంధాన్ని వెంట తీసుకెళ్లారు.గ్రామంలో విషాదఛాయలుమొండయ్య కుటుంబమంతా మృతిచెందడంతో కాసిపేట గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎవరిని కదిలించినా కన్నీళ్లే దర్శనమిచ్చాయి. మొండయ్య చిరు వ్యాపారంతోపాటు ఇంటింటికీ తిరిగి పాల ప్యాకెట్లు విక్రయించడంతో అందరికీ సుపరిచితుడయ్యాడు. అందరితో కలిసిమెలిసి ఉండడంతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగింది. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నేరుగా కాసిపేట శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు చేయాలని బంధువులు నిర్ణయించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మృతదేహాలకు తాండూర్ సీఐ కుమారస్వామి, ఎస్సై కిరణ్‌కుమార్ పంచనామా నిర్వహించారు. కాగా, మృతుడు శివ ప్రసాద్ మేనమామ కోలేటి రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
రెండ్రోజుల్లో యువకుడు వివాహం.. పెళ్లి పత్రికలు పంచుతూ..
సాక్షి, మంచిర్యాల: మరో రెండ్రోజుల్లో ఆ యువకుడు పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. భాగస్వామితో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్న కలలు కల్లలయ్యాయి. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. కాసిపేట మండలం సోమగూడెం వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో నెన్నెల మండలం చిన్నలంబాడితండాకు చెందిన దరావత్ రమేష్(23) మృతిచెందాడు. సోమవారం ఎస్సై నరేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెన్నెల మండలం చిన్నలంబాడితండాకు చెందిన దరావత్ రమేష్ పెళ్లి ఈ నెల 20న జరగాల్సి ఉంది. పెళ్లి పత్రికలు పంచడానికి మోటార్‌సైకిల్‌పై వెళ్లాడు. సోమగూడెంలో తమ బంధువులకు పత్రికలు పంచి తిరిగి మోటార్‌సైకిల్‌పై నెన్నెలకు బయల్దేరాడు. కాసిపేట మండలం పెద్దనపల్లి శివారులో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో రమేష్ అక్కడికక్కడే చనిపోయాడు. కొడుకు మృతితో తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కంటతడి పెట్టించాయి. చదవండి: రేకుల ఇంటికి ఏడు లక్షల రూపాయల కరెంట్ బిల్లు.. అసలు విషయమిదే! -
వామ్మో.. కాసిపేట గని
సాక్షి, కాసిపేట(ఆదిలాబాద్) : మందమర్రి ఏరియా కాసిపేట గనిలో మంగళవారం ఉదయం షిప్టులో పైకప్పు కూలింది. ఇలా పైకప్పు కూలడం.. ఐ దురోజుల్లో రెండోసారి. గనిలోని 1వ సీం, 10డీప్, 25 లెవెల్లో పనులు నడుస్తున్నాయి. ఎస్‌డీయల్ యంత్రంతో ఆపరేటర్ బొగ్గు తీసుకొ చ్చేందుకు గనిలోకి వెళ్లాడు. అదే సమయంలో జంక్షన్లో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన పుషర్ కార్మికులు ఇద్దరు అక్కడి నుంచి పరుగెత్తడంతో ప్రాణా లు కాపాడుకున్నట్లయ్యింది. ఎస్‌డీయల్ ఆపరేటర్ లోనికి వెళ్లకున్నా.. ఇద్దరు కార్మికులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా.. ప్రాణనష్టం సభవించేదని కార్మికులు చర్చించుకుంటున్నారు. 1 వ సీంలో ప్రమాదపు అంచున పనిచేస్తున్నట్లు కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఐదురోజుల్లో రెండుసార్లు కూలిన పైకప్పు గనిలో 1సీంలో పనులపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5న 1వ సీం 7 డిప్ అఫ్ 25 లెవెల్ జంక్షన్లో పెద్దమొత్తంలో పైకప్పు కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అది జరిగిన ఐదు రోజులకే తిరిగి 10 డిప్లో ప్రమాదం జరగడంతో రక్షణ చర్యలు, అధికారులు, యూనియన్ నాయకుల తీరుపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 7డిప్లో కూలినట్లు కూలితే తమ ప్రాణాలు దక్కేవి కావని, తక్కువ పరిమాణంలో కూలడంతో బతికిపోయామని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. జరిగిన ప్రమాదాలను బయటకు రాకుండా సింగరేణి అధికారులు గోప్యంగా ఉంచడం మినహా రక్షణచర్యలు, కార్మికుల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మొదటిసారి జరిగిన ప్రమాదంపై రెండురోజుల క్రితం గనిని సందర్శించిన ఉన్నతాధికారులు.. 1సీం పనులపై ఆగ్రహం వ్యక్తం చేవారు. అయినా గని అధికారుల్లో స్పందన లేకుండాపోయింది. దీంతో మరోసారి పైకప్పు కూలడం చర్చనీయాంశంగా మారింది. బొగ్గును టాప్కు వదలడమే సమస్య? గనిలో రూఫ్బోల్ట్ వేసేక్రమంలో బొగ్గును సైతం టాప్కు వదలడమే సమస్య అనే ఆరోపణలున్నాయి. గతంలో రూఫ్‌టాప్ బండకు వేసేవారు. దీంతో రూఫ్ నుంచి నీరు లీకేజీ అవుతుండడంతో పనిస్థలాల్లో ఎస్‌డీయల్ యంత్రాలు నడవడం కష్టమవుతుందని అధికారులు బొగ్గును టాప్కు వదిలి రూఫ్ వేస్తున్నారు. రూఫ్ టచ్ కావలంటే 10 ఫీట్లు అవసరం కాగా.. గనిలో కేవలం ఆరుఫీట్లు మాత్రమే ఉండటంతో బోల్టు మధ్యలో ఉంటున్నట్లు కార్మికులు చెబుతున్నారు. దీంతో రూఫ్‌కు బొగ్గుకు మధ్యలో ఉండే క్లే కు నీరు వచ్చి తడిసి పైకప్పు కూలుతున్నట్లు తెలుస్తోంది. జంక్షన్లో సక్రమంగా రూఫ్‌బోల్టు వేయడం.. బొగ్గును వదిలి బండకు రూఫ్‌బోల్టు వేస్తెనే కూలకుండా ఉంటుందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి 1సీంలో ఐదుసార్లు పైకప్పు కూలినప్పటికీ అధికారుల చర్యల్లో మాత్రం మార్పు రావడంలేదు. ప్రస్తుతం జరిగే ప్రమాదాలు పెద్దవి అయినప్పటికీ ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భయాందోళన మధ్య విధులు నిర్వర్తిస్తున్నామని, ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదం తప్పదని, వెంటనె చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. -
మా భూములు లాక్కుంటున్నారు
సాక్షి,కాసిపేట: అన్యాయంగా 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమ భూములను అటవీ శాఖ అధికారులు కేసులు పె డుతూ లాక్కుంటున్నారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాసిపేట మండలంలోని పెద్దనపల్లి గ్రామపంచాయతీ నాయకపుగూడ శివారులోని భూములు ఎన్నో ఏళ్లుగా గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. కాని ఈ మ ధ్య కాలం నుంచి అటవీశాఖ అధికారులు తమ భూములు అంటూ సాగు చేసుకుంటున్న గిరిజనులను బెదిరించి కేసులు పెడుతున్నారు. వారం రోజుల క్రితం సాగు చేసుకునేందుకు వెళ్లిన రైతుపై, ట్రాక్టర్‌పై కేసు నమోదు చేయడంతో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంబంధిత అటవీశాఖ అధికారులతో వాదనకు దిగారు. 1978లో 116 మందికి 188 ఎకరాలు ప్రభుత్వం అసైన్డ్ చేసింది. లావణి పట్టాలు కలిగి ఉన్న రైతులు కొంత మంది సాగు చేసుకోగా కొంత మంది పడావుగా వదిలేశారు. ఈ మధ్య కాలంలో సాగు చేసుకునేందుకు గిరిజనులు మా భూములు అంటూ వెళ్తుండగా బెల్లంపల్లి డివిజన్ అటవీశాఖ అధికారులు అడ్డుపడుతున్నారు. దీంతో గిరిజనులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారం రోజుల క్రితం అక్రమ కేసులు పెట్టడంతో సర్పంచ్ వేముల కృష్ణ ఆధ్వర్యంలో గిరిజనులు ఆందోళనకు సిద్ధమవుతూ అధికారులను కలిసి విన్నవించారు. దీనిపై రెవెన్యూ అధికారులు తమ భూములని లావణి పట్టాలు ఉన్నాయని చెబుతుండగా, అటవీశాఖ అధికారులు తమ భూములని అంటున్నారు. దీంతో ఇరుశాఖల మధ్య సమన్వయం లోపించడం గిరిజనులకు శాపంగా మారింది. కనీసం రెండేళ్ల నుంచి ఏం తేల్చకుండా రైతులను వేధింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు పట్టాలు ఉన్న భూములను తమకు ఇప్పించాలని లేనట్లయితే మరోచోట భూమి చూపాలని డిమాండ్ చేస్తున్నారు. గిరిజనులను వేధించడం సరికాదు.. ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసు కుంటున్న గిరిజన రైతులను అటవీశా ఖ అధికారులు ఇబ్బందులకు గురి చే యడం సరికాదు. దీనిపై ఇరు శాఖల అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సమ స్యను పరిష్కరించాలి. లేదంటే ఆందో ళనలు ఉధృతం చేస్తాం. వేముల కృష్ణ పెద్దనపల్లి యాబై ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాం.. ప్రభుత్వం 1978లో తమకు భూములు అసైన్డ్ చేయడంతో అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ప్రస్తుతం అటవీశాఖ అధికారులు వచ్చి తమ భూములంటూ బెదిరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాకు న్యాయం చేయాలి. – మెసయ్య, రైతు -
భూ సేకరణ వేగవంతం
కాసిపేట : కాసిపేట మండలంలోని పల్లంగూడ, కనికలాపూర్ గ్రామాల మధ్య చేపట్టనున్న కాసిపేట 2 ఇంక్లైన్ నూతన గని నిర్మాణానికి సంబంధించి భూసేకరణను రెవెన్యూ, సింగరేణి అధికారులు వేగవంతం చేశారు. నిర్వాసిత రైతులకు ఎలాగోలా నచ్చజెప్పి ఒప్పించడంలో అధికారులు సఫలమయ్యారు. గనికి 82 ఎకరా లు అవసరం కాగా.. 49 మంది రైతులకు చెందిన భూమి తీసుకోనున్నారు. నూతన భూే సకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని రైతులు పట్టుపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు దిగి వచ్చి నూతన భూసేకరణ చట్టం ప్రకారం చెల్లిస్తామని హా మీ ఇచ్చారు. అయితే నూతన చట్టం మార్గదర్శకాలు వెల్లడి కానందున రైతులు వెల్లడి అయిన తరువాత భూమి ఇస్తామని దాటవేస్తూ వచ్చారు. నూతన భూగ ర్భ గనులకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు పనులు వేగవంతం చేశారు. మంచిర్యాలలో చర్చలు ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం నిర్వాసిత రైతులను మంచిర్యాల ఆర్డీవో కార్యాలయానికి పిలిచి ఆర్డీవో, సింగరేణి అధికారులు చర్చలు నిర్వహించా రు. నూతన చట్టం ప్రకారం పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, స్థానికులకు కాంట్రాక్టు ఉద్యోగాలు తదితర డిమాండ్లు నిర్వాసితులు అధికారుల ముందు పెట్టారు. దీనిపై అధికారులు ప్రస్తుతం ఉద్యోగాలు ఇవ్వడం తమ పరిధిలో లేదని సీఅండ్ఎండీతో మా ట్లాడి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగాలు స్థానికులకు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్ర స్తుతం నిర్ణయించిన ధర కాకుండా కొత్త చట్టం అమ లు ప్రకారం భూములకు పరిహారం చెల్లించనున్నట్లు తెలిపారు. అప్పటి వరకు పాత ధర కంటే అధికంగా రూ.3.69 లక్షలు చెల్లించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ప్రస్తుతం రూ.4 లక్షలు చెల్లించాలని, మిగతా సొమ్ము నూతన చట్టం ప్రకారం చెల్లించాలని కోరగా... ఉన్నతాధికారులతో మాట్లాడి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలుపడంతో నిర్వాసితులు అంగీకరిం చారు. గ్రామాల అభివృద్ధితో పాటు సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో ఒ ప్పందం కుదిరితే అభ్యంతరం లేదని చెప్పారు. దీం తో అభివృద్ధిపై యాజమాన్యం హామీ ఇచ్చి రైతుల ద్వారా అగ్రిమెంటు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ నాటికి ప్రారంభించాలని... అన్ని అడ్డంకులు తొలగించుకొని ఈ సంవత్సరం అక్టోబర్ వరకు నూతన గని పనులు ప్రారంభించనున్నారు. సింగరేణి వ్యాప్తంగా ఆరు నూతన గనులు ఏర్పాటు కానుండగా కాసిపేట 2 ఇంక్లైన్ గని మొదటగా ఉత్పత్తి సాధించనుంది. కాసిపేట గని ద్వారా కాసిపేట, ముత్యంపల్లి గ్రామాలు నష్టపోయిన కారణంతో ఓపెన్‌కాస్టు, గనులకు స్థానికులు అడ్డంకులు సృష్టించినా నూతన గని విషయంలో అడ్డంకులు తీరడంతో అధికారులు ఆనందంలో నిర్మాణానికి ముందుకు వస్తున్నారు. -
మావోల డంప్ లభ్యం
బెల్లంపల్లి : ఆదిలాబాద్ జిల్లా కాసిపేట మండలం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్ పోలీసులకు లభ్యమైంది. ఎస్పీ గజరావుభూపాల్ కథనం ప్రకారం.. వెంకటాపూర్ గ్రామ శివారు అటవీ ప్రాంతంలో మావోయిస్టుల ఆయుధాల డంప్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. చెరువు పైభాగం వెదురు పొదల పక్కన పోలీసులకు నల్ల కవర్ కనిపించడంతో గుంత తవ్వి బయటకు తీయ గా అందులో ఆయుధాలు, పేలుడు పదార్థాలు కని పించాయి. ఆరు గ్రేనెడ్లు, నాలుగు టిఫిన్ బాంబులు, నాలుగు ఎస్బీఎంఎల్ తుపాకులు, ఆరు ఎస్బీబీఎల్ బ్యారెల్స్, పాయింట్ 38 రివాల్వర్, ఏడు లైవ్‌రౌండ్స్, నాలుగు పాయింట్ త్రినాట్‌త్రీ రైఫిల్స్‌మెగజిన్స్, మూడు మెగజిన్‌బాక్స్‌లు, 23 ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, నాలుగు స్ప్రింగ్స్, ఐదు పిన్‌బోల్ట్స్, తొమ్మిది టీటైప్‌పిన్‌బోల్ట్స్‌ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం వీటిని మంగి దళానికి చెందిన మావోయిస్టులు ఈ డంప్ దాచిపెట్టినట్లు ఎస్పీ తెలిపారు. మారణాయుధాలు, పేలుడు పదార్థాలు తుప్పుపట్టినట్లు పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు ఆదిలోనే ఇక్కట్లు
కాసిపేట, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో భాగంగా యాభై యూనిట్లలోపు విద్యుత్ వాడుకుంటే ఎస్సీ, ఎస్టీలకు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ ఆదివాసీ గిరిజనులకు కలగానే మిగలనుంది. ఉచిత విద్యుత్ అందించాలంటే సంబంధిత కులధ్రువీకరణ పత్రాలు అందించాలని అధికారులు స్పష్టం చేయడంతో గిరిజనులకు అవగహన లేక మీసేవ, రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయినా.. వారికి సర్టిఫికెట్లు అందడం లేదు. సర్టిఫికెట్లు అందించె గడువు ముగిసినా నేటికీ 50 శాతం మంది కూడా ధ్రువీకరణపత్రాలు ఇవ్వలేదు. కాసిపేట మండలంలో మొత్తం 3,100 కనెక్షన్లు ఎస్సీ, ఎస్టీలకు చెందినవిగా నమోదయ్యాయి. వీరంతా ఉచిత విద్యుత్‌కు అర్హులు కాగా.. ఇప్పటి వరకు కేవలం 650 మంది (22శాతం) మాత్రమే కులధ్రువీకరణ పత్రాలు అందించారు. గిరిజనులకు అవగహన కల్పించాల్సి ఉన్నా.. అధికారుల సహకారం ఆ దిశగా కనిపించడం లేదు. విద్యుత్‌శాఖ అధికారులు గ్రామాల వారిగా మీటర్ల నంబర్ల ఆధారంగా లబ్ధిదారుల జాబితా తయారుచేసి రెవెన్యూ అధికారులతో ధ్రువీకరణ చేసి పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. అయితే.. అధికారులు మాత్రం మిన్నకుండిపోయారు. ఒక్క బల్బు మాత్రమే వాడే మారుమూల ప్రాంతాల ఆదివాసీలకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల వారు కోరుతున్నారు. కేవలం 22 శాతం మంది మాత్రమే పత్రాలు అందించడంపై ఎంత వెనకబడి పోయారో తెలుస్తోందని, ప్రభుత్వ పథకం గిరిజనులకు అందకుండా చేయడం దారుణమని, గడువుపెంచి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.