శ్రీకాంతాచారి విగ్రహం ధ్వంసం
నిరసనగా రోడ్డుపై శంకరమ్మ బైఠాయింపు
మేళ్లచెర్వు: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి విగ్రహాన్ని నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండల కేంద్రంలో శనివారంరాత్రి దుండగు లు ధ్వంసం చేశారు. విగ్రహం కుడిచేతిని విరగ్గొట్టారు. ఇటీవల అక్కడ శ్రీకాంతాచారి సిమెంట్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఈ నెల 1న మంత్రి హరీశ్‌రావు ప్రారం భించాల్సి ఉంది. అయితే ఆ రోజు కార్యక్రమం రద్దు కావడంతో తేదీని ఇంకా ఖరారు చేయలేదు. ఈ లోపే విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
దుండగుల చర్యను నిరసిస్తూ ఆదివారం మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఆధ్వర్యంలో రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. శంకరమ్మ మాట్లాడుతూ ఉద్యమకారుల విగ్రహాలను ధ్వంసం చేయడం పిరికిపందల చర్యగా పేర్కొన్నారు. అనంతరం మండలానికి చెందిన అల్లం ప్రభాకర్‌రెడ్డి, రంగాచారి, హరిలక్ష్మణ్ కుమార్, ఉమాకాంత్‌లపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎస్ఐ శ్రీనివాసరెడ్డికి ఫిర్యాదు చేశారు.